Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ పిల్లాడిని బలిగొన్నది కేవలం ఆ ఒక్క మార్కేనా? ఓ మథనం అవసరం!!

July 29, 2026 by M S R

.

ముందుగా ఓ వార్త చదవండి… ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఆ విద్యార్థికి 440 మార్కులకు 434 మార్కులొచ్చాయి! నిజానికి చాలా చాలా మంచి మార్కులు… అయినా తమ లెక్చరర్, తనకన్నా ఒక మార్కు ఎక్కువగా వచ్చిన విద్యార్థితో తనను పోల్చుతూ తీవ్ర అవమానకరంగా మాట్లాడటంతో, తనను చెంపదెబ్బ కొట్టడంతో ఆ అబ్బాయి లోలోపల బాధపడ్డాడు.

తన ఆవేదనంతా మూడు పేజీల్లో రాసిపెట్టి, ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… గద్వాల రూరల్ (పాత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా) కొత్తపల్లికి చెందిన 17 ఏళ్ల నేతిబొట్టు తరుణ్ గద్వాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో తరుణ్ జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచాడు.

Ads

గర్వపడాల్సిన విషయమే కదా… శనివారం కాలేజీలో తరుణ్‌కు వచ్చిన మార్కులను జిల్లాలో మొదటి ర్యాంకరు‌కు వచ్చిన 435 మార్కులతో పోల్చుతూ ఓ మహిళా లెక్చరర్ అతడిని అవమానించింది… ఇలా పోల్చడం, అవమానించడం చాలా తప్పు మేడం అంటూ తరుణ్ ఆమెతో అన్నాడు. దీనికి ఆమె అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నీవేమైన మంత్రి కొడుకువా? అంతకన్నా గొప్పవాడివా? అంటూ చెంప మీద కొట్టింది. ఈ ఘటనతో క్లాసులోని తరుణ్ తోటి విద్యార్థులు ఘల్లున నవ్వారు. లెక్చరర్ తన పట్ల ప్రవర్తించిన తీరును తరుణ్ తీవ్ర అవమానంగా భావించాడు.

ప్రిన్సిపల్ వీరన్నకు విషయం తెలియడంతో సోమవారం కాలేజీకి వచ్చిన తరుణ్‌కు బాధపడొద్దంటూ కౌన్సెలింగ్ ఇచ్చాడు. మంగళవారం తరుణ్ కాలేజీకి రాలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పునకు ఉరివేసుకున్నాడు.

పొలం నుంచి తిరిగొచ్చిన తల్లిదండ్రులు బుచ్చన్న, రేణమ్మ. ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో కనిపించిన కుమారుడిని చూసి భోరుమన్నారు. తనకు జరిగిన అవమానంపై తరుణ్ సూసైడ్ నోట్ రాశాడు.

“విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రొత్సహించాలే తప్ప నిరుత్సాహపరచకూడదు. ఆమె (లెక్చరర్) చర్యల వల్ల నేను బాధపడ్డాను. కుంగిపోయాను. ఇది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో సూసైడ్ నోట్ రాస్తున్నాను. ఆ లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలి. అవమానకర ఘటన అనేది ఒక సున్నిత మనస్కుడైన విద్యార్థిని ఎలా బాధిస్తుందో ఆమెకు అర్థం కావాలి” అని లేఖలో పేర్కొన్నాడు…

ప్రతి క్రైమ్ స్టోరీ వెనుక బయటికి వినిపించే, పబ్లిషయ్యే కథనాల వెనుక ఇంకేదో కథ ఉంటుంది… ఇందులోనూ ఏదో ఉండొచ్చు… ఆ సూసైడ్ నోట్ భాష ఓ ఇంటర్ పిల్లాడి భాషలాగా, సహజ వ్యక్తీకరణలా అనిపించడం లేదు… కాకపోతే ప్రస్తుత తరం పిల్లల్లో రెండురకాలు… కొందరు మరీ సున్నితంగా ఉంటున్నారు, ఒక్క మార్కు తక్కువొచ్చినా ఫీలవుతున్నారు, దీనికితోడు ఏమాత్రం టీచింగ్ సెన్స్, కామన్ సెన్స్ లేని టీచర్లు, లెక్చరర్ల వల్ల అవమానంగా ఫీలై ప్రాణాలు తీసుకుంటున్నారు…

