ఒక వార్త కనిపించింది… ఇప్పటికే ఈటీవీ విన్ అని ఓ ఓటీటీ స్టార్ట్ చేసిన ఈటీవీ యాజమాన్యం త్వరలో మరో ఓటీటీ స్టార్ట్ చేయబోతోందని, 500 కోట్ల బడ్జెట్ పెట్టుకుందని ఆ వార్త సారాంశం… ఇన్నాళ్లూ ఈటీవీ విన్ కంటెంట్ విషయంలో పెద్ద దూకుడు చూపించని ఈటీవీ రెండో ఓటీటీని పలు భాషల్లో ఏకంగా నెట్‌ఫ్లిక్స్ రేంజులో డెవలప్ చేస్తుందని ఆ వార్త చెప్పింది…
అరె, ఆ ఆహా ఓటీటీ వాడే అమ్ముకోలేక, కొనేవాడు లేక, వదిలించుకోలేక, ఏం చేయాలో అర్థం గాక సతమతం అవుతుంటే… ఈటీవీ వచ్చి ఏం చేస్తుంది..? ఆల్రెడీ ఈటీవీ విన్ ఫ్లాప్ కదా, దాన్ని మెరుగుపరిస్తే పోయేదానికి ఈ మల్టీ లాంగ్వేజ్ కొత్త ఓటీటీ అవసరమా అనే ప్రశ్నలు తలెత్తాయి…
నిజమే, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద ప్లేయర్లకు పోటీ ఇవ్వలేక చాలా హిందీ, ఇతర భాషల ఓటీటీలు చతికిలపడ్డాయి… కొంతలోకొంత హాట్ స్టార్, జీ4, సోనీ లివ్ వంటివి కనిపిస్తున్నాయి… పైగా ప్రస్తుతం ఓటీటీలు దూకుడుగా కనిపిస్తున్నా, రెవిన్యూ విషయంలో ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది… యాడ్స్ లాభదాయకంగా లేవు… పైగా 500 కోట్ల బడ్జెట్ ఏమూలకూ చాలదు… మరిక కొత్త ఓటీటీ దేనికి..?
Ads
నిజానికి ఈటీవీ విన్ విషయంలో ఈటీవీ తన చానెళ్ల కంటెంటును పెడుతుంది అందులో… తమ సినిమాలు కూడా… కాకపోతే పాతవి… తన ఒరిజినల్ చానెళ్ల కంటెంటు కూడా నాసిరకమే… ఆ జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల కంటెంటునే ఎవడూ పట్టించుకోవడం లేదు, పూర్ రేటింగ్స్ వస్తున్నాయి… ఎప్పుడో ఒకటీ అరా సినిమాలు కొంటున్నా మరీ చౌక, నాసిరకం సినిమాలు…
అందుకని ఈటీవీ చాన్నాళ్లుగా యూట్యూబులో తన కంటెంటును పెట్టేస్తోంది… ఆ వ్యూస్ ద్వారా మంచి రెవిన్యూయే వస్తోంది… సో, మళ్లీ కొత్తగా ఓటీటీ, మ్యాన్ పవర్, సబ్‌స్క్రిప్షన్, డబ్బు ఎందుకు పెట్టాలని అనుకుంటుంది..? నిజానికి ఆహా ఓటీటీతో పోలిస్తే… నిజంగా ఈటీవీ గనుక ఒరిజినల్ కంటెంటు కోసం శ్రద్ధ చూపిస్తే చాలా చీప్‌గానే తయారవుతుంది… ఆల్రెడీ తమకు స్టూడియో ఉంది, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, మంచి స్క్రిప్టులు, మంచి టీం దొరికితే మంచి వెబ్ సీరీస్, మూవీస్ కట్టలుకట్టలుగా తయారయ్యే వీలుంది…
నిజానికి ఆహా ఓటీటీలో బోలెడు మంది భాగస్వాములు… పైగా ఏ ఒరిజినల్ కంటెంట్ కావాలనుకున్నా ఔట్ సోర్సింగ్ ఇవ్వాల్సి వస్తోంది… ఖర్చు తడిసిమోపెడు… ఈ కోణంలో చూస్తే ఈటీవీ వాళ్లకు చౌకగా కంటెంటు క్రియేట్ చేసుకునే వీలుంది… కానీ దానిపై సరైన కాన్సంట్రేషన్ ఉంటే కదా… ఆ ఈటీవీ వినోద చానెలే మూడో ప్లేసుకు పడిపోయింది, ఆ సీరియళ్లు ఎవరూ చూడరు, ఇప్పుడు రియాలిటీ షోలూ పడిపోయాయి… ఈటీవీ చానెళ్లు, కంటెంట్ క్రియేషన్ మీద క్రియేటివ్‌గా, క్వాలిటేటివ్‌గా ఔట్ ఫుట్ రాబట్టే మ్యాన్ పవర్ లేదు ఈటీవీలో ఇప్పుడు… అందుకే, ఒకవేళ మరో ఓటీటీ పెడితే, ఇదే తరహా నిర్లక్ష్యాన్ని దానిపైనా చూపిస్తే చేతులు కాల్చుకోవడం తప్ప మిగిలేదేమీ ఉండదు..!!
Share this Article