.
విధి అని పదే పదే చెప్పుకుంటాం కదా… అది వికటిస్తే అదే ఇది.,. నిజంగా ఓ విషాదం… మనసున్నవాడిని కలిచివేసే దుర్ఘటన… కాకపోతే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా విలేఖరికీ, సబ్ ఎడిటర్‌కూ సరిగ్గా ప్రజెంట్ చేయాలనే సోయి కనిపించలేదు…
ఆ వార్త ఏమిటంటే..? శంషాబాద్… బెంగళూరుకు చెందిన ముత్యాల విజయ్ (40), అతని భార్య శ్రావ్య (35) ఏడాదిన్నర కిందట ఇక్కడికి వచ్చారు. విజయ్ ఎయిర్‌పోర్టులో ప్రైవేటు ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాడు… బహుశా ఏదో ఔట్ సోర్సింగ్ జాబ్ కావచ్చు…
Ads
కడుపు పండలేదు, ఆ బాధ ఉంది వాళ్లకు… ఐవీఎఫ్‌ను ఆశ్రయించారు… ఫలించింది… స్కానింగులో కవలలు అని తేలింది… ఆ జంట మరింత ఖుషీ… జాగ్రత్తగా ఉంటున్నారు… కానీ ఏదో వికటించింది… 8 నెలల కడుపుతో ఉన్న ఆమెకు ఎక్కడో తేడా కొట్టింది… అప్పటివరకూ కడుపులో ఆరోగ్యంగా ఎదుగుతున్నారని భావిస్తున్న ఆ కవల గర్భశిశువులకు ఏమైందో ఏమో గానీ….
2025 నవంబర్16న రాత్రి…, శ్రావ్యకు కడుపులో నొప్పి మొదలైంది… వెంటనే ఆమెను అత్తాపూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు…. ఆసుపత్రిలో వారికి ఎదురైన నిజం ఆ దంపతులకు పెద్ద పిడుగుపాటు…! కవలలు గర్భంలోనే మృతి చెందారు… అదెలా..? ఎవరికీ తెలియదు… అప్పటిదాకా బాగానే ఉన్న కవలలు హఠాత్తుగా కడుపులోనే ఎలా మరణించారు..?
ఆ వివరాల జోలికి ఎవరూ వెళ్లలేదు… ప్రైవేటు హాస్పిటల్స్ కథ తెలిసిందే కదా… ఈ షాక్ తట్టుకోలేక శ్రావ్య స్పృహ కోల్పోయింది… ఆమెకు మెరుగైన వైద్యం కోసం గుడిమల్కాపూర్‌లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు… ఫలితం దక్కలేదు…
చికిత్స ఫలించలేదు… ఆ బాధతోనే ఆమె కూడా ఈ లోకం వీడి వెళ్లిపోయింది… ఆసుపత్రి నుండి శవం రూపంలో వచ్చిన భార్య, కలలు మాత్రమే మిగిల్చిన కవలలు… ఈ తీరని బాధను ముత్యాల విజయ్ తట్టుకోలేకపోయాడు… ఆ బాధలో ఆత్మహత్యకు నిర్ణయం తీసుకున్నాడు… దురదృష్టకరం…
సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని తమ ఇంట్లోనే ఉరేసుకుని ఆ భర్త కూడా తనువు చాలించాడు… కొన్ని రోజులు, కొన్ని గంటల తేడాతో… ఆనందాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలుగు ప్రాణాలు అకస్మాత్తుగా ఆగిపోయాయి… దుర్విధి..!! అన్నీ బాగున్నాయి, అంతా ఆనందంగా ఉంది అనుకుంటే క్షణాల్లో మసిచేస్తుంది అది..!!
అవునూ, ఐవీఎఫ్‌లో ఏమైనా తేడా కొట్టిందా..? కానీ బాగానే పెరిగారు కదా ఎనిమిది కడుపులో… హఠాత్తుగా ఏమైనట్టు..? ఎవరు తేల్చాలి..? పోలీసులు దర్యాప్తు చేస్తే తప్ప తేలదు…!! సహజమరణాలు, ఓ ఆత్మహత్య అని కేసు మూసేస్తే ఇక ఏమీ తెలియదు… ఆ కేసు కూడా కడుపులోనే మరణిస్తుంది..!!
Share this Article