నిన్ననే కదా… రైలు పట్టాల మీద ఓ తల్లి తన బిడ్డ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన సాహసం, ప్రేమ, తెగువ చదివాం, వీడియో చూశాం… అందరమూ చప్పట్లు కొట్టాం… దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని మరోసారి చెప్పుకుని ఆనందపడ్డాం కదా… కానీ కొన్ని పూర్తి వ్యతిరేక మొహాలు ఉంటయ్… ప్రియుల కోసం కన్నబిడ్డలకు విషం పెట్టి కడతేర్చిన తల్లుల కథలు విన్నాం కదా, చదివాం కదా… ఇదీ అలాంటిదే… ఓ తల్లి, కాదు, ఓ భూతం కథ,.. అమ్మ రూపంలోని ఓ పిశాచి కథ…
బాగా చదువుకున్నారు… మోడరన్ హ్యూమన్స్… రెక్కలు కట్టుకుని ఎక్కడెక్కడికో విదేశాలకు వెళ్లి బతుకుతున్నారు… సో వాట్, ఆ నెత్తుటిలో ఉండే అసలు గుణం ఎక్కడ పోతుంది..? నార్త్ కరోలినా రాష్ట్రంలోని మోరిస్ విల్లే… ప్రశాంత ప్రాంతం… అందరూ నాగరికులే… అభ్యుదయ సమూహం… కానీ అక్కడ ఓ విషపురుగు… భారతీయ మహిళే… పేరు ప్రియాంక తివారీ…
భార్యాభర్తలు… పదేళ్ల కొడుకు… కానీ ఆ ఇద్దరి నడుమ ఎప్పుడూ కీచులాటలు… బయటికి కనిపించవు… కానీ ఆ అగాధం పెరిగిపోయింది… ఆమెలో జడలు విప్పుకుంటున్న రాక్షసిని గమనించాడు, భయపడ్డాడు… ఇక ఈమెతో బతకలేనని అనుకుని తన వస్తువులు తీసుకుని వెళ్లిపోయాడు… వెళ్తూ వెళ్తూ పోలీసులకు తన ఇంటిపై నిఘా వేసి ఉంచాలని కోరాడు… కారణం, ఆమెతోపాటు కొడుకు ఉన్నాడని… పిచ్చోడు, కొడుకును కూడా తీసుకుని వెళ్తే బాగుండేది… తల్లి కదా, కొడుకును బాగానే చూసుకుంటుందిలే అనుకున్నట్టున్నాడు…
Ads
తరువాత కొద్దిరోజులకు ఏమనుకున్నాడో ఏమో గానీ, గృహహింస రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు… కొన్నాళ్లు గడిచాయి… ఎన్నిసార్లు ఇండియా నుంచి ఎందరు ఫోన్లు చేసినా ఆమె నుంచి స్పందన ఉండేది కాదు… సదరు గృహహింస అధికారులకు కూడా ఫోన్లు వచ్చాయి… ఇదిలా సాగుతుండగా ఓరోజు సాయంత్రం అయిదున్నరకు ఆమె 911 కు ఫోన్ చేసింది… తన కొడుకు స్థితి బాగా లేదనీ, స్పందించడం లేదనీ చెప్పింది…
అధికారులు తక్షణం అక్కడికి చేరుకున్నారు… బాలుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించి అధికారులే నిశ్చేష్టులయ్యారు… చివరి ప్రయత్నంగా సీపీఆర్ చేసి ఆ పిల్లాడిని కాపాడాలని ప్రయత్నించారు… కానీ ఆ పిల్లాడు లోకం విడిచి వెళ్లిపోయాడు… ఇదంతా జరుగుతుంటే ఆమె మొహంలో ఏ ఫీలింగూ లేకుండా చూస్తూ నిలబడింది… నిజానికి ఆ పిల్లాడు రెండు రోజుల క్రితమే మరణించాడని వైద్యులు చెప్పారు… తను చనిపోయేనాటికి చాలా బరువు కోల్పోయాడని నిర్ధారించారు…
ఎస్, ఆమె సొంత కొడుకుకు ఆహారం పెట్టక ఆకలితో మరణించేలా చేసింది… అధికారులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిస్తే, ఏ ఫీలింగూ లేక జడ్జి ముందుకు వచ్చి నిలబడింది… పశ్చాత్తాపం, బాధ, శోకం వంటి ఏ ఉద్వేగాలూ లేవు ఆ మొహంలో… (ఫోటో చూడండి…) బాలుడి మరణానికి ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమే కారణమని ఆమెపై పోలీసుల హత్య అభియోగం మోపారు… అయితే ఎందుకు చంపేసిందో కారణాలు బయటికి వెల్లడి కాలేదు ఇంకా… శవపరీక్ష తరువాత ఏమైనా వివరాలు చెప్పగలమని పోలీసులు అంటున్నారు… బెయిల్ ఇవ్వలేం, కస్టడీలోనే ఉంచుకొండి అన్నాడు జడ్జి…
మరి ఇరుగూపొరుగూ లేరా..? ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోరా..? అదీ ప్రశ్నే… కానీ అలాంటి సమూహాల్లో ఎవరి బతుకు వాళ్లదే… ఎదురింట్లో, పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు… మరీ సందేహాలు తలెత్తే పక్షంలో తప్ప… మరి మనం నాగరికులం, సమూహజీవులం ఎలా అయ్యాం అంటారా..? అవున్నిజమే… మనం ‘‘మనుషులుగా’’ ఇంకా ఎదగలేదు… ప్రస్తుతం కస్టడీలో ఉన్న ప్రియాంక తివారీ జనవరి 11న తదుపరి కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది…
Share this Article