ధనికుడు అనగానే… వ్యాపారి అనగానే… మరీ ప్రత్యేకించి ఏదైనా మెగా కంపెనీ ఓనర్ అనగానే… ఓ ఫీలింగ్… ఎంతమందిని ముంచి, దోచి సంపాదించాడో అని… సమాజంలో జనరల్‌గా ఉండే ఫీలింగ్… వాళ్లు చేసే మంచి పనులేమైనా ఉంటే మనం ఓపట్టాన గుర్తించడానికి ఇష్టపడం… పైగా వాడి ఔదార్యం వెనుక ఇంకేదో కథ ఉండే ఉంటుందని బలంగా నమ్ముతుంటాం… ఎంత మల్టీ మెగా బిలియనీర్ అయినా సరే స్వార్థ కారణం లేకుండా ఎవరికీ ఏమీ సాయం చేయడు కదా అనుకుంటాం…
కానీ తనకు ఏమాత్రం తెలియనివాడు, తన వ్యాపారాలతో ఏ లింకూ లేనివాడు, ఓ సాదాసీదా వలస ఉద్యోగి ప్రాణం రక్షించడానికి ఓ కోటి రూపాయలు ఇచ్చాడు లులూ గ్రూప్ ఓనర్ యూసుఫ్ అలీ… లులూ గ్రూప్ అంటే చాలా ఫేమస్, అరబ్ ఎమిరేట్స్‌లోనే కాదు, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, ఇంకా పలు దేశాల్లో హైపర్ మార్కెట్స్, సూపర్ మార్కెట్స్, పెద్ద పెద్ద రిటెయిల్ మార్కెట్ నెట్‌వర్క్… వెరీ బిగ్ షాట్… స్వతహాగా కేరళైట్… గల్ఫ్ దేశాల్లో పనిచేసే లక్షల మంది ఇండియన్లలో కేరళైట్లే ఎక్కువ… ఇప్పుడు విషయానికొస్తే…
Ads
అది 2012… కేరళ నుంచి ఎమిరేట్స్ వెళ్లి పనిచేసుకుంటున్న బెక్స్ కృష్ణన్ అనే ఓ ఉద్యోగి ఓ రాత్రి నిర్లక్ష్యంగా కారును ఓ పిల్లల గుంపు మీదకు ఎక్కించడంతో… సూడాన్‌కు చెందిన ఓ అబ్బాయి మరణించాడు… ఎమిరేట్స్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి… కృష్ణన్‌ను పట్టుకున్నారు, కేసు పెట్టారు, విచారించారు… మరణశిక్ష పడింది… నిర్లక్ష్యం నిజమే, ప్రమాదమూ నిజమే, కానీ శిక్ష ఏకంగా ప్రాణాలు తీసేయడమేనా..?
ఇక్కడ కేరళలో ఆయన కుటుంబం, ఎమిరేట్స్‌లో తోటి ఉద్యోగులు అందరూ విచారంలో మునిగారు… ఇండియన్ ఎంబసీ ద్వారా ఏవేవో ప్రయత్నాలు చేశారు… ప్చ్, లాభం లేదు… కాకపోతే ఒక చిన్న మార్గం కనిపించింది… అదొక్కటే ఆశారేఖ… ఏమిటంటే..? యాక్సిడెంటులో మరణించిన సదరు సూడాన్ అబ్బాయి పేరెంట్స్ గనుక కృష్ణన్‌ను క్షమిస్తే… ఈ శిక్ష రద్దవుతుంది… కానీ…
ఆ పేరెంట్స్ వాళ్ల స్వదేశం సూడాన్‌కు వెళ్లిపోయారు… వాళ్లను కలవడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిలయ్యాయి… ఏళ్లు గడుస్తున్నయ్… ఇక్కడ కృష్ణన్ భార్య వీణ, ఒక కొడుకు… అక్కడ అబూధాబీలోని అల్‌వాత్‌బా జైలులో కృష్ణన్… ఈయన దోస్త్ సేతు చివరి ప్రయత్నంగా ఒక మంచి సోర్స్ దొరికితే లులూ గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీని కలిశాడు… విషయం మొరపెట్టుకున్నాడు… నీవే దిక్కు అన్నాడు…
కేవలం మానవతా దృక్పథంతో సాయం చేయాలి అంతే… కానీ అంత ఈజీ కాదు కదా… యూసుఫ్ వైపు కారణాలు, కోణాలు ఏమైనా ఉండనివ్వండి… నేనున్నాను అన్నాడు… ముందుగా సూడాన్ పేరెంట్స్ దగ్గరకు పంపించారు… వాళ్ల పేదరికం వాళ్లను బేరానికి దింపింది… చివరకు 5 లక్షల దీరమ్స్, అంటే దాదాపు కోటి రూపాయలిస్తే క్షమిస్తాం అన్నారు… ఆ డబ్బు కూడా యూసుఫే ఇచ్చాడు…
మిగతా ప్రొసీజర్ చకచకా పూర్తయింది… ఏమిటీ ఔదార్యం అనడిగితే… ‘‘పైన ఉన్న దేవుడు సాయం చేయాలనుకున్నాడేమో… నారూపంలో సాయం చేశాడేమో, అంతే…’’ అన్నాడు యూసుఫ్ అలీ…! కృష్ణన్ బుధవారం ఎమిరేట్స్ నుంచి కొచ్చిన్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు… భార్య వీణ, పదేళ్ల కొడుకు అక్కడికి వచ్చారు… ఇప్పటికీ వాళ్లు నమ్మలేకపోతున్నారు… ‘‘ఇది నాకు పునర్జన్మ… ఇంకేం చెప్పలేను..?’’ అని ఉద్వేగంతో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు… నిజంగానే కృష్ణన్ కోణంలో ఇదంతా ఓ నమ్మలేని కథే… ఈ సాయానికి సంబంధించి… యూసుఫ్ అలీకి ‘ముచ్చట’ అక్షరాభినందనలు…!!
Share this Article