Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది మరో మౌనిక కథ..! తల్లిదండ్రుల ప్రేమ అర్థం కాని దౌర్భాగ్యం..!!

January 25, 2025 by M S R

.

మౌనిక కథను చెప్పి మా అమ్మాయిని మార్చండి సారూ… (శంకర్‌రావు శెంకేసి, 79898 76088)

ఆకర్షణ, మోహంలో జులాయిని ప్రేమించి… తల్లిదండ్రులు వారించినా వినకుండా అతడిని మనువాడి.. చివరకు ప్రాణాలను బలిపెట్టుకున్న చిలువేరు మౌనిక (31) విషాదగాథ ఊహించని స్పందనను మోసుకువచ్చింది. ‘ముచ్చట’లో ప్రచురితమెనౖ ఈ గాథ (https://muchata.com/dont-be-hasty-please-think-hundred-times/) వెబ్‌ ప్రపంచంలో ఎందరి హృదయాలనో కదిలించింది.

Ads

అనేకమంది ఫోన్ల ద్వారా, మెస్సేజ్‌ల ద్వారా తమ వేదనను ఒలికించారు. మెచ్యూరిటీని, రియల్‌ థింకింగ్‌నూ వదిలి భ్రమల్లో, ఊహల్లో జీవించే అమ్మాయిలకు ఇదొక హెచ్చరిక అని అభిప్రాయపడ్డారు.

ఇంటర్‌ చదివిన బలాదూర్‌ను, ఎం.టెక్‌ చదివిన మౌనిక ఎలా పెళ్లి చేసుకుంది..? ఇద్దరు పిల్లలను కన్న తర్వాత వాస్తవాలు బోధపడినా ఎందుకు అతడి నీడ నుంచి బయటపడలేక పోయింది..? ఇది జిహాద్‌ కుట్ర కాదు కదా? ఎందులో ఏదో మత విస్తరణ ప్రణాళిక లేదు కదా.. అని రకరకాలుగా మదనపడిన వారు కొందరైతే, తమ ఊరిలో.. తమ బంధువుల్లో ఇలాంటి ఘటనలూ ఉన్నాయని, ఈ అమ్మాయిలు భ్రమలు ఎప్పుడు వీడుతారు..? అని మరికొందరు బాధపడ్డారు.

మౌనిక విషాదాంత కథనం వాట్సాప్‌ గ్రూపుల ద్వారా వేలాదిమందిని చేరి హృదయాలను విచలితం చేసింది. ఈ స్టోరీని అమ్మాయిలందరూ చదవాలని అనేకమంది కోరుకున్నారు. మౌనిక గాథకు ఇన్‌పుట్స్‌ ఇచ్చిన మధిర జర్నలిస్టు మిత్రుడు మువ్వా మురళి… తనకెదురైన ఊహించని స్పందనతో ఉద్వేగం చెందాడు…

అయితే అన్నింటిలోనూ సిద్దిపేటకు చెందిన లక్ష్మి అనే ఓ మహిళ ఫోన్‌ ద్వారా చెప్పుకున్న గోడు కదిలించింది. ‘సార్‌ నా పేరు విజయ (పేరు మార్చడం జరిగింది) మాది సిద్ధిపేట. మీరు రాసిన వార్త వాట్సాప్‌ గ్రూపులో చదివాను. మాకేమైనా సహాయం చేస్తారోనని మీకు ఫోన్‌ చేశాను.

మేము గోల్డ్‌స్మిత్ వ్యాపారం చేస్తాం. ముగ్గురు ఆడ పిల్లలు. ఎంతో కష్టపడి ముగ్గురినీ పెంచి పెద్ద చేశాం. మాకు పిల్లలే సర్వస్వం. ఇద్దరు పెద్దమ్మాయిలను ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చి పెళ్లి చేశాం. వారు ఆనందంగా జీవిస్తున్నారు. చిన్న కుమార్తెను మహారాష్ట్రలో బీ.ఎస్సీ అగ్రికల్చర్‌ చదివించాం.

ఏడాది క్రితం మా చిన్నమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకడు పరిచయం అయ్యాడు. మా ఊరికి 15 కిలోమీటర్ల దూరంలోని ఊరిలో ఉంటాడు. ఫొటోలనీ, రీల్స్‌ అని తిరుగుతుంటాడట. రూపాయి సంపాదన లేదు. చదువు లేదు. ఆస్తులూ లేవు. వాడు ఏం చేశాడో.. ఎలా ఆకట్టుకున్నాడో తెలియదు.. వాడి వలలో పడిపోయింది.

మాకు తెలిసి అమ్మాయిని మందలించాం. పైచదువులకు పంపకుండా ఇంట్లోనే పెట్టుకున్నాం. వాడు మనకు సరిపోడని, వాడితో జీవితం సుఖంగా ఉండదని, ఆ తర్వాత జీవితాంతం బాధపడతావని, వాడిని మరిచిపొమ్మని మా కుటుంబమంతా బతిమలాడాం.

మారినట్టే కనిపించింది. మేమూ నమ్మాం. పెళ్లి ప్రయత్నాలు మొదలుపట్టాం. రెండు నెలలుగా అనేక సంబంధాలు వచ్చాయి. ఉన్నత చదువులు చదివి, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు.. అమ్మాయి ఫొటోలను చూసి ఓకే అన్నారు. మేము మెల్లగా ఆమెను పెళ్లి చూపులకు ప్రిపేర్‌ చేసే ప్రయత్నాల్లో వున్నాం.

మాతోనూ మంచిగానే ఉంది. కానీ వారం క్రితం మాకు తెలియకుండా వాడితో వెళ్లిపోయింది. హైదరాబాద్‌లో ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుంది. మేము పస్తులుండి పెంచి పెద్ద చేశాం. అల్లారుముద్దుగా చూసుకున్నాం. లక్షలు ఖర్చు చేసి ఉన్నత చదువులు చదివించాం. మంచి సంబంధం చూసి పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డాం.

కానీ ఇప్పుడు ఎవడితోనో వెళ్లిపోయింది. ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తున్నాయి. ఎక్కడ ఉన్నారో తెలియదు.. వారం రోజుల నుంచి నేను నిద్ర పోవడం లేదు సారు. తెలిసిన వారినల్లా నా బిడ్డను రక్షించండని కోరతున్నాను. ఇప్పటికైనా ఇంటికి వస్తే అన్నీ మరిచిపోయి మంచిగా చూసుకుంటాం.

నా బిడ్డ సెల్‌ నెంబరు పంపిస్తాను. మీరు రాసిన మ్యాటర్‌ను ఆమెకు పంపండి. స్వయంగా ఫోన్లో మాట్లాడి మౌనిక ఏమైందో తెలుపండి.. కౌన్సిలింగ్‌ చేసి మనసు మార్చుకోమని చెప్పండి.. మీ సహాయం మర్చిపోను…’

భావోద్వేగంతో, గొంతు పూడుకుపోతుండగా ఆమె ఏకధాటిగా తన వేదన వినిపించింది. