రాజకీయాల్లో… పరిపాలనలో… సమర్థ నిర్ణయాలు తీసుకోవడమే కాదు, తీసుకుంటున్నట్టు ప్రజలకు కనిపించడం కూడా ప్రధానమే..! అది ప్రభుత్వంపై ఓ విశ్వాసాన్ని పెంచుతుంది… ‘‘నేనే భారీ ప్రాజెక్టుల డిజైన్లు గీస్తా, కాంటూరు లెవల్స్ లెక్క తీస్తా, నేనే బిల్డింగుల ప్లాన్లు గీస్తా, నేనే బడ్జెట్ రాసిస్తా…’’ అనేంత పరమాద్భుత జ్ఞాన ముఖ్యమంత్రుల్ని కాసేపు పక్కన పెడితే… తాజాగా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంట్రస్టింగు… తమ ప్రభుత్వానికి, తమ రాష్ట్రానికి ఓ ఆర్థిక సలహా మండలిని వేశాడు సీఎం స్టాలిన్… అందులో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్, నోబెల్ అవార్డీ ఈస్తర్ డఫ్లో, కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్తోపాటు డెవలప్మెంట్ ఎకనమిస్ట్ జీన్ డ్రెజ్, కేంద్ర మాజీ ఆర్థికశాఖ కార్యదర్శి ఎస్.నారాయణ్ కూడా ఉన్నారు… అందరూ ఆర్థికాంశాల్లో దిట్టలే… నిపుణులే… (మోడీ వ్యతిరేకులే)… ఐతే…
వీళ్లు స్థూలంగా ఒక దేశం ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని చక్కదిద్దగలరేమో… కానీ రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు డిఫరెంట్… బోలెడన్ని జనాకర్షక పథకాలతో కునారిల్లిన తమిళనాడు రాష్ట్ర ఖజానాను చక్కబెట్టడానికి, కఠినచర్యలు తీసుకోవడానికి రాజకీయ పరిమితులు చాలా ఉంటయ్… ఆర్థిక జ్ఙానంతోపాటు రాజకీయ అవసరాలను జోడించగలవాళ్లు అవసరం… నిజానికి స్టాలిన్ తన ఆర్థిక మంత్రిగా త్యాగరాజన్‌ను పెట్టుకోవడంలోనే మంచి మెళకువ ప్రదర్శించాడు… మంచి సంకేతం కూడా ఇచ్చాడు… త్యాగరాజన్ గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా… 1936లో మద్రాస్ ప్రెసిడెన్సీకి పీటీ రాజన్ అనే ముఖ్యమంత్రి ఉండేవాడు… జస్టిస్ పార్టీకి చివరి అధ్యక్షుడు ఆయన… అదుగో, ఆయన కొడుకు పీటీఆర్ పళనివేల్ రాజన్… ఆయన తమిళనాడు స్పీకర్‌గా, మంత్రిగా కూడా చేశాడు… ఆయన కొడుకు ఈ పీటీఆర్ త్యాగరాజన్… ఈయన Lawrence School, Lovedale లో స్కూలింగ్… తరువాత తిరుచిరాపల్లి (తిరుచ్చి) రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఇప్పుడు ఎన్ఐటీ)లో కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు… తరువాత అమెరికా… State University Of New York, Buffalo లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు… అక్కడే పీహెచ్డీ కూడా… MIT Sloan School Of Management లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశాడు… ప్రధాన సబ్జెక్టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్…
Ads
ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆనుపానులు తెలిసినవాడే… తనను మించి ఈ కొత్త సలహామండలి నిపుణులు పెద్దగా చెప్పేదేమీ ఉండదు… కానీ ప్రొఫెషనల్స్ మార్గదర్శకత్వంలో ఖజానాను ఓ దారిలో పెట్టబోతున్నాం అనే సంకేతం జనానికి ఇవ్వాలి… ఆ లక్ష్యానికి ఈ కొత్త సలహాదార్ల ఎంపిక ఉపయోగపడుతుంది… పాలన వ్యవస్థపై ఐఏఎస్ అధికారుల పెత్తనం తగ్గాలంటే… బాగా చదువుకున్న తరం రాజకీయాల్లోకి రావాలి… సబ్జెక్టు నిపుణులు పాలన వ్యవస్థలోకి రావాలి… ఈ రెండు దిశల్లోనూ స్టాలిన్ తీసుకున్న నిర్ణయం భేష్… అఫ్ కోర్స్, అంతిమంగా రాజకీయ అవసరాలే ఆర్థికాంశాల్ని నిర్దేశిస్తాయి… అంతిమ నిర్ణయాధికారం ఎవరిదైనా కావచ్చుగాక… కనీసం మంచీచెడూ విశ్లేషించి, నాలుగైదు దారులు చూపించే సమర్థులయితే కావాలి కదా… కౌటిల్యుడికే ఆర్థిక పాఠాలు చెప్పగల కేసీయార్‌కు వీళ్లెవరూ అవసరం లేదు గానీ… పంచుడు పథకాలతో వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తున్న జగన్‌కు ఈ వార్త ఎవరైనా చూపిస్తే బాగుండు…!!
Share this Article