Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…

May 22, 2025 by M S R

.

తెలుగు సినిమాలో సముద్రాల, పింగళి, మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, ఆత్రేయ, వంటి గొప్ప కవులున్నారు. కానీ సినిమా పాటకు సంబంధించినంత వరకూ వేటూరి అందరికన్నా గొప్ప కవి.

మొత్తం దక్షిణాది సినిమాలో గొప్పకవి కణ్ణదాసన్… మలయాళం వయలార్ రామవర్మ, పి. భాస్కరన్ కన్నా కణ్ణదాసన్ గొప్ప కవి. కన్నడ కవి ఆర్.ఎన్. జయగోపాల్ తో నేను కొన్ని సందర్భాల్లో చర్చించినప్పుడు కణ్ణదాసన్ ఘనతను ఆయన స్మరించుకోలేకుండా ఉండలేకపోయారు. అంత కణ్ణదాసన్ ను మరిపించగలిగింది‌ ఒక్క వేటూరి మాత్రమే.

Ads

వేటూరి రాసిన “మానసవీణ మధుగీతం…” (సినిమా పంతులమ్మ) కణ్ణదాసన్ కూడా రాయలేరేమో? శంకరాభరణం పాటలల్లో వేటూరి చూపిన ప్రతిభ అద్వితీయం. “త్యాగరాజు కీర్తనల్లే ఉన్నాది బొమ్మ రాగమేదో తీసినట్టు‌ ఉందమ్మా” అని వేటూరి మాత్రమే అనగలరు.‌

“ఏ కులమూ నీదంటే గోకులము నవ్వింది” అనడం వేటూరికే సాధ్యం‌. మల్లెపువ్వు సినిమాలో‌ వేశ్యా వాటికలో‌ వినవచ్చే “ఎవ్వరో ఎవ్వరో…” పాటలోనిది అత్యంత గొప్ప‌‌ సాహిత్యం. ఇలాంటి సందర్భానికే మానవుడు దానవుడు సినిమాలో‌ నారాయణరెడ్డి రాశారు. ఆయన రచన‌ వేటూరి‌ రచన ముందు నాసిరకమైంది.

సిరిసిరి మువ్వ సినిమాలో‌ ఒక పాట సందర్భానికి ముందు‌‌‌ పెద్ద పురస్కారాల్నే అందుకున్న ఒక ప్రముఖ కవి చేత రాయించి అది బాగా రాకపోవడంతో వేటూరి చేత రాయించారు. ఆ కవి రచన కన్నా వేటూరి రాసిందే బావున్నదీ సరైనదీ అయింది. అదే “ఝుమ్మంది నాదం…”

వేటూరి సినిమా పాటల్లో ప్రదర్శించిన గజలియత్ నారాయాణరెడ్డి గజళ్లు అని రాసిన వాటిల్లో కూడా తీసుకురాలేకపోయారు. 

ఎన్నెన్నో గొప్ప వాక్యాలు రాశారు, ఎంతో గొప్ప కవిత్వం రాశారు వేటూరి. భాష , రచనా సంవిధానంపై, పట్టు ఉన్న కవి వేటూరి.

వేటూరి కాలంలో సినిమాకు బయట ఎలాగో‌ ఆ, ఈ అవార్డుల్ని అందుకున్న కవి అనబడుతున్న ఏ వ్యక్తీ కవిగా వేటూరి ముందు ఎంతమాత్రమూ గణనీయం కాదు. (అత్యంత ప్రతిభావంతమైన కవి వేటూరిపై 2019లో ఆంధ్రజ్యోతి వెబ్ ఎడిషన్ లో నేను రాసిన వ్యాసం…)

*** ***
తెలుగు సినిమా పాటల్లో వేటూరి‌ రాసి పెట్టినంత గొప్ప కవిత్వం మరొకరు రాయలేదు. తెలుగు సినిమా‌ పాటలో కావ్యత్వాన్ని పండించారు వేటూరి.

ఆయనకు ముందూ‌ ఆయనకు‌ తరువాత గొప్ప‌ కవిత్వం తెలుగు సినిమా పాటల్లో మనం విన్నాం.‌ కానీ‌‌ వేటూరి‌ సృష్టించిన కవిత్వం ఎంతో విశిష్టమైంది.

