ఒక్క ఫోటో వంద పదాలకు సరిసమానమంటుంటారు.. కొన్ని ఫోటోలైతే అలా పదాల సంఖ్యతో కూడా పోల్చలేని స్థాయిలో అనిర్వచనీయమైన అనుభూతిని మిగులుస్తాయి… ఇక మరికొన్నైతే అంతే ఆవేదనకూ నిలువెత్తు నిర్వచనమైతాయి. కథలు కాలగర్భంలో కలిసిపోయినా… చరిత్రను మన ముందుంచే ఫోటో అది! ఆ కథే ఇది!!
అది 1945.. రెండో ప్రపంచ యుద్ధం. జపాన్ లోని హిరోషీమా- నాగసాకిపై కురిసిన బాంబుల వర్షానికి ఆ నగరాలు ఇప్పటికీ కోలుకోలేకుండా పోయి… ఓ చేదు చరిత్రను మిగిల్చిన యుద్ధభూమికి సాక్షీభూతంగా నిల్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అమెరికా పెన్సిల్వేనియాకు చెందిన ప్రఖ్యాత ఫోటో జర్నలిస్ట్ జో ఓ డోనెల్ ను యూఎస్ మిలిటరీ అక్కడి యుద్ధభూమికి పంపింది. ఆయన వెళ్లి తీసిన ఫోటోలు… ఆయన్ని చిరకాలం ప్రపంచం మొత్తం మర్చిపోలేని ఫోటో జర్నలిస్ట్ గా గుర్తింపు దక్కేలా చేశాయి…
పదేళ్ల వయసున్న ఓ బాలుడు… తన వెనుక భాగంలో ఒక బిడ్డను మోస్తున్న ఫోటో ఇది. జపాన్లో ఆ రోజుల్లో.. పిల్లలు వారికంటే చిన్నవారిని వెనక్కి కట్టుకుని.. లేదా ముందు భాగంలో సంచీలాగా తగిలించుకుని ఆడుకునే దృశ్యాలు సర్వసాధారణం. అంతెందుకూ ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి దృశ్యాలు విరివిగానే కనబడుతుంటాయి. అలాగే ఓ కుర్రాడు కూడా కాస్త భిన్నంగా ఫోటో జర్నలిస్ట్ డోనెల్ కంట పడ్డాడు. అతను వచ్చిన ప్రదేశం ఓ శ్మశానం. వచ్చిన తీరు ఆందోళనకరం.
Ads
కాళ్లకు చెప్పుల్లేవ్.. బూట్లు లేవ్. ముఖమంతా నిర్వేదం నిండింది. తన వీపుకి నిద్రపోతున్నట్లుగా ఓ శిశువు తల సంచీలోంచి వేలాడుతూ కనిపిస్తోంది. అప్పటిక ఆ మరుభూమిలో ఓవైపు మారణహోమంలో అసువులు బాసినవారి ఖననాలు, దహనాల ప్రక్రియ కొనసాగుతోంది. క్యూలైన్లలో చాలామంది నిల్చుని ఉన్నారు. వారిలో ఆ బాలుడొకడు. కానీ ఫోటో జర్నలిస్ట్ డోనెల్ కు మాత్రం ఏదో అనుమానం కొడుతోంది. ఇంకేం.. తన మూడో కన్నూ తెరుచుకుంది. అలా కెమెరాలో ఆ బాలుడు వెనక్కి తగిలించుకున్న సంచీలో నిద్రిస్తున్నాడా అన్నట్టున్న మరో బాలుడి ఫోటో బంధించబడింది.
అంతలోకే కాటికాపరులు రానే వచ్చారు. అసలే బాంబుల మోతలు… చనిపోయినవారి బంధువుల హాహాకారాలతో పాటు… అసలే చీకటి కూడా దట్టంగా అలుముకున్న సమయమది. ఆ కాపరులు మెల్లిగా బాలుడి వీపుకున్న సంచీ విప్పారు. అందులో విగతజీవైన ఆ శిశువును తీసి.. కాటిపై పెట్టారు. యథావిధిగా నిప్పంటించారు. అప్పటికే తన కెమెరా కన్నుతో ఎన్నో ఫోటోలను సజీవ సాక్ష్యాల్లా పట్టి బంధించిన… ఆ ఫోటో జర్నలిస్ట్ కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి.
ఇంకోవైపు.. ఆ యుద్ధంలో నా అన్నవాళ్లనందరినీ కోల్పోయి… చివరాఖరికి తన సోదరుడి మృతదేహం కూడా కళ్లముందే దహనమైపోతుంటే… కదలకుండా నిటారుగా నిశ్ఛేష్ఠగా నిలబడ్డ ఆ బాలుడిలో… కాలిబూడిదైపోతున్న సోదరుడు చితి మంటలను మించిన అశ్రుమంట కనిపించింది. కానీ ఎవ్వరికి చెప్పుకునేది…? ఆ సమయాన తన దుఖాన్ని ఎవరు తీర్చేది…? ఆవేదనంతా అరణ్యరోదనే అనుకుని విధి మరిచి తమని సరిబెట్టుకోవాల్సిన సమయం కదా అది…?
ఆ బాలుడి తన దుఖాన్ని ఆపుకోలేని సమయంలో అతడి ఆక్రోషం, ఆవేదన అంతా అతను తన పెదవిని గట్టిగా కొరుక్కుంటున్నప్పుడు వెల్లువెత్తిన రక్తంలో కనిపించిందంటాడు ఫోటో జర్నలిస్ట్ డోనెల్. అప్పుడక్కడే ఉన్న ఓ గార్డ్ ఆ బరువుని నాకియ్ నేను పట్టుకుంటానంటే… అది బరువు కాదు నా తమ్ముడన్న ఆ సోదరుడి అవ్యాజమైన ప్రేమకు సాక్షీభూతమైందట ఆ సందర్భం.
అందుకే డోనెల్ బంధించిన 1945 రెండో ప్రపంచ యుద్ధపు ఫోటో.. జపాన్ లో ఇప్పటికీ ధైర్యానికి చిహ్నంగా చూపిస్తుంటారు. నాటి రక్తచరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిల్చిన ఆ ఫోటో చూసి.. దాని గురించి తెలుసుకున్నవారందరికీ… తమ సమస్య లోతెంత… ? ఆ బాలుడి బాధ ముందు తమ బాధల బరువెంత అనే ప్రశ్నలు కూడా ఇప్పటికీ ఉదయిస్తూనే ఉన్నాయట… (ఆర్టికల్ :: రమణ కొంటికర్ల)
Share this Article