ఆంధ్రజ్యోతి, ఈనాడు పట్టించుకోలేదేమో గానీ… ఓ వెబ్‌సైట్‌లో ఆసక్తికరమైన పాయింట్ ఒకటి కనిపించింది… అదే, రామోజీరావు, శైలజా కిరణ్ మీద ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ జారీ చేసింది కదా… ఒక వ్యక్తిని రామోజీరావు తుపాకీతో బెదిరించి సంతకాలు చేయించుకున్నాడని..! ఆ వెబ్ విలేఖరి విశ్లేషణ ఏమిటంటే…
‘‘అసలు ఈ కేసులో ఏపీకి ఎక్కడైనా లింక్ ఉందా ? మార్గదర్శి హెడ్ క్వార్టర్ హైదరాబాద్, గన్ పెట్టి బెదిరించారని చెప్పిన ప్లేస్ హైదరాబాద్, సంతకాలు పెట్టింది హైదరాబాద్… మొత్తం హైదరాబాద్ లో ఉంటే విజయవాడకు వచ్చి సీఐడీకి ఎందుకు ఫిర్యాదు చేశాడు. సీఐడీ వాళ్లు అంతకంటే పెద్ద ఫిర్యాదు లేదన్నట్టుగా ఎందుకు కేసు పెట్టారో అర్థం చేసుకోవచ్చు. వాళ్లు చెప్పే లింక్ ఒక్కటే.. రామోజీ రావుది.. ఈ కేసు పెట్టిన రెడ్డి గారి తండ్రిది కృష్ణా జిల్లాలో ఒకే గ్రామమట… ఆ లింక్ పెట్టి కేసు పెట్టేశారు సీఐడీ వాళ్లు…’’
నిజమే కదా, రామోజీరావు నేరం చేశాడనే అనుకుందాం… నేరం జరిగింది హైదరాబాదులో కదా, మరి ఏపీ సీఐడీకి ఏం పని..? రేప్పొద్దున ఏ యూపీలోనో, పంజాబ్‌లోనో… అంతెందుకు ఏ ఇతర దేశంలోనే నేరం జరిగినా సరే ఏపీలో కేసు పెట్టేస్తారా..? పరిధి మాటేమిటి..? ఫిర్యాదుదారు లేదా నిందితుడి స్వస్థలం ఏపీకి చెందినదైతే ఇక చాలు అన్నట్టేనా..? సరే, ఏతావాతా అర్థమయ్యేది ఏమిటి..?
Ads
ఏమీ లేదు, సింపుల్… చంద్రబాబును చేస్తున్నట్టుగానే రామోజీరావును అష్టదిగ్బంధనం చేయడం… మార్గదర్శి కేసులు వీక్ అయితే ఇది తెర మీదకు వస్తుంది… ఇది కాకపోతే మరొకటి… కేసు ఎప్పటికి తేలుతుంది, అసలు ఈ కేసులు నిలబడతాయా అనేది వేరే సంగతి… రామోజీరావును చిక్కుల్లో పడేయాలి… సేమ్, చంద్రబాబు మీద ప్రయోగిస్తున్నట్టుగానే… ఒకటి పోతే మరో కేసు… చంద్రబాబు మాత్రమే కాదు, లోకేష్‌పై కూడా… తన హిట్ లిస్టులో ఆంధ్రజ్యోతి, టీవీ5 కూడా ఉన్నాయి గానీ, పక్కాగా బుక్ చేసే ఇష్యూ ఏదీ దొరుకుతున్నట్టు లేదు…
మరో సందేహం ఏమిటంటే… మార్గదర్శి, ఈనాడు తన తండ్రి పెట్టిన భిక్షే అనీ, వారసుడిగా తన వాటాల మేరకు తనకు న్యాయం జరగాలంటున్న ఈ ఫిర్యాదుదారు యూరిరెడ్డి ఇన్నిరోజులు ఎందుకు మౌనంగా ఉన్నట్టు..? కోర్టులకు పోలేదు, పోలీస్ స్టేషన్లకూ పోలేదు… మార్గదర్శి మీద కేసులు బిగుసుకుంటున్నవేళ హఠాత్తుగా తనకు జరిగిన అన్యాయం గుర్తొచ్చింది…
మార్గదర్శి మీద ఎంత ప్రయత్నిస్తున్నా సరే, జనంలో పెద్ద నెగెటివ్ స్పందన లేదు, ఎవరూ మార్గదర్శి ఆఫీసుల ఎదుట ధర్నాలు చేయడం లేదు… ఇప్పుడు ఇది మరో కేసు… ఇంతకీ ఏమిటీ కేసు..? ఓసారి సాక్షి పబ్లిష్ చేసిన వార్తాకథనాల క్లిప్పింగులు చూడండి… కేసుల సారాంశం అర్థమవుతుంది…
మరి ఇన్నిరోజులూ ఏం చేశావయ్యా అంటే… షేర్లు ట్రాన్స్‌ఫర్ అయిన సంగతి ఇప్పుడే తెలిసిందట… డివిడెండ్ ఇస్తున్నట్టు చెప్పి, షేర్ల ట్రాన్స్‌ఫర్ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారట… డివిడెండ్ ఇస్తున్నట్టు నమ్మకంగా చెప్పి సంతకాలు చేయించుకున్నప్పుడు ఇక తుపాకీ చూపి సంతకాలు చేయించడం దేనికి..? పైగా ఇంతటి జ్ఞాని ఏమీ చదవకుండానే సంతకాలు చేసి వెళ్లిపోయాడా..? 2014లో సాక్షి కథనాలు రాసేవరకూ తనకు మార్గదర్శిలో షేర్లున్నట్టు తెలియదట… హేమిటో…
ఈనాడుకు సాయం, డాల్ఫిన్స్‌లో షేర్లు, మార్గదర్శిలో షేర్లు… ఈనాడుకు పెట్టుబడి నుంచి యంత్రాలు కూడా మా నాన్నే సమకూర్చాడు అంటున్న ఈ యూరి రెడ్డి తండ్రి వారసత్వపు సంపద మీద ఇన్నేళ్లూ ఎందుకు ఫైట్ చేయలేదనే ప్రశ్న కూడా తలెత్తుతుంది… సరే, ఇదేదో ఆస్తుల గొడవ, షేర్ల వివాదం అనుకుంటే… ఏపీ సీఐడీకి ఏం పని..? అందుకని తుపాకీ బెదిరింపులు, నిర్బంధ సంతకాలు కథను పైకి తీసుకొచ్చారన్నమాట…
మరి ఇలాంటి కేసులు పెట్టడం ఏమిటీ అంటారా..? మరి జగన్ మీద కూడా యెల్లో క్యాంపు, కాంగ్రెస్ క్యాంపు కలిపి నడిపించిన కేసులు ఏమైనా సరైనవా..? తను 16 నెలలు జైలులో మగ్గలేదా..? ప్రతీకార వాంఛ తనలో రగలడం లేదా..? అంతే… ఇవన్నీ రాజకీయాలు… ఏపీ రాజకీయాలు ఇలాగే క్రూరంగానే ఉంటాయి..!! అవునూ, రామోజీరావు పట్ల సానుకూలంగా ఉన్న కేసీయార్ ఆయన అరెస్టుకు సహకరించడం లేదు… మరి కొంపదీసి కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకురాడు కదా జగన్…!!
Share this Article