.
మరణించిన మావోయిస్టుల భౌతిక దేహాలను వాళ్ల బంధుగణానికి అప్పగిస్తే, వాళ్లు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి… ఆ మరణాల్ని గ్లోరిఫై చేస్తారని కదా పోలీసు బలగాలు అప్పగింతకు నిరాకరించి, తామే దహనం చేశారు… పైగా లీగల్ క్లెయిమెంట్స్ రాలేదని ఏ సాకులు చెప్పినా సరే..!
ఈ ధోరణి అవసరం అనేవాళ్లు కొందరు, అమానవీయం అనేవాళ్లు కొందరు… రకరకాల అభిప్రాయాలు సమాజంలో… అయితే నంబాల కేశవరావు అనామకంగా, ఓ అనాథశవంగా పైలోకాలకు సాగిపోగా… 1999లో అప్పటి పీపుల్స్‌వార్ ప్రధాన నాయకుడు సంతోష్‌రెడ్డి అంత్యక్రియల గురించి ఓసారి చెప్పుకోవచ్చు… తమ కోసం ప్రాణాలర్పించేవాళ్లకు జనం ఎలాంటి నివాళి ఇస్తారో చెప్పే ఉదాహరణ అది…
Ads
వాళ్ల సిద్ధాంతాలు, ఆచరణలు, పంథాల మీద చర్చ కాదు ఇది… అప్పట్లో ఆ అంత్యక్రియల్ని కవర్ చేసిన ప్రత్యక్ష సాక్షి Ramesh Sharma Vuppala ఎలా గుర్తుచేసుకుంటున్నాడు అంటే…
మొన్నటి ఎన్కౌంటర్ లో అసువులు బాసిన నంబాల కేశవరావు అంత్యక్రియలు చూసిన క్రమంలో 1999 లో దేవరుప్పుల మండలం కడవెండిలో జరిగిన పీపుల్స్ వార్ ప్రధాన నాయకుడి అంత్య క్రియలు గుర్తుకు వచ్చాయి.
అదే సంవత్సరం డిసెంబర్ రెండున వార్ అగ్రనేత ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి కరీంనగర్ జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్ లో మరణించారు… ఆ వార్త తెలియగానే కడవెండి విస్తుపోయింది…
వార్త తెలియగానే సాయంత్రం అక్కడికి వెళ్ళి, ఆయన సహచరుల ఆవేదన సేకరించి, ఈనాడుకు వార్త పంపి, రాత్రి పొద్దుపోయేంత వరకు అక్కడే ఉండి, శవం వచ్చాక అంత్యక్రియలు మర్నాడు జరుతాయని కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ఈనాడుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాను…
మర్నాడు పొద్దుటే బ్యాగులో బిస్కెట్ పొట్లాలు వాటర్ బాటిల్స్ ,కెమెరా రీళ్లు పట్టుకొని తెల్లారేసరికి వెళ్ళాం. వూరు ఊరంతా శోకంలో మునిగిపోయింది. వేలాది మంది అభిమానులు కడవెండి చేరారు. ఆయన పార్టీకి చేసిన సేవలు గుర్తు చేస్తూ ప్రజా గాయకులు అనేక పాటలు పాడారు…
వూళ్ళో ప్రతి కుటుంబం తమలో ఒకరిని కోల్పోయినట్లు, అన్ని పనులు మానుకొని పుట్టెడు దుఃఖంతో శవం దగ్గరే ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్న కొందరు వార్ నాయకులూ వచ్చారు. మారు వేషాల్లో దోతీలు మోకాళ్ళ మీదకు గుంజి కట్టి, కొందరు పోలీసులు కూడా జనంలో కలిసిపోయారు.
బావుల కాడి కొట్టంలోని పశువుల్ని నీళ్లకు వదిలే వాళ్ళు లేక గుంజలకే నీల్గుతూ ఉన్నాయి. ఏ ఒక్క ఇంట్లోంచి కూలి పనులకు పోలేదు. వచ్చీపోయే జనాలకు దాదాపు ప్రతి ఇంటి ముందు. బిందె పెట్టీ మంచినీళ్ళు నింపి, మూత పెట్టీ ఒక చెంబు , దండెం మీద టవల్ అందుబాటులో ఉంచారు.
ప్రజల సందర్శనార్థం శవాన్ని మధ్యాహ్నం దాకా ఉంచారు… ఊరికి ముందు అరకిలోమీటరు దూరంలోని వాగుకు శవయాత్ర చేరేసరికి మూడు గంటలు పట్టింది. దహన ప్రక్రియ చేసే వాగు జనంతో కిక్కిరిసి పోయింది. నమ్మిన సిద్ధాంతం కోసం తన వాళ్ళను వదిలి అడివి బాట పట్టిన సంతోష్ రెడ్డినీ కడసారి చూడాలని పరిసర గ్రామాల నుంచి వేల మంది ఉదయమే తరలివచ్చి శవాన్ని చూసి, కంటనీరు పెట్టుకొని వాగులో కాష్టం దగ్గర చేరారు.
చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకమంది సద్దులు కట్టుకుని వచ్చారు. ఇప్పటిలా ఆధునిక కెమేరాలు లేవు. రీల్ కెమెరాలు. తేడాగా ఎక్కిస్తే రీల్ కదలక పోయేది . వెలుతురులో ఓపెన్ చేస్తే రీల్ మొత్తం పోయేది. సంతోష్ రెడ్డి శవాన్ని కాష్టం మీద పెట్టీ పైన కట్టెలు పేర్చాక, దగ్గరి వాళ్ళు కట్టె పుల్ల వేయడం ఆచారం… ఆ పుల్లలతో కాష్టం అందనంత ఎత్తుకు పెరిగింది. వేలమంది ఇలా కట్టెలు వేశారు. అత్యున్నత స్థాయికి ఎదిగిన నంబాల కేశవరావు అంతిమ యాత్ర కూడా ఇలాగే సాగేదేమో… అదే పోలీసులకు ఇష్టం లేదేమో…
Share this Article