.
ఆమె పుట్టగానే తండ్రి కుండలి వేయించాడు… ఆమె విజయం రెండు రంగాల్లో ఉన్నట్టు చెబుతోంది… ఒకటి వైద్యం, రెండు ఆటలు… డాక్టరీ చదివిస్తే గ్వాలియర్‌కు మాత్రమే తెలుస్తుంది… ఆటల్లో క్లిక్కయితే ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది అనుకున్నాడు ఆ తండ్రి…
ఆయన నమ్మాడు… ఆటల వైపే నడిపాడు ఆమెను… బోలెడంత నిరాశ… కఠిమైన సాధన… ఎట్టకేలకు అన్నీ దాటుకుని మొన్నటి వైజాగ్ మ్యాచులో ఇంటర్నేషనల్ కెరీర్‌లోకి డెబ్యూ… ఇప్పుడు ఆమె ఎవరు అని తెగ సెర్చింగు సాగుతోంది… హఠాత్తుగా స్మృతి మంథానలాగే ఈమె కూడా నేషనల్ క్రష్ అయిపోయింది… ఆమె పేరు వైష్ణవి శర్మ…
Ads

చంబల్ లోయ నుంచి వైజాగ్ తీరం వరకు ఒక స్పిన్ ప్రయాణం!
భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు… అదొక మతం… మైదానంలో టీమ్ ఇండియా దిగుతుందంటే చాలు, కోట్లాది మంది గుండె చప్పుడు ఒకటే అవుతుంది… అయితే, మొన్నటి వరకు ఈ ఆరాధన అంతా పురుషుల క్రికెట్ చుట్టూనే తిరిగేది. కానీ, కాలం మారింది!
మొన్నటి ప్రపంచకప్ విజయం తర్వాత మహిళా క్రికెట్‌పై భారతీయుల చూపు ఒక్కసారిగా మారిపోయింది… ఇప్పుడు కేవలం రోహిత్, విరాట్ పేర్లే కాదు.. షెఫాలీ వర్మ మెరుపులు, స్మృతి మంధాన క్లాస్, జెమీమా రోడ్రిగ్స్ పోరాటం, సిమ్రన్ జిత్ కౌర్ తెగువ గురించి గల్లీల్లో కూడా మాట్లాడుకుంటున్నారు…
సరిగ్గా ఇలాంటి తరుణంలోనే, భారత మహిళా క్రికెట్ ఆకాశంలో మరో కొత్త నక్షత్రం మెరిసింది… ఆమే… వైష్ణవి శర్మ…

కఠిన సాధన… నిశ్శబ్ద పోరాటం
మధ్యప్రదేశ్‌లోని చంబల్ ప్రాంతం అంటే ఒకప్పుడు అలజడికి మారుపేరు… కానీ ఇప్పుడు ఆ మట్టి నుంచి ఒక అద్భుతమైన ప్రతిభ పుట్టుకొచ్చింది… 2005 డిసెంబర్ 18న గ్వాలియర్‌లో జన్మించిన వైష్ణవికి, క్రికెట్ చిన్నప్పుడే శ్వాసగా మారింది… లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌ను ఆయుధంగా చేసుకున్న ఆమె, ఎండనక వాననక మైదానాల్లో గంటల తరబడి గడిపేది… స్పిన్ బంతి ఎలా తిరగాలి, బ్యాటర్‌ను ఎలా బోల్తా కొట్టించాలనే దానిపై ఆమె చేసిన సాధన సామాన్యమైనది కాదు…
ప్రపంచకప్ మెరుపులు….. వేలంలో నిరాశ
2025 అండర్-19 వరల్డ్ కప్‌లో వైష్ణవి ఆడిన తీరు అద్భుతం… కేవలం 5 పరుగులకే 5 వికెట్లు తీసి, అందులోనూ ఒక హ్యాట్రిక్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది… ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచినా, దురదృష్టవశాత్తూ మహిళా ప్రిమియర్ లీగ్ (WPL) వేలంలో మాత్రం ఆమె అమ్ముడుపోలేదు… ఒక యువ క్రీడాకారిణికి అంతకంటే పెద్ద నిరాశ ఉండదు… కానీ వైష్ణవిలో ఉన్న క్రీడా స్ఫూర్తి ఆమెను కుంగిపోనివ్వలేదు… “గుర్తింపు రావడానికి సమయం పట్టొచ్చు, కానీ ప్రతిభ ఎప్పుడూ ఓడిపోదు” అని నమ్మి మళ్ళీ నెట్స్‌లోకి వెళ్లి ప్రాక్టీస్ మొదలుపెట్టింది…

వైజాగ్ అరంగేట్రం: ఒక కొత్త ఆశ
ఆ నిరీక్షణకు తెరదించుతూ శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు భారత్ తరపున పిలుపు వచ్చింది… విశాఖపట్నం వేదికగా జరిగిన ఆ డెబ్యూ మ్యాచ్ ఆమె జీవితంలో మర్చిపోలేనిది…
-
ఒత్తిడిని జయించి…: మ్యాచ్ మొదలయ్యే ముందు నేషనల్ ఆంథమ్ పాడుతున్నప్పుడు ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి, గుండె వేగంగా కొట్టుకుంది… కానీ చేతిలోకి బంతి రాగానే చంబల్ పులిలా విజృంభించింది… 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి, 2 కీలక వికెట్లు పడగొట్టింది…
-
కెప్టెన్ ప్రశంస…: “నీవు ఇక్కడ ఉండాల్సిన దానివే” అని కెప్టెన్ అన్న ఒక్క మాట, ఆమె ఏళ్ల నాటి కష్టానికి దక్కిన అసలైన గౌరవం… అవును, ఆమె అసలు ఆట ఇప్పుడే మొదలైంది…
కొన్ని కలలు శబ్దం చేస్తూ వస్తాయి... మరికొన్ని వైష్ణవి వేసే స్పిన్ బంతిలా నిశ్శబ్దంగా వచ్చి, పిచ్‌పై పడ్డాక తమదైన ముద్ర వేస్తాయి...
Share this Article