.
హఠాత్తుగా చుట్టుముట్టిన వరద… ఓ మనిషి తను ముందుజాగ్రత్తగా ఇంటి వద్ద ఉంచుకున్న పడవలో కుటుంబసభ్యుల్ని, పశువుల్ని ఎక్కించాడు… వరద ఉధృతి పెరుగుతోంది… పడవ కొట్టుకుపోసాగింది… బరువు ఎక్కువై మునక ప్రారంభమైంది…
జెట్టీసన్ (ఈ పదం ఇక్కడ వాడొచ్చా)… తప్పదు… బతికుంటే పశువుల్ని కొత్తవి కొనుక్కోవచ్చు అని పాడిగేదెల్ని, ఎద్దులను వరదలోకి తోసేశాడు… తరువాత పెంపుడు జంతువులను కూడా…
Ads
ఇంకా బరువు తగ్గాలి… ఆ మనిషి చూపు అమ్మ, అయ్య మీద పడింది… రోజూ తిండి దండుగ తప్ప, ఉపయోగం ఏముంది, నేను బతికితే వాళ్లకూ ఆనందమే కదా అని సమాధానపరుచుకుని వాళ్లను తోసేశాడు… ఆ నాలుగు కళ్లల్లో అంతులేని షాక్…
తరువాత… బతికి ఉంటే మళ్లీ పిల్లల్ని కంటాం కదా అనుకుని ఇద్దరు పిల్లల్ని తోసేశాడు… చివరగా ఈ పెళ్లాం కాకపోతే మరొకతి దొరకదా అనుకుని పెళ్లాన్ని కూడా తోసేశాడు… దేన్నో గుద్దుకుని పడవ ముక్కలై, తనూ మునిగిపోయాడు… ప్రాణాపాయంలో మనిషిలోని సిసలైన పూర్తి స్థాయి మెటీరియలిస్ట్ ఎలా నిద్రలేస్తాడో తెలిపే కథ…
మనిషి ప్రయారిటీస్ ఇలాగే ఉంటయ్… నేను తరువాత మిగతావాళ్లు… పక్కా మెటీరియలిస్టిక్ కథ… చాన్నాళ్లు గుర్తుంది… అలాగే యండమూరి రాసిన ఓ సీన్ కూడా పదే పదే గుర్తొచ్చేది… అది ఏ సీరియల్‌లోనిదో మాత్రం గుర్తులేదు…
ఏదో సెర్చుతుంటే అనుకోకుండా ఆ యండమూరి వాల్ మీదే అదే సీన్ కనిపించింది… దాని గురించి వివరణ అక్కర్లేదు, చదివితే చాలు… మనిషి అనే జంతువుకు స్వార్థం తప్ప ఇంకేమీ తెలియదని తేల్చిచెబుతుంది… ఇది ఆనందోబ్రహ్మ నవలలోనిది…
Yandamoori Veerendranath…… మరి కొద్ది గంటల్లో నగరం మీద పడబోయే బాoబు గురించి తెలిసిన అతి కొద్దిమందిలో అతనొకడు. కుటుంబంతో కలిసి రహస్యంగా రాష్ట్రం విడిచి వెళ్ళటానికి తయారు అవుతూ ఉండగా ‘హోమ్ ఫర్ ది ఏజ్డ్ నుంచి మాట్లాడుతున్నాం. మీ తండ్రి రామానంద, నెం 64392 అరగంట క్రితం మరణించారు” అని ఫోన్ వచ్చింది. ఈ సమయంలో తండ్రి మరణం షాక్‌లా తగిలింది.
వాచీ చూసుకున్నాడు. ఎలక్ట్రికల్ క్రిమేషన్ (కరెంటు ద్వారా శవాన్ని బూడిద చెయ్యటం) వచ్చాక అంతా అరగంటలో అయిపోతుంది. ఫ్యామిలీతో వెళ్ళాడు.
అది విజిటింగు అవర్స్ టైమ్. ఇతడి కారు కాంపౌండ్‌లో ప్రవేశించగానే మేడ మీద కూర్చుని ఉన్న వృద్ధులు గబగబా డాబా అంచు వద్దకు వచ్చి చూశారు. వచ్చినది తమ తాలూకు వాళ్ళు కాదని తెలిసి వాళ్ళ మొహాల్లో నిరాశ కొట్టొచ్చినట్టు కనపడింది.
