Kandukuri Ramesh Babu ……. విను తెలంగాణ – గజ్వేల్ : ఇది ఒక నిర్వాసితుడి గెలుపు నియోజకవర్గం… గజ్వేల్ అంటే మన ‘జాతి పిత’ నియోజకవర్గం. అంతేకాదు, ఇంకా పోరాడుతున్న మల్లన్న సాగర్ నిర్వాసితుల పునరావాస కేంద్రం కూడా. అక్కడ “భయపడకండి” అంటూ మూడు పయ్యల గుర్తు మీద పోరాడుతున్న ఈ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క లా పాప్యులర్ కాకపోవచ్చు. సామాజిక మాధ్యమాల్లో అతడు పోటీ వైరల్ కాకపోవచ్చు. అతడిని కలవడానికి మీరు వెళ్ళే ప్రయతం చేయకపోవచ్చు. కానీ అతడు ఇంకోరకంగా గెలుస్తున్నాడు. పోరాడి ఓడిన హృదయాల్లో అతడు నిలుస్తున్నాడు. కెసిఆర్ గారు గజ్వేల్ నుంచే కాకుండా కామారెడ్డి లో పోటీ చేయడమే అందుకు నిదర్శనం.
ఆయన ఎవరూ అంటే మరొక్క ముఖ్య విషయం చెప్పాలి. అది తన తండ్రి గురించిన విషయం. ఎటువంటి అనారోగ్యం లేకుండా ఎనభై ఏళ్ళు జీవించిన వ్యవసాయ దారుడు తన తండ్రి. పదో తరగతి దాకా చదివినా వ్యవసాయం ఇష్టం కాబట్టి ఉద్యోగం చేయకుండా సాగుమీదే జీవించిన వ్యక్తి. తమ గ్రామాలన్నీ మల్లన్న సాగర్ లో మునిగిపోతున్నాయని తెలిసి, ఒక నిర్వాసితుడిగా బ్రతకడం ఎట్లా? అని రంది పడుతూ, ఇంటిని, పశువులనూ తోటి బంధు మిత్రుల స్థితిని గురించి ఆవేదన చెందుతూ, కలవరిస్తూ కలవరిస్తూ గుండె పగిలి చనిపోయిన వ్యక్తి. ఆ దుఖం కొడుకుగా ఇతడిని పట్టి పీడిస్తోంది. “ఉన్న తండ్రిని కోల్పోయాను. కన్న ఊరును కోల్పోయాను. ఇంకా ఏం జరుగుతుంది? ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్నాను. మా అందరికి ప్రభుత్వం ఏం హామీ ఇచ్చిందో వాటన్నిటినీ సాధించేందుకు పోరాటడం నా కనీస కర్తవ్యం” అని ధృడంగా చెప్పారాయన.
ఇంతకీ కెసిఆర్ గారు, అదే మన జాతి పిత ఇక్కడ గెలుస్తారా? అంటే చెప్పలేం. గెలవవచ్చు. కానీ ఆ ఊర్లో ఉన్న గాంధీ తాత విగ్రహం మాత్రం ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది. ముంపు నుంచి భయట పడిన విగ్రహం కదా అది. దాన్ని మళ్ళీ ఎవరూ తొలగించలేరనే విశ్వసిస్తాను…
Share this Article
Ads