* వసంతాలు వెదుకుతాయి నీవెక్కడని… ఈనాడు
* గగన కచేరికి గానకోకిల… సాక్షి
Ads
* పాటవై మిగిలావు.. ఆంధ్రజ్యోతి
* తేరి ఆవాజ్ హి పెహచాన్ హై… నమస్తే తెలంగాణ
*అల్విదా…. నవతెలంగాణ
*మూగవోయిన గానకోకిల… దిశ
* గగనానికి గానకోకిల…. వెలుగు
ఇవి ఇవాళ్టి పేపర్లలో లత మరణ వార్త హెడ్డింగ్స్…
సాధారణంగా ఇటువంటి సందర్బాలలో జ్యోతి హెడ్డింగ్స్ బాగుంటాయి. ఇవాళ మాత్రం ఈనాడు హెడ్డింగే బావుందని నాకనిపించింది. తరవాత సాక్షి నచ్చింది. హిందీ గాయని, తెలంగాణకు హిందీతో ఉండే అనుబంధం కలిపి నమస్తే హెడ్డింగ్ పెట్టినట్టున్నారు. మిగతావన్నీ సీదా సాదాగా వున్నాయి…
****
డెస్క్ ఇంచార్జ్ గా చేసిన వాళ్లకు ప్రత్యేకమైన వార్తల సందర్భంలో ఇదో వ్యసనం. ఎదుటి పేపర్ ఏ హెడ్డింగ్ పెడతారో అని ధ్యాస… దానికంటే మన హెడ్డింగ్ బాగుండాలని తపన. నిన్న ‘ముచ్చట’లో ఒక సబ్ ఎడిటర్ మిత్రుడి వేదన చదివాక నాకూ ఒక జ్ఞాపకం మెదిలింది.
అది 1988… హిందీ నటుడు రాజ్ కపూర్ దాదాపు పదిహేను రోజులు ఆసుపత్రిలో ఇక ఇప్పుడో ఇంకో గంటలోనో అన్నట్టున్నాడు. నేను ‘ఉదయం’ లో సబ్ ఎడిటర్. ఐటమ్ సిద్ధం. మృణాళిని గారు రాసారు. ‘నటరాజ’కపూర్ అస్తమయం అని పతంజలిగారు హెడ్లైన్ ఇచ్చారు. బ్రోమైడ్ రెడీ. ఆ పదిహేను రోజులు నేను నైట్ షిఫ్ట్ లోనే ఉన్నాను. అయోధ్య, కృష్ణుడు, వేణుల్లో ఎవరో ఒకరు నైట్ డెస్క్ ఇంచార్జ్లు. నేను రిలీవర్. మృణాళిని గారు డే లేదా మిడిల్ షిఫ్ట్ లో ఇంచార్జ్ గా ఉండేవారు. ఆవిడ ప్రతిరోజూ డ్యూటీ నుంచి వెళ్లేప్పుడు రాజ్ కపూర్ విషయంలో అలర్ట్ గా వుండండి అని చెప్పి వెళ్లే వారు. పతంజలి గారు కూడా హెచ్చరించి వెళ్ళేవారు. సిటీ ఎడిషన్ ప్రింట్ కు క్లియర్ చేసే ముందు ఓ సారి పిటిఐ కాపీ చూసి మరీ ఇచ్చే వాళ్ళం. అంటే అందరమూ ఆయన ఉన్నాడా పోయాడా అని ఎదురుచూస్తూ ఉండేవాళ్ళమనమాట. అప్పుడప్పుడు మృణాళిని గారు,పతంజలి గారు ఏ పన్నెండు గంటలకో ఫోన్ చేసేవారు. ఫీడ్ చెక్ చేశారా అని…
నిజానికి మృణాళిని గారికి, పతంజలిగారికి, కృష్ణుడికి, నాకూ అందరికీ రాజ్ కపూర్ అంటే బోలెడు ప్రేమ. ఆయన చావు కోసం వృత్తిపరంగానే అయినప్పటికీ మేమంతా ఎదురు చూడడం కించిత్ బాధే. చివరకొక రోజు రాత్రి 12 గంటలకు కపూర్ మరణవార్త వచ్చింది. ఆ నైట్ బహుశా కృష్ణుడు ఇంచార్జ్ . డెస్క్ లో నేనూ ఉన్నాను. ఎట్టకేలకు అనుకుని నిట్టూర్చి బ్రోమైడ్ అతికించి హమ్మయ్య అనుకున్నాం. బ్రోమైడ్ కొద్దిగా రంగు కూడా మారింది. ఫిల్మ్ సెక్షన్లో అడిగి వాళ్ళు పర్లేదు అని చెప్పాక పేజ్ క్లియర్ చేసాం. వృత్తికి ప్రవృత్తికి సంఘర్షణ ఇలాంటి సందర్భాలలోనే అమానుషంగా జరిగేది. వృత్తిలో ఉండే మొరటుదనమే భావోద్వేగాలను మింగేస్తుంటుంది.
****
ఫుట్ బాల్ వరల్డ్ కప్ మ్యాచ్ లు తెల్లవారుజాము రెండు వరకూ జరిగేవి. ఎక్స్ట్రా టైం లు… సడన్ డెత్ లు అయితే ఇంకా ఆలస్యం అయేది. నేను ఆంధ్రభూమిలో డెస్క్ ఇంచార్జ్. అయినా ఫుట్ బాల్ పిచ్చతో ఐటమ్ నేనే రాసేవాడిని. తాడి ప్రకాష్ గారు మా ఎడిషన్ ఇంచార్జ్. ఆయనకు కూడా టెన్నిస్ అన్నా ఫుట్ బాల్ అన్నా ఇంట్రెస్ట్. అందుకే ఎడిషన్ లేట్ అయినా సరే మొత్తం మ్యాచ్ అయ్యాకే పేజ్ రిలీజ్ చేసేవారం. నాకు మారడోనా ఆడే టీం గెలవాలన్నది కోరిక. పేజ్ స్పీడ్ గా ఇవ్వాలంటే బ్రోమెయిడ్ రెడీగా ఉండాలిగా. అందుకే ఆడుతున్న రెండు జట్లు గెలిచినట్టుగా వేర్వేరు ఐటమ్ లు రాసేవాడ్ని. గెలిచిన జట్టు స్కోర్ వరకు జోడించి పేజ్ ముగించే వాళ్ళం. అలా రెండు అయిటంలు రాసేపుడు… మారడోనా జట్టు ఓడింది అని రాయడం నాకు వ్యక్తిగతంగా చాలా బాధగా ఉండేది. అయినా తప్పదుగా…
***
కారం చేడు ఘటన జరిగిన రోజు కూడా సేమ్ పెయిన్. ఆ రోజు అసలు అక్కడేం జరిగిందో మనకు తెలిసి కూడా ఇక్కడ పేజీలో మరొకటి పెట్టాల్సి రావడం నిజంగా నరకం. ఈ నరకం గురించి నేనో కవిత కూడా రాసుకున్నాను. అదంతే.
Share this Article