(….. By…. Ramana Kontikarla….) స్వామి వివేకానంద పేరు వినగానే భారతీయులకు మొట్టమొదట స్ఫురించేది ఆయన షికాగో పర్యటన. మతతత్వం, మతోన్మాదం, దాన్నుంచి పుట్టుకొచ్చిన భయంకరమైన వారసత్వమే లేకుంటే… ఈ పుడమి ఇంకా మరెంతో అందంగా ఉండేదని… కానీ హింసతో రక్తసిక్తమైన భూమిగా మార్చి.. నాగరికతను ధ్వంసం చేసిన వైనాన్ని… అలా జరిగి ఉండకపోతే ఈ ప్రపంచం ఇంకా ఎలా అభివృద్ధి చెంది ఉండేదనే అంశాన్ని 1893 సెప్టెంబర్ 11న నరేంద్రుడు షికాగో లోని ఆర్ట్ ఇనిస్టిట్యూట్ లో చెప్పిన మాటలు ఇవాల్టికీ మారుమోగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అవి ప్రపంచ యవనికపై భారతదేశ ఔన్నత్యాన్ని చాటిన వ్యాఖ్యలు గనుక..! అయితే వివేకానందుడి ఆ షికాగో యాత్రకు స్ఫూర్తెవరూ… అసలా పర్యటనకు స్పాన్సరెవరూ…?
ఈ ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప బంధం స్నేహబంధమేనంటారు. భార్యతో, భర్తతో, తల్లితో, పిల్లలతో, ఇతర బంధువులతో కూడా చెప్పుకోలేనివి స్నేహితులతో పంచుకున్నప్పుడు కాసింత ఆసరా, లేదంటే కనీసం ఊరటైనా లభిస్తుంటుంది. అదిగో అలాంటి ఓ ఫ్రెండే వివేకానందుడి షికాగో పర్యటన వెనకున్నారట. ఆయనే రాజా అజిత్ సింగ్ బహదూర్.
రాజస్థాన్ లో జుంజుని జిల్లాలోని ఖేత్రీ సంస్థానానికి అప్పటి పాలకుడే అజిత్ సింగ్ బహదూర్. అయితే యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వివేకానందుడి షికాగో చారిత్రాత్మక ప్రసంగం వెనుక… అజిత్ సింగ్ బహదూర్ సహకారం.. ఖేత్రీ రాజభవన సంస్థానం పోషించిన పాత్ర ఎనలేనిదనేది బహు కొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయం.
Ads
సుమారు 20 ఏళ్ల పాటు షెఖావత్ రాజవంశాన్నీ, ఖేత్రీ సంస్థానాన్ని పాలించిన అజిత్ సింగ్ బహదూర్… 1888లో మౌంట్ అబూలో వివేకానందుణ్ని కలిసిన తర్వాత అత్యంత ప్రభావితమవ్వడంతో పాటు… వారిద్దరి మధ్యా స్నేహం చిగురించింది. వారిద్దరి మధ్యా ఆధ్యాత్మిక అంశాలు, యోగా, ప్రపంచశాంతికి అవసరమయ్యే సార్వత్రిక అంశాలపై ఎక్కువ చర్చ జరిగిందట.
అంతేకాదు… అసలు తలపాగా లేకుండా ఊహించుకోలేని వివేకానందుడి పాగా వెనుకాల కూడా రాజా అజిత్ సింగ్ బహదూర్ ప్రేరణే కారణమట. రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతంలో దుమ్మూ, ధూళి నుంచి కేశాలను రక్షించుకునేందుకు.. బహదూరే వివేకానందుడికి ఆ తలపాగా ఇచ్చారట. అదే తర్వాతి రోజుల్లో వివేకానందుడి సంప్రదాయ వస్త్రధారణలో భాగమైపోయింది. అయితే ఇవన్నీ చతుర్వేది బద్రీనాథ్ రాసిన ‘లివింగ్ వేదాంత’ అనే పుస్తకంలో పేర్కొనడంతో పాటు… అసలు నరేంద్రుడి పేరు వివేకానందుడిగా మార్చింది కూడా రాజా అజిత్ సింగ్ బహదూరేనని ఆ పుస్తకంలో తెలిపారు.