మార్కులు, పరీక్షల ఒత్తిళ్లకు ఇది అదనం… మరోరకం పిల్లలు… దేన్నీ పట్టించుకోరు, పైగా మొండి ఘటాలు, వాళ్లను ఏ ఒత్తిడీ ఏమీ చేయలేదు… ఇదంతా చదువుతుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి… మార్కులు రాకపోతే, భట్టీ పట్టకపోతే, లెక్కలు చేయలేకపోతే, పద్యాలు పాడలేకపోతే కోదండం వేసిన రోజులూ ఉన్నాయి… పిల్లలు నవ్వుతారు, కానీ ఆ క్లాస్‌రూమ్ వరకే…

అరచేతి మీద బెత్తంతో దెబ్బలు, గోడ కుర్చీలు, చెంపదెబ్బలు, చెవులు పిండటం, వాయిల్ బరిగెలతో పిర్రల మీద వాతలు తేలేలా నాలుగు బాదడం, తోటి పిల్లలతో తొడపాశాలు పెట్టించడం… అప్పటివరకే, పిల్లలూ సీరియస్‌గా తీసుకునేవారు కాదు… ఎందుకంటే క్లాసులో ప్రతి పిల్లాడూ రుచిచూసేవాడే కదా… పైగా సాయంత్రానికి పిల్లలందరూ కలిసి ఏదో ఓ ఆటలో మళ్లి కలిసిపోయేవారు… ఇప్పుడు ఆటల్లేవుగా…

మరీ ఇప్పటి పిల్లల దురవస్థ పూర్తిగా వేరు… మార్కులు, పరీక్షల ఒత్తిడి, ఏమాత్రం కామన్ సెన్స్, సెన్సిటివిటీ టీచింగ్ పట్టని ఉపాధ్యాయులు… వీటికితోడు ఆత్మహత్యలు ఎలా చేసుకోవాలో చెప్పే సోషల్ మీడియా వీడియోలు, ఇదీ మన దరిద్రం…

నిజానికి అయిదు, ఆరు తరగతుల నుంచే వ్యక్తిత్వ వికాస పాఠాలు ఉండాలి కరిక్యులమ్‌లో… ఐనా ఎవడికి పట్టిందిలే… పెద్ద తలకాయలన్నీ డబ్బు యావలో, ఆస్తుల రందిలో పడి పరీక్ష పత్రాల లీకేజీల్లో మునిగిపోయాక..!! అడ్డగోలు దోపీడీతో కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు చెలరేగిపోతున్నాక!! బతకడం ఎలాగో నేర్పించే పాఠాలు లేకపోయాక!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ పిల్లాడిని బలిగొన్నది కేవలం ఆ ఒక్క మార్కేనా? ఓ మథనం అవసరం!!
  • హోటల్ పనివాడుగా మొదలై… స్టార్ హీరోలకు దీటుగా స్టార్ విలన్!
  • విద్యా శాఖ మాత్రం ఇవ్వొద్దుట ! – మంత్రిగా ఉంటే పర్లేదుట !!
  • భక్తి తప్పు కాదు – ఇదుగో ఇలాంటి మూఢ భక్తే ‘మోక్షమార్గం’!
  • ప్చ్… చివరకు ఈ అనంత జ్ఞాన శ్రీరాముడూ చెప్పేవాడయ్యాడు !!
  • హైడ్రా ! తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ రాజకీయ విభాగమా ?!
  • ఇదంతా తెలంగాణ అస్థిత్వ సమస్యా? బీఆర్ఎస్ పార్టీ అస్థిత్వ సమస్యా!?
  • బొద్దింకల పార్టీ ! మీకు తెలియని ఒక అంతర్జాతీయ పొలిటికల్ మిస్టరీ !!
  • అసలు సమస్య ‘నీట్’ను దాటి… మన వైద్య వ్యవస్థలోనే ‘రోగాలు’
  • మోదీ జీ, మీ మంత్రిదే కాదు, నా రాజీనామా ఆమోదించండి మరి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions