‘‘వేరే గ్రహాలపై జీవం ఉనికికి అవకాశం తక్కువ… ఒకవేళ భూమ్మీద జీవం పుట్టిన పరిస్థితుల్లోనే ఏదైనా గ్రహం మీద కూడా పుట్టి ఉంటే, ఆ జీవం మన భూగ్రహం మీద ఉన్న జీవంతో పోలి ఉండే అవకాశాలు తక్కువ… ఏ వైరస్ వంటి ప్రొటీన్ పోగుగానో మొదలైన జీవం ఏకకణజీవి నుంచి మనిషిగా పరిణామం చెందడానికి లక్షల ఏళ్లు పట్టింది… భూవాతావరణం, సవాళ్లు, విపత్తులు, సంతానవ్యాప్తి, చలనం, ఆహారం, పోషణ, రక్షణ అంశాలే గాకుండా అనేకానేక ఉత్పరివర్తనాలకు లోనై, క్రమేపీ మారుతూ మారుతూ, ఇక్కడి ప్రకృతికి తగిన మనిషిగా మారడానికి ఇంతకాలం పట్టింది… ఇంకా మారుతాడు… ఇదే సిట్యుయేషన్ వేరే గ్రహాలపై ఉండాలనీ లేదు, జీవం ఒకవేళ ఉన్నా ఇలాగే పరిణామగతికి గురై ఉండాలనీ లేదు… సినిమాల్లో, నవలల్లో ఏలియెన్స్ సృష్టి మనిషి కల్పనాత్మక ఆనందం కోసమే తప్ప అదేమీ శాస్త్రీయ నిరూపణకు, వాదనకు నిలబడేవి కావు…’’
… స్థూలంగా ఆధునిక వైజ్ఞానిక సమాజం అవగాహన, అంచనా ప్రస్తుతానికి ఇదే… ఐతే అందరూ ఇలాగే ఆలోచించాలని ఏమీ లేదు… ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల ఆలోచనలు అప్పుడప్పుడూ తిక్క తిక్కగా కూడా సాగుతూ ఉంటయ్, అమెరికన్ యూనివర్శిటీల్లో పరిశోధనలు చిత్రవిచిత్రంగా ఉంటయ్… ఇదీ అలాంటిదే… కొందరు గ్రహాంతరజీవులు అమెరికాకు చిక్కారనీ, ఓ రహస్య ప్రదేశంలో దాచి పరిశోధిస్తున్నారనే వార్తలు తరచూ అక్కడి మీడియాలో కనిపిస్తూ ఉంటయ్… అప్పట్లో హిల్లరీ క్లింటన్ కూడా ఒకవేళ తనను గెలిపిస్తే ఆ రహస్యాలన్నీ ప్రజలకు వెల్లడిస్తానని హామీ ఇచ్చింది… మరోవైపు ప్రపంచంలోని పలు దేశాల సైంటిస్టులు జీవం అన్వేషణకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు… తాజాగా ఓ పెద్ద వెబ్ టెలిస్కోప్‌ను ప్రయోగించాడు మనిషి…
ఈ విశ్వాంతరాలలో మనకు ఎవరైనా మిత్రుడు ఉన్నాడా అనే అన్వేషణ ఇప్పట్లో తేలేట్టు లేదు… కాదు, విశ్వంలో ఇతర జీవం ఉనికిని కనిపెట్టే సమయం ఆసన్నమైందనీ నమ్మేవాళ్లున్నారు… ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటంటే..? ప్రిన్స్టన్ యూనివర్శిటీలో సెంటర్ ఫర్ థియోలాజికల్ ఇంక్వయిరీ సంస్థ ఉంది… దానికి నాసా ఏడెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చింది… ఇప్పుడు కాదు, 2014లోనే… ఈ డబ్బుతో ఏం చేస్తారో తెలుసా..? మొదట ప్రపంచంలోని పలు మతాలకు చెందిన తత్వవేత్తలతోపాటు భిన్నరంగాలకు చెందిన 24 మంది ప్రముఖులను ఎంపిక చేస్తారు… ఒకవేళ హఠాత్తుగా వేరే ఏదో గ్రహంపై జీవం కనిపిస్తే, అది మన ప్రపంచం మొత్తానికి వెల్లడైతే, ఆ షాక్ నుంచి మన మానవప్రపంచం తట్టుకోవడం ఎలాగో ఈ రెండు డజన్ల మంది అధ్యయనం చేస్తారట… మరి మతవేత్తలు ఎందుకు అంటారా..?
Ads
ఇప్పటిదాకా మనిషి ఏ వాదనను నమ్ముతున్నాడు..? దేవుడు మనిషిని పుట్టించాడు అని… సకల జీవరాసులనూ దేవుడే పుట్టించాడు అని… మొత్తం నియంత్రణ ఆయన చేతుల్లోనే ఉందని… మరి వేరే గ్రహం మీద కూడా జీవం ఉందని తెలిస్తే ఇప్పటిదాకా మన మతాలు చెబుతున్న సూత్రాలు, సిద్ధాంతాలు, విశ్వాసాలు గట్రా కరెక్టు కాదని మనిషి భావించే అవకాశం ఉంది కదా… జీవం పుట్టుక మీద మరింత గందరగోళం నెలకొనే ప్రమాదం ఉంది కదా… అందుకని గ్రహాంతర జీవులు కనిపిస్తే మనం తట్టుకునే షాక్ అబ్జర్వర్లను ఈ తత్వవేత్తలు ప్రిపేర్ చేస్తారన్నమాట… అబ్సర్డ్ అనిపిస్తోందా..? అవును, గ్రహాంతర జీవంపై అన్వేషణతోపాటు దేవుడి ఉనికి మీద చర్చ కూడా ఎప్పుడూ తేలదు… ఒకవేళ నిజంగానే గ్రహాంతరజీవుడు కనిపిస్తే, అవును, దేవుడు ఈ భూగ్రహం మీదే కాదు, ఈ విశ్వంలో పలుచోట్ల జీవాన్ని సృష్టించాడు అని చెప్పుకోలేదా ఏ మతమైనా… ఎక్కడి దాకో ఎందుకు..? ఊర్ధ్వ, అధో లోకాలు మొత్తం పన్నెండు ఉంటాయని హిందూమతం నమ్మడం లేదా ఏం..? ఏం పర్లేదు, నాసా మహాశయా… నిజంగా ఏలియెన్స్ గనుక కనిపిస్తే, వెంటనే ఆ గ్రహానికి చేరి కబ్జా చేయడానికి మన మనిషి ఎప్పుడూ రెడీయే..!! నిజానికి మనుషులతో ఎలా డీల్ చేయాలో ఆ ఏలియెన్స్ బాగా ప్రిపేర్ కావాలి, మనకు ఆ అవసరం లేదు…!!
Share this Article