సుబ్బారావు అని ఆ ఊళ్లో ఓ వడ్డీ వ్యాపారి… ఎవరికి ఏం అవసరమొచ్చినా అధిక వడ్డీలకు డబ్బులివ్వడం తన అలవాటు… తనంత తెలివిమంతులు వేరే లేరని పెద్ద గీర తనకు… అప్పారావుకు కష్టమొచ్చి పలుసార్లు సుబ్బారావు దగ్గర అప్పు తీసుకున్నాడు… మిత్తీలు కలిపితే తడిసి మోపెడు అవుతోంది… అప్పారావు తీర్చే స్థితిలో లేడని తెలుస్తూనే ఉంది… కానీ వసూలు ప్రయత్నం తప్పదు కదా… గట్టిగా నిలదీసి అడగడానికి అప్పారావు ఇంటికి వెళ్లాడు…
అప్పారావు బతిమిలాడుతున్నాడు… ఓ గడువు తేదీ పెట్టాడు సుబ్బారావు… ఆ తేదీలోపు తీర్చలేకపోతే మర్యాద దక్కదని హెచ్చరించాడు… ఈలోపు లోపల నుంచి అప్పారావు బిడ్డ మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చింది… సుబ్బారావు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు… అప్పారావుకు అంత అందమైన బిడ్డ ఉందని తెలియదు తనకు… తన భార్యేమో చాన్నాళ్ల క్రితం చనిపోయింది… ఆమెను చూడగానే సుబ్బారావు మనసులో ఓ కోరిక మొలకెత్తింది… పెరిగింది…
అప్పటికప్పుడు అప్పారావుకు ఓ ఆఫర్ ప్రకటించాడు… ‘‘నీ బిడ్డను నాకిచ్చి పెళ్లి చేసెయ్, నీ అప్పు మొత్తం రద్దు చేస్తా… నువ్వు హేపీగా ఉండొచ్చు, నేనూ హేపీగా ఉండొచ్చు, జీవితాంతం ఆమె సుఖంగా బతుకుతుంది… ముగ్గురికీ ప్రయోజనకరం’’ అన్నాడు… అప్పారావు డైలమాలో పడ్డాడు… ఎందుకంటే..? సుబ్బారావు వయస్సు ఎక్కువ, అనాకారి, మోసకారి, ఆశపోతు… ఆమె తనను తప్పనిసరై పెళ్లి చేసుకునేలా ఇంకాస్త ఇరికించాలని సుబ్బారావు ఓ ప్లాన్ ఆలోచించాడు…
Ads
నేను ఒక చేతిలోకి నల్ల రాయి ఒకటి, తెల్ల రాయి ఒకటి తీసుకుంటాను, గుప్పిట్లో పెట్టుకుంటాను, నీ బిడ్డను ఏదో ఒక రాయిని కళ్లు మూసుకుని తీసుకొమ్మను… ఒకవేళ నల్లరాయి వస్తే అప్పారావు అప్పులు రద్దు, ఆమెకు సుబ్బారావుతో పెళ్లి… పోనీ, తెల్లరాయి తీస్తే అప్పులు రద్దు, ఆ అమ్మాయితో పెళ్లి కూడా అవసరం లేదు… ‘‘సో, దేవుడు ఏది నిర్ణయిస్తే అది, సరేనా’’ అన్నాడు… ఈలోపు కొందరు పెద్దమనుషులు అక్కడికి చేరుకున్నారు… సుబ్బారావు దుర్నీతి అర్థమవుతున్నా ఎవరూ ఏ సాయమూ చేయలేని పరిస్థితి… సుబ్బారావు కిందకు వంగాడు, అక్కడ బోలెడు రాళ్లున్నాయి… అప్పారావు గమనించకుండా రెండూ నల్లరాళ్లే తీసుకున్నాడు…
దీన్ని అప్పారావు బిడ్డ గమనించింది… ఇంకెవరూ గుర్తించలేదు… మరి ఇప్పుడేం చేయాలి ఆమె… మూడు దారులు… 1) రెండూ నల్లరాళ్లనే చేతిలోకి తీసుకున్నాడనీ, మోసగిస్తున్నాడనీ తండ్రికి చెప్పేయడం… తద్వారా ప్రయోజనం శూన్యం… సుబ్బారావు మళ్లీ మాటమార్చి నా అప్పు తేల్చు, లేదా బిడ్డనివ్వు అంటాడు… 2) సుబ్బారావు దురాలోచనకు తలొగ్గి, నల్లరాయిని తీసుకోవడం, తన బతుకును రసహీనం చేసుకోవడం… ఆ ఆలోచనే ఆమెకు దుర్భరంగా ఉంది… 3) అసలు ఏ రాయినీ తీసుకోకుండా, ఆ ప్రతిపాదనే తనకు ఇష్టం లేదని అడ్డంగా తిరస్కరించడం… దాంతోనూ ప్రయోజనం లేదు, తండ్రిని వదలడు సుబ్బారావు…
ఆమె కాస్త ఆలోచించి తీసుకున్న ఓ తెలివైన నిర్ణయంతో సుబ్బారావు తెల్లమొహం వేశాడు… ఎలాగంటే..? సుబ్బారావు చేతిలో నుంచి ఓ రాయి తీసుకుంది… అది ఏ రంగురాయో చూపించకుండానే పొరపాటున కిందపడిపోయినట్టుగా… తనే వదిలేసింది… అరెరె, మిగతా రాళ్లలో కలిసిపోయిందే, మరెలా అన్నది తనే… ‘ఇప్పుడు మీ చేతిలో మిగిలిన రాయి రంగు చూపించండి, దానికి భిన్నమైన రంగు రాయిని నేను ఎంపిక చేసుకున్నట్టు లెక్క…’ అన్నది… సుబ్బారావు నిశ్చేష్టుడయ్యాడు…
తన చేతి నుంచి ఆమే రాయిని బయటికి తీసింది… సహజంగానే అది నల్లరాయే కదా… సో, కింద పడిన రాయి తెల్లదన్నమాట… అంటే సుబ్బారావు ముందే చెప్పినట్టు అప్పులు రద్దు, ఆమెతో పెళ్లి ప్రతిపాదన కూడా రద్దే అన్నమాట… పెద్దమనుషులు కూడా అదే నిజం, దేవుడు నిర్ణయించింది కూడా అదే అని ముక్తకంఠంతో చెప్పేశారు… ఆ క్షణంలో ఆమెకు చటుక్కున వెలిగిన ఆ ఆలోచన తన జీవితాన్ని, తన ఆనందాన్ని రక్షించింది… అంతేమరి… దాన్నే డెస్టినీ అంటాం… (ఓ ఇంగ్లిష్ సోషల్ పోస్టుకు ఎప్పటిలాగే నా తెలుగు స్వేచ్చానువాదం…. శ్రీనివాసరావు మంచాల…)
Share this Article