తొలిరోజుల్లో పంతులమ్మ చిత్రంలో వేటూరి‌‌ వ్రాసిన‌ “మానస వీణా‌ మధుగీతం” పాట నుంచీ ఆయన చేసిన కవిత్వావిష్కరణ అపూర్వం. “కురిసే దాకా అనుకోలేదు శ్రావణ మేఘమని, తడిసే దాకా‌ అనుకోలేదు తీరని‌ దాహమని” అని‌ ఆయనన్నది అంతకు‌‌ ముందు తెలుగు సినిమా‌కు అందని అందలం.

అడవి రాముడు సినిమాలో‌ “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” పాట సీసపద్యం. ఆ పాటలో పైట లేని ఆమెతో “నా పాట నీ పైట కావాలి” అన్నారు వేటూరి. ఆ సినిమాలో‌ని‌ ఇంకో‌ చక్కని‌ పాట “కుహు‌ కుహు కోయిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి” పదాల‌ పోహళింపులోనూ, భావుకతలోనూ ఎంతో‌ బావుండే పాట.

మల్లెపూవు సినిమాలో వేటూరి రాసిన “ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగేవారెవ్వరో” పాటా ఆ పాటలో “ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో/ ఏ ఖర్మం ఈ గాయం చేసిందో” అని అన్నదీ వేటూరి మాత్రమే చెయ్యగలిగింది. ( ఇలాంటి‌ సందర్భానికి మరో‌ తెలుగు సినిమాలో మరో కవి రాసిన‌ పాట ఇంత ఉన్నతంగా లేదు)

“శారదా వీణా రాగచంద్రికా‌ పులకిత శారద రాత్రము, నారద నీరద మహతి‌‌ నినాద గమకిత శ్రావణ‌ గీతము” అని అనడం‌‌ సినిమా పాటలో‌నే కాదు మొత్తం‌ తెలుగు‌ సాహిత్యం‌లోనూ‌ మహోన్నతం.

“తత్త్వ సాధనకు సత్యశోధనకు‌‌ సంగీతమే‌ ప్రాణము” అని‌ అన్నప్పుడూ “అద్వైత సిద్ధికి‌ అమరత్వ‌లబ్దికి గానమే సోపానము” అనీ‌ అన్నప్పుడు త్యాగరాజ స్వామిని వేటూరి ఆపోసన పట్టారన్నది‌ తెలుస్తున్నది.

వేటూరిలో అన్నమయ్య‌ పూనడం కూడా జరిగింది. అందువల్లే “జానపదానికి జ్ఞానపథం” ‌అనీ, “ఏడు స్వరాలలే ఏడు కొండలై” అనీ ఆయన రాయగలిగారు. 

“ఝుమ్మంది‌‌ నాదం సై అంది పాదం” పాట తొలి రోజుల్లోనే వేటూరిని గొప్ప కవిగా నిరూపించింది.‌ ఈ‌‌ సందర్భానికి ముందు‌గా ప్రముఖ కవి మరొకరు పాట రాయడానికి ఎన్నుకోబడి‌ ఆ కవి‌‌ న్యాయం చెయ్యలేకపోతే వేటూరి‌‌ వ్రాశారు.

“కైలాసాన కార్తీకాన శివ‌రూపం
ప్రమిదేలేని ప్రమాదా లోక‌ హిమదీపం”
అని వేటూరి‌ అన్నది మనం మరో కవి ద్వారా విననిది. మరెవరూ‌ అనలేనిది.

సాగర సంగమం సినిమాలో “ఓం నమశ్సివాయ” పాటలోని సాహిత్యం న భూతో న‌ భవిష్యతి. భావుకత,‌ కల్పనా శక్తి , పదకూర్పుల పరంగా అది ఒక మహోన్నతమైన రచన. ఈ పాటలో “నీ మౌనమే దశోపనిషత్తులై ఇల‌వెలయ” అన్న వాక్యం వేయి‌కావ్యాల పెట్టు. అసలు‌ ఉపనిషత్తులు‌‌ పది మాత్రమే. ఈ సత్యాన్నీ, మౌనమే వేదాంతం‌ అన్నదాన్నీ అద్భుతంగా మనకు అందించారు వేటూరి.‌

