ఓ ఆసక్తికరమైన వార్త ఇది… ఏపీ సర్కారుకో, టీటీడీ ధర్మకర్తల బోర్డుకో ఏమాత్రం నచ్చకపోవచ్చు.., తమిళనాడు ప్రభుత్వ స్పూర్తిని పాటించడం కూడా ఇష్టం ఉండకపోవచ్చు… విషయం ఏమిటంటే..? 37 ఏళ్ల ఓ ముస్లిం సొహెయిల్ మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ వేశాడు… ‘‘అయ్యా, చెన్నైలోనే ఉన్న Arulmigu Kapaleeswarar Arts and Science College లో ఓ ఆఫీసు అసిస్టెంట్ పోస్టుకు నేను అనర్హుడిని అన్నారు, ఇంటర్వ్యూకు రానివ్వలేదు, అదేమంటే నువ్వు హిందువు కావు అన్నారు, ఒక సెక్యులర్ దేశంలో, ఒక మతం పేరిట ఒక కొలువుకు ఇలా అనర్హుడిని చేయడం ఏమిటి..? రాజ్యాంగవిరుద్ధం కాదా..? హిందు అనేది మతం కాదు, అదొక జీవనవిధానం, అలాంటప్పుడు కేవలం హిందువులే ఆ కొలువులకు అర్హులు అనడం ఇతర మతాల రాజ్యాంగపరమైన అవకాశాల్ని నిరాకరించడం అవుతుంది కదా… తమిళనాడులో ఉన్న చట్టం మేరకు మఠాలు, గుళ్లు, ఇతర మతసంస్థలు మాత్రమే మతపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, కానీ విద్యాసంస్థల్ని మతభావనలకు దూరంగా ఉంచాలి కదా…’’ ఇదీ ఆ పిటిషన్ సారాంశం…
దీనికి అడ్వొకేట్ జనరల్ షణ్ముఖ సుందరం బదులిస్తూ… ‘‘Hindu Religious and Charitable Endowments (HR&CE) Department నియమావళి మేరకు హిందూ గుళ్ల నిధులతో నడిచే సంస్థల్లో ఇతర మతస్తులకు కొలువులు ఇవ్వడం నిషిద్ధం..’’ అని స్పష్టంగా చెప్పాడు… కానీ కోర్టు సదరు పిటిషన్‌ను విచారణకు తీసుకుని, ఓ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది… ‘హిందూ అనే పదం మతాన్ని సూచించదనీ, అదొక జీవనవిధానమనీ సుప్రీంకోర్టు చెప్పింది కదా, మరి ఫలానా వ్యక్తి హిందూ మతస్తుడు అని ఈ ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది’ అనేది సదరు పిటిషిన్‌దారు వాదన…
Ads
ఇక ఏపీకి వద్దాం… హిందూ దేవాలయాల గుళ్లు, హిందువులు సమర్పించే కానుకలతో నడిచే సంస్థల్లో నియామకాల తీరు ఎప్పుడూ ఓ వివాదమే… ఆమధ్య శ్రీశైలంలో షాపుల కేటాయింపు, కొలువులు కూడా వివాదాస్పదం అయ్యాయి… ఇక టీటీడీలో ఎప్పుడూ కంట్రవర్సీలే… చివరకు దీన్ని కెలకడం వల్ల ఓ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే తన కొలువును పోగొట్టుకున్నాడు కదా… అసలు గుళ్ల నిధులతో నడిచే సంస్థల్లోనే నాన్-హిందువులకు కొలువులు ఇవొద్దు అంటోంది తమిళనాడు ప్రభుత్వం… కానీ ఇక్కడ ఏకంగా గుళ్లలోనే కొలువు తీరుతున్నారు… ఎంత కంట్రాస్టు..? ఆధ్యాత్మిక వ్యాప్తికి, హిందూధర్మ వ్యాప్తికి తమ కానుకలు ఉపయోగపడాలని సగటు హిందూ దాత ఆశిస్తాడు కదా… టీటీడీ యాక్టులోనే హిందూ ధర్మప్రచారం ఓ బాధ్యతగా చెప్పారు కదా… మరి ఇదేమిటి..? అసలు ఒక మతసంస్థపై, అదీ కేవలం హిందూ మత సంబంధ వ్యవహారాలపైనే ఈ సెక్యులర్ ప్రభుత్వాల పెత్తనాలు, ఇష్టారాజ్యం నిర్ణయాలు ఏమిటి..? చాలా సంక్లిష్టమైన ప్రశ్నలు కదా… చూడాలి, మద్రాస్ హైకోర్టు ఏం చెబుతుందో…!!
Share this Article