ఒక మాంక్… ఒక మహారాజ్ మధ్య ఏర్పడ్డ ఈ మైత్రిబంధం… ప్రాణ స్నేహితులుగా మార్చడమే ఇక్కడ విశేషం. అయితే ఖేత్రీ సంస్థానంలో ఒక నాల్గు నెలల పాటు వివేకానందుడు ఉండటంతో వారి స్నేహం మరింత పరిమళించింది. ఆ తర్వాత వారు కలిసిందీ తక్కువే అయినప్పటికీ వారి మధ్య విడదీయరాని ఆత్మీయ స్నేహబంధం లేఖల రూపంలో ఇప్పటికీ సజీవ సాక్ష్యమై కనిపిస్తోంది.
మీరే నా జీవితంలో అత్యంత ప్రభావితం చేసిన ఏకైక స్నేహితుడంటూ అజిత్ సింగ్ బహదూర్ రాసిన లేఖలతో పాటు… మీరే నిజమైన స్నేహితులంటూ స్వామి వివేకానంద కూడా అజిత్ సింగ్ బహదూర్ కు స్వీయ దస్తూరితో రాసిన లెటర్స్ ఇప్పటికీ పశ్చిమబెంగాల్ బేలూర్ లోని రామకృష్ణ మిషన్ తో పాటు.. ఖేత్రీలో ఏర్పాటు చేసిన మ్యూజియంలోనూ దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా షికాగో పర్యటననంతరం భరతజాతి ఖ్యాతిని దిగంతాలకు చాటడమే కాకుండా… వివేకానందుడి ప్రసంగాన్ని కొనియాడుతూ అజిత్ సింగ్ బహదూర్ లేఖ రాయడం.. అందుకు కృతజ్ఞతగా తానక్కడికి వెళ్లేందుకు కారణమైన అజిత్ సింగ్ బహదూర్ సహకారాన్ని గుర్తు చేసుకుంటూ వివేకానందుడు రాసిన లేఖలు వారి మైత్రిబంధానికి ప్రతీకలు.
1898 సెప్టెంబర్, అక్టోబర్ మధ్య వివేకానందుడి ఆరోగ్యం దెబ్బ తినడం.. అదే సమయంలో అజిత్ సింగ్ కు ఉభయకుశలోపరి అంటూనే ఆయన ఆరోగ్యాన్ని ఆరా తీస్తూ రాసిన లేఖలు… వారిద్దరి మధ్య వ్యక్తిగత స్నేహాన్ని రుజువు చేసేవి. తనకు అమెరికాలో స్నేహితులున్నప్పటికీ… వారు సాయం చేయడానికీ సిద్ధంగా ఉంటారని తెలిసినా… వారినడగడానికి తాను సిగ్గుపడతానంటూ.. తను అనారోగ్యంపాలైన రోజుల్లో వివేకానందుడు రాజా అజిత్ సింగ్ కు లేఖ రాశాడు.
అనారోగ్యం వల్ల ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేనేవరినైనా అడుక్కోవాల్సి వస్తే… అది మీరేనంటూ అజిత్ సింగ్ కు వివేకానందుడు రాసిన లేఖతో… చలించిపోయిన రాజు వెంటనే అప్పట్లో 500 రూపాయల మనియార్డర్ చేశారట. అంతేకాదు వివేకానందుడి తల్లి ఆరోగ్యం క్షీణిస్తే కూడా రాజా అజిత్ సింగ్ బహదూరే… నెలకు వంద రూపాయల స్టైఫండ్ కేటాయించారట. అలా మాంక్ వివేకానంద.. కింగ్ అజిత్ సింగ్ బహదూర్… నాడు దోస్తానాకు ఓ కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన ఈ కథ హిస్టరీలో ఓ స్ఫూర్తిదాయక పేజీగా నిల్చింది…!!
Share this Article