అంతమంది అలా పిట్టగోడ అంచున నిలబడటం ఏటి ఒడ్డున కొంగల వరుసని గుర్తుకు తెస్తోంది. ఇది సరయిన ఉపమానం కాదు. అయినా అతడికి అదే గుర్తొచ్చింది. గది బయట వరండాలో తండ్రి శవం ఉంది.
ఎలక్ట్రికల్ క్రిమేషన్ చేసే బంగళా చిన్న కాంపౌండ్‌లో ఉంది. క్లర్క్ ఇచ్చిన ఫారంలో పూర్తి చేసుకుంటూ ఒక కాలమ్ దగ్గర ఆగి, ”ఏమిటిది?” అని అడిగాడు. “యాష్. మీకు శవం తాలూకు బూడిద కావాలంటే అక్కడ టిక్ పెట్టండి. పది వేల రూపాయలు ఎక్కువ అవుతుంది.”
”బూడిద కావాలనేవాళ్ళు కూడా ఉంటారా?”
”కొంతమంది ఉంటారు. సెంటిమెంట్‌గా నదిలో కలుపుతారట. వాళ్ళకోసం పాత మిషను వాడాలి. దానికి ఎగస్ట్రా.”
భరద్వాజ ‘యాష్’ అన్నచోట అడ్డంగా కొట్టేశాడు. అప్పటికే శవాన్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు. ఫ్లోర్ కి రైలు పట్టాల్లా ఉన్నాయి. ధాన్యం పోసుకునే పెద్ద గాదెలాటి అల్మైరా లోకి అవి వెళ్తున్నాయి. ఆ పట్టాల మీద స్ట్రెచర్ ఉంది.
క్లర్కు వచ్చి శవం మొహం మీద ముసుగు తొలగించాడు. భరద్వాజ అడుగు ముందుకేసి, తండ్రి మొహంకేసి ఒకసారి చూసి పక్కకి తప్పుకున్నాడు. తరువాత అదే విధంగా సైనిక వందనం రీతిలో కొడుకు, కూతురు, భార్య కూడా చేశారు.
తరువాత స్ట్రెచర్‌ని పట్టాల మీద ముందుకు తోశారు. గుహలోకి రైలు ప్రవేశించినట్టు అది ఆ ‘ఓవెన్’లోకి ప్రవేశించింది. ….. స్‌స్‌స్ మన్న ధ్వని.
రెండు నిమిషాలు ఆగి తలుపు తెరిచాడు. లోపల్నుంచి ఖాళీ స్ట్రెచర్ బయటకొచ్చింది. పైనేమీ లేదు.
‘అయిపోయింద’న్నట్టూ క్లర్కు భరద్వాజ వైపు చూశాడు. భరద్వాజ గాఢంగా నిశ్వసించి తలూపి వెనుదిరిగాడు. వెనకే కుటుంబం కూడా నడిచింది. అoత నిశ్శబ్దంగా, అలా మెకానికల్‌గా ఒక మనిషి ఆనవాలు కూడా లేకుండా నిష్క్రమించటం ఎంత కాదనుకున్నా అదోలా ఉంది.
”చాలా అదృష్టవంతులు. ఏ రోగమూ, బాధ లేకుండా పోయారు” అంది భార్య.
”పుట్టినవాళ్ళు పోక తప్పదుకదా” అన్నది కూతురు.
చెల్లెల్ని వెక్కిరిస్తూ ”శ్మశాన వైరాగ్యమా?” అన్నాడు కొడుకు.
”కాదు క్రిమేషన్ వైరాగ్యం” రిటార్డు ఇచ్చిందా అమ్మాయి.
”ష్…” అని సైగ చేసింది అతడి భార్య. భరద్వాజ మౌనంగా గంభీరంగా ఉండటాన్ని వాళ్ళు గమనించారు.
- అది నిజమే. కానీ అతడలా ఉన్నది తండ్రి మరణం గురించి కాదు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని, ప్రాణం రక్షించుకోవటం కోసం వలస వెళ్తున్నప్దుడు, కార్లో తీసుకువెళ్ళే వస్తువుల్లో తండ్రి కూడా ఒకడున్నాడని అరగంట క్రితం అలోచన రానందుకు….!!
Share this Article