.
… ప్రసేన్ బెల్లంకొండ…. మెదడుకు చెమట పట్టించుకుంటూ కఠోర దీక్షతో పుస్తకాలు చదవాల్సొచ్చే వయసొకటుంటుంది. సాహిత్యం అపుడపుడే పరిచయం అవుతున్నకాలంలో నువు ఫలానా పుస్తకం చదవలేదా ‘ వెవ్వెవ్వే ‘అని అంటారేమో అన్న ఆందోళన పీడించే వయసది.
నాకది నలభైనాలుగేళ్ల క్రితం. ఇప్పుడు అలా నేను అప్పుడు చదివిన ఓ నవల ఆధారంగా తీసిన వెబ్ సిరీస్ గురించి మాట్లాడాలి.
Ads
వాడెవడో మనకు తెల్వదుగానీ అప్పుడందరూ మార్వ్కెజ్ అని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అదేదో హండ్రెడ్ ఇయర్స్ అఫ్ సాలిట్యూడ్ అని అబ్బురపడిపోతున్నారు. ఇంకేదో మాంత్రిక వాస్తవికత అని పేర్లు పెట్టేసుకుంటున్నారు. అదంతా మనకేమో తెల్వదు. కానీ తగ్గకూడదు కదా. పైగా మా ఇంగ్లీషు లెక్చరర్ కంటే నాకే ఎక్కువ ఇంగ్లీషు వచ్చు అని బలిసి కొట్టుకుంటున్న రోజులాయే.
పుస్తకం కొన్నాక గర్వము సర్వము ఖర్వమైనది. ఒక ఇంగ్లీషు నవలను నిఘంటువు దగ్గర పెట్టుకుని చదవడం ఎంత నరకమో మొదటిసారి తెలిసొచ్చింది. నిఘంటువు సహకారంతో వాక్యంలోని అన్ని పదాల అర్దాలు తెలిసినా కూసింతైనా అర్దం కాకపోవడం ఎంత నరకమో కూడా తెలిసొచ్చింది.
నిఘంటువు అవసరమే లేని పదాల అర్దాలు తెలిసి కూడా వాక్యం అర్దం కాకపోవడం ఇంకెంత రౌరవ నరకమో పూర్తిగా తెలిసొచ్చింది.
బోలెడన్ని పాత్రల పేర్లు ఒకటే కావడమేమిటో, అన్నాచెల్లీ పెళ్లి చేసుకోవడమేమిటో, తల్లీ కొడుకు రమించడమేమిటో, సముద్రం కోసం వెతికేవాడు మంచుముక్కకు ఆశ్చర్యపోవడమేమిటో, మనం చంపేసినవాడు మన చుట్టూ తచ్చాడుతూ వేధించడం ఏమిటో, గుక్కలు గుక్కలు మట్టి బుక్కడమేమిటో, చేసంచిలో ఎముకలు పుర్రెలు వేసుకుని తిరగడమేమిటో అనే ప్రశ్నార్ధకాల దాడిని కప్పెట్టి మొత్తం మీద ముగించి హమ్మయ్య నేమ్ డ్రాపింగ్ కు పనికొస్తదిలే అని మెదడుకే కాక మనసుకూ పొగరుకూ కూడా పట్టిన చెమట తుడుచుకున్న రోజులవి.
ఇందులో ఏదో ఉంది కానీ మన గుజ్జుకు అందట్లేదులే అనుకున్న ప్రజాస్వామిక ఆలోచనా కాలమది. నిజానికి చెత్తెహె అని చప్పరించాల్సిన పరిస్తితి. మరోవైపు నాదైన వాక్యం కోసం వెతుక్కుంటున్న చీకట్లో దొరికిన సింటాక్స్ తాళంచెవి అనిపించి అకారణంగానే పుస్తకంతో ప్రేమలో పడిపోయాను. అందుకేనేమో ఈ నవల తెలుగు అనువాదం ఉందని తెలిసీకూడా ఆ జోలికి పోలేదు.
సీన్ కట్ చేస్తే మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే పాతికేళ్ల క్రితం పాత పుస్తకాల సర్దుడు సందర్బంలో అదే నవల కనపడితే కమ్ ఎగైన్ అని ఓ రాత్రంతా కూచుని సాధన చేస్తే గతంకంటే మెరుగు. పాత్రల పేర్లు అలా ఎందుకున్నాయో అర్దమైంది.
కథలోపలి ఇన్సెస్ట్ అవగాహనకొచ్చింది. నిఘంటువు సాయం లేకుండా వాక్యాల భావం అంతు చిక్కింది. నిఘంటువు అవసరమే లేని మామ్మూలు పదాల సమూహం చేసే విన్యాసం కూడా అర్దం అయింది.