“గజముఖ షణ్ముఖ ప్రమధాదులు‌‌ నీ సంకల్పానికి ఋత్విజ వరులై‌” అనడం రచనా సంవిధానంలో వేటూరి మహోన్నతులని నిరూపిస్తోంది. ఇక్కడ ఈశ్వరుడి సంకల్ప‌ం అంటే ఈ‌ సృష్టి – దీనికి గజముఖ,‌ షణ్ముఖ, ప్రమధ గణాలు ఋత్విజ వరులు (అంటే యజ్ఞం చేసే ఋత్విక్కులలో శ్రేష్ఠమైన వాళ్లు) అయ్యారు” అని అన్నారు. ఇక్కడ ఋత్విజ వరులు‌ అన్న పదం‌ వాడడం‌ వల్ల ఈశ్వర సంకల్పం‌ అన్నది ఒక యజ్ఞం‌ అన్నదాన్ని‌ యజ్ఞం అన్న పదం వాడకుండా‌ చెప్పారు. ఇది మహాకవులకు‌ మాత్రమే‌ సాధ్యం.‌వేటూరి‌‌ ఒక మహాకవి.

“శంకరా నాద శరీరా‌ పరా” పాటలో ఆయన‌ వాడిన‌ సంస్కృతం‌‌ తెలుగుకు అపూర్వం. వేటూరికి‌ ముందు‌ మల్లాది రామకృష్ణ‌‌ శాస్త్రి సంస్కృతాన్ని‌ తెలుగు సినిమా పాటలో చక్కగా వాడారు. వేటూరి‌ సంస్కృతాన్ని‌ గొప్పగానూ‌ వాడారు.

సప్తపది‌‌ చిత్రంలో “అఖిలాండేశ్వరి…” పాట పార్వతి, లక్ష్మి, సరస్వతి స్తోత్రంగా పూర్తి సంస్కృతంలో అద్భుతంగా‌ రాశారు వేటూరి. అలవోకగా ఎన్నో మంచి సమాసాల్ని వేటూరి‌ ప్రయోగించారు. ఆయన వాడినన్ని‌ అలంకారాలు తెలుగులో మరో‌‌ సినీ‌కవి వాడలేదు. వేటూరి ఎన్నో మంచి కవిసమయాల్ని వాడారు‌.(స్థలా భావం వల్ల ఉదాహరణలు చూపడం లేదు)

“చినుకులా రాలి నదులుగా సాగి” పాట ప్రేమ గీతాలలో ఒక ఆణిముత్యం. “ఏ వసంతమిది ఎవరి సొంతమిది?” అని వేటూరి కవిత మాత్రమే అడగగలదు. “ఈ దుర్యోధన…” పాటకు సాటి‌ రాగల పాట మన దేశంలో‌ మఱొకటి ఉంటుందా?

“ఏ కులమూ నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది” ఇలా‌ రాయడానికి ఎంతో పదను కావాలి. ఆది‌ శంకరాచార్య, కాళిదాసు, కణ్ణదాసన్ లలో మెఱిసే పద పురోగతి (Word-proggression) వేటూరిలో ఉంటుంది లేదా మన తెలుగులో వేటూరిలో మాత్రమే కనిపిస్తుంది.

తమిళంలో కణ్నదాసన్ రాశాక అంతకన్నా గొప్పగా తెలుగులో రాయడం ఒక్క‌ వేటూరి వల్ల మాత్రమే సాధ్యమైంది. వేటూరికి ముందు కణ్ణదాసన్ పాటలు రాసిన సందర్భాలకు తెలుగులో రాసిన‌ కవులున్నారు. అయితే వాళ్లు కణ్ణదాసన్ స్థాయిని‌ అందుకో లేకపోయారు. కానీ ఒక్క వేటూరి‌ మాత్రామే
కణ్ణదాసన్ రాసిన‌ సందర్భానికి తెలుగులో‌ ఆయన కన్నా, అంతకన్నా గొప్పగా రాయగలిగారు.

అమావాస్య చంద్రుడు సినిమాలో కణ్ణదాసన్ “అందమే అందమూ … దేవత/ వేయి కవులు రాసే కావ్యము” అని రాస్తే ఆ సందర్భానికి వేటూరి “కళకే కళ‌ ఈ అందము,‌ ఏ‌ కవీ రాయని తీయని కావ్యము” అని‌ రాశారు. ఇలా ఆ‌ పాటలో ప్రతిచోటా‌ వేటూరి‌ రచనే మిన్నగా ఉంటుంది.