మాంత్రికతలో మర్మం మైమరిపించింది. వాస్తవికతలో మాయ ఆస్వాదననిచ్చింది. పర్లేదు నేమ్ డ్రాపింగ్
దాటొచ్చేసానన్న నమ్మకం వచ్చింది. అయినా ఏదో వెలితి. ఇంకా ఏదో తెలుసుకోవల్సింది ఇందులో ఉంది అన్న దేవులాట. వెరసి మరింత చిక్కబడ్డ ప్రేమ. సరే ఏదైనా కావచ్చు గానీ ఈ నవలను సినిమాగా అయితే చూస్తానని కలలో కూడా అనుకోలేదు.
మళ్లీ సీన్ కట్ చేస్తే రెండు నెలల క్రితం నెట్ఫ్లిక్స్ వాళ్లు అదే నవల ఎడాప్షన్ ను వెబ్ సిరీస్ తీస్తున్నారని తెలిసి దాన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటే ఐదు రోజుల క్రితం అది వర్చువల్ బాధ్యతగా గుర్తు చేసింది. రాత్రంతా కూచుని ఏక బిగిన ఎనిమిది ఎపిసోడ్లు చూసేసా. నా పురా ప్రేమ ఎందుకో చాలా మేరకు అర్దమైంది. ఇది మార్క్వెజ్ తో మూడో ప్రేమ.
ఇదొక అనధికారిక చరిత్ర. ఇదొక ఊహాత్మక లాటిన్ అమెరికన్ చరిత్ర. ఇదొక సామాజిక రాజకీయ కథనం. ఇదొక తాత్విక అద్బుతం. సాంప్రదాయ శాపాలు, విషాద ప్రేమ, మానవ నైజంలోని అవకరాలు, ఏదైనా సగమే దక్కడం అనే విధి ఈ కథ వెనుక కథలు. వాస్తవం, ఊహ విడివడనంత కలగలిసిపోయిన ఆకృతి. నిత్య జీవితంలో సంస్క్రుతిని అందంగా అమర్చిన మార్మికత.
కాలం లేని మృత్యువు లేని పట్టణంలో ఏడు తరాల బ్యూండియా కుటుంబపు ప్రేమాన్వేషణ. కలగా నిర్మించుకున్న ఇళ్లలోకి రాజ్యము మతము ప్రవేశిస్తే జరిగే నష్టం తీవ్రత ఇది. ఇక్కడ కథ గురించిన వివరం అనవసరం. నేను కేవలం నవల సిరీస్ గా మారడం గురించే మాట్లాడాలనుకున్నాను.
ఎందుకంటే నవల చదివిన వాళ్లు మాత్రమే సిరీస్ చూడడానికి ఉత్సాహ పడతారు తప్ప నవలా పాఠకులు కానివాళ్లు మొత్తం ఎపిసోడ్లు చూడరు అని నా విశ్వాసం. నవల చదవకుండా ఒక వేళ పొరపాటున ఎవరైనా సిరీస్ చూసినా మళ్లీ వెనక్కి వెళ్లి నవల చదువుతారన్న నమ్మకం కూడా నాకు లేదు. అందుకే కేవలం దృశ్యాక్షర తులనాత్మకతకే నా ఈ గోడు పరిమితం . అక్కడక్కడా మాట తప్పినా పెద్దగా పట్టించుకోకండి. ఎందుకంటే స్పాయిలర్లు రివీలింగ్ లు ఇక్కడ వర్తించకపోవచ్చు.
అక్షరాలలోకి నైపుణ్యంగా జొప్పించగల మాంత్రిక వాస్తవికతను దృశ్యంలో చూపించడం సాధ్యమా. సినిమాలు కదిలే బొమ్మలను చిందరవందర చేసి దాన్నే మాంత్రిక వాస్తవికత అంటున్నాయా. దృశ్యంలో అధివాస్తవికతకు మాంత్రిక వాస్తవికతకూ నడుమ స్పష్టమైన రేఖను సెల్యులాయిడ్ గీయగలదా. నాన్ లీనియర్ అమరికతో మాంత్రిక వాస్తవికతను సాధించామని దర్శకులు సంబర పడిపోతున్నారా. మాంత్రిక వాస్తవిక సినిమా అన్నపుడు తొలిచిన సందేహాలివి.
హోలీ షిట్, రిస్ట్ కట్టర్స్, ఎన్ కాంటో, ఎటర్నల్ సన్ షైన్, సైన్స్ అఫ్ స్లీప్ లాంటి సినిమాలను సర్రియలిజం అనాలా, మాజికల్ రియలిజం అనాలా, నాన్లీనియర్ అనాలా అనే విషయంలో దశాబ్దాలుగా కొట్టుకుంటూనే ఉన్నారు కానీ ఎవరూ గెలవలేదు ఎవరూ ఓడలేదు. ‘ ఆ ‘ సినిమాను అబ్సర్డ్ అని నేను, నహి నహి అని జంపాల చౌదరిగారు కుస్తీ పట్టాం. ఆయన గెలిచారేమో కానీ నేను ఓడలేదు. ఇప్పుడిదిగో ఇంకో పులి మీద పుట్ర హండ్రెడ్ ఇయర్స్ అఫ్ సాలిట్యూడ్ వచ్చి పడింది.
నవల దృశ్యంగా అనువాదం అయిన క్రమంలో నాన్ లీనియర్ నారేషన్ కాస్తా లీనియర్ అయింది. అంటే నవలలో చిక్కిరి బిక్కిరిగా ఉన్న సంఘటనలు సిరీస్ లో ఒక వరుసలో మర్యాదగా క్యూ కట్టాయి. టైం లైన్ మాత్రం స్పష్టంగా ఆవిష్క్రుతమైంది. అదేంటో తరాలు మారుతున్నా పాత్రల పెద్దరికం రూపంగా మారినట్టు చాలా చోట్ల కనపడదు. కనుకనే టైంలెస్ నగరంలో కథ నడిపాడేమో బహుశా.
అందుకే కావచ్చు మార్క్వె జ్ తన ఈ నవలను సినిమాగా తీయడానికి అనుమతించలేదు. చిత్రీకరించలేని నవల అని బల్ల గుద్ది నిరాకరించాడు. ఆయనలేడు కనుక వారసులు అనుమతించడమో అమ్ముకోవడమో చేయడంతో నెట్ఫ్లిక్స్ కు అవకాశం వచ్చింది. మొత్తం పదహారు ఎపిసో డ్లుట, ఇప్పటికి 8 తీసి వదిలారు. మరో 8 సంవత్సరం తరవాతట.
నవల విస్తృతి, నోబెల్ బహుమతి, నానా భాషల అనువాదాలు, కోట్ల ప్రతుల అమ్మకం వల్ల కావచ్చు బుల్లి తెరానువాదంలో నవలను రవ్వంత కూడా మార్చలేదు. యథాతథంగా పుస్తకానికి విధేయంగా ఉన్నారు. అక్షరాన్ని దృశ్యంగా మార్చడంలో గెలిచారో లేదో తెలియదు కానీ అక్షరానికి దృశ్యాన్ని విధేయంగా ఉంచడం మాత్రం నచ్చింది.
‘ వాళ్లు ఒకళ్లకొకళ్లు అతి దగ్గర, విడిపోవడానికి మృత్యువొక్కటే మార్గమని వాళ్లనుకున్నారు’ అనే వాక్యాన్ని చదువుకోగలం, చదివి వినిపించగలం తప్ప దృశ్యంగా అనువదించలేం కదా. ‘ అతను చావు చివర్లకు వెళ్లి అక్కడి ఏకాంతాన్ని తట్టుకోలేక తిరిగొచ్చేసాడు’ అనే వాక్యం ఏ బొమ్మలతో ఏ రంగులతో దృశ్యంగా మారగలదు.
నవలలో ఇటువంటి వాక్యాలు కుప్పలు తెప్పలు. ఇంత స్పష్టంగా అర్దం కాని మరెన్నో వాక్యాలు కూడా ఇబ్బడి ముబ్బడి. ఏ ఫ్రేంలో ఏం ఇరికిస్తే,ఏ జూమిన్ జూమవుట్ లు వెనుకా ముందాడితే అధివాస్తవిక మార్మికతను కళ్లకద్దగలవు. అయినా బావుంది.
ఇంత మోహంలోనూ ఏదో లోపం. దృశ్యంలో మాజికల్ రియలిజం ఎక్కడ. భాషతో మార్క్వెజ్ చెడుగుడాడిన భావ వ్యాకరణం ఎక్కడ. ఎక్కడో ఎత్తుమీంచి భాష ఎందుకలా నేలకు దూకింది. చదివేపుడు ఉండే చిక్కదనం మిస్సింగ్. పదాల్లోపలి గాఢత గల్లంతు. అలాఅని సిరీస్ నచ్చలేదని కాదు. బాగోలేదనీ కాదు. ఆబగానే చూసాను. చాలా చాలా నచ్చింది. అంతు చిక్కని చాలా వాటిమీద ఏర్పడే వెర్రి వ్యామోహం పని చేసిందేమో బహుశా.
ఫిర్యాదులేదు.
.
ఒక చిక్కటి అక్షరానికి పారదర్శక దృశ్యరూపం .
ఒక లోతైన భావానికి పొడవు వెడల్పుల దృష్టి.
మార్క్వెజ్ బొమ్మ అదిరింది.
చూడండి. తప్పక.
నష్టమేం లేదు.
ఓ నిద్రలేని రాత్రి అనుకుంటే పాయె.
నిద్రొచ్చినా బెంగేం లేదు. కొన్ని వేడి వేడి మసాలా దృశ్యాలు హరికథలో గోవిందా కొట్టినట్టు నిద్ర లేపుతుంటాయి…..
Share this Article