ఆ‌ సినిమాలో మరో పాట “సుందరమో సుమధురమో” పాట సందర్భానికి ముందుగా తమిళ్‌లో వైరముత్తు‌ రాశారు. ఆ సందర్భానికి వేటూరి‌ రచన తమిళ్ రచన‌కన్నా గొప్పది.‌ వైరముత్తు ముందుగా తమిళ్ లో రాసిన “మేఘమా మేఘమా” పాట సందర్భానికి కూడా తెలుగులో వేటూరి రాసినదే మేలైనది.

రాముడే రావణుడైతే సినిమాలో “రవివర్మకే అందని ఒకే ఒక‌ అందానివో” అని వేటూరి రాసిన‌ది ముందుగా కన్నడ‌ సినిమా‌ “సొసె తంద సౌభాగ్య” లో “రవివర్మన కుంచద కలె బలె సాకారవో” అని ఆర్.ఎన్.‌జయగోపాల్ రాసిన దానికన్నా ఉన్నతమైన రచన. ఈ‌ విషయాన్ని నేను అర్.ఎన్.‌జయగోపాల్ తో ప్రస్తావిస్తే ఆయన‌ కాదనలేక‌పోయారు.

“కన్నీటికి కలువలు పూసేనా – కాలానికి ఋతువులు నవ్వేనా
మబ్బులెంతగా కురిసినా ఆకాశం తడిసేనా
మాటలతో మరపించినా మనసు వేదన తీరేనా- విధి శోధన ఆగేనా” అనీ,

“ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక/ ఏదారెటుపోతుందో ఎవరెనీ అడగక” అనీ, “త్యాగరాజు కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ రాగమేదో తీసినట్టుందమ్మా” అనీ, నీ వయసే వసంత ఋతువై – నా మనసే జీవన మధువై” అనీ,

“ఆబాలగోపాల మా బాలగోపాలుని/ అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ” అనీ, “వానకారు కోయిలనై‌ తెల్లవారి వెన్నెలనై / ఈ ఎడారి దారులలో ఎడద‌ నేను పరిచానని కడిమివోలె నిలిచానని” అనీ, “రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై/ ఈ నిశీథి నీడలలో నివురులాగ మిగిలానని” అనీ,

“ఏ పూలు తేవాలి నీ పూజకు/ ఏ లీల చేయాలి నీ సేవలు” అనీ, “దీపాలెన్ని ఉన్నా హారతొక్కటే/ దేవతలెందరున్నా అమ్మ ఒక్కటే” అనీ, “గీతార్థ‌సారమిచ్చి గీతలెన్నొ మార్చాడే/ నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే” అనీ,

“ఇది సంగ్రామం మహా సంగ్రామం/ శ్రమ జీవులు పూరించే శంఖారావం/అగ్ని హోత్రమే గోత్రం ఆత్మశక్తి మా హస్తం / తిరుగులేని తిరుగుబాటు మా లక్ష్యం” అనీ, “చుంబించుకున్న బింబాధరాల సూర్యోదాయాలే పండేటి వేళ” అనీ, వీణవేణువైన సరిగమ విన్నావా/ తీగరాగమైన మధురిమ‌ కన్నావా” అనీ,

ఆకాశన సూర్యుడుండడు సందె వేళకి/ చందమామకు రూపముండదు తెల్లవారితే” అనీ” “రాలిపోయే పూవా నీకు రాగాలెందుకే / తోటమాలి నీ తోడులేడులే/ వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే” అనీ,

“కరిగే బంధాలన్నీ మబ్బులే” అనీ, తన రంగు మార్చింది రక్తమే/ తనతో రాలెనంది పాశమే” అనీ వేటూరి సుందరరామ్మూర్తి ఎన్నో కావ్య వాక్యాలు వాక్య కావ్యాలు వెలువరించారు. తెలుగు సినిమా‌ పాటలలో ఎన్నో చక్కని పాటలతో ఎంతో చిక్కని కవిత్వాన్ని అందించారు వేటూరి సుందరరామ్మూర్తి… వేటూరిని స్మరించుకుంటూ… [[   రోచిష్మాన్    9444012279  ]]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…
  • ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…
  • ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…
  • ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?
  • పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?
  • పెను విధ్వంసం సృష్టించగల ఓ భారీ విపత్తు వేగంగా సమీపిస్తోంది..!!
  • ఆ కేన్సర్ స్పెషలిస్టు… రిటైరయ్యాక సిద్ధవైద్యంలోకి..! ఎందుకు, ఎవరు..?!
  • ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
  • పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!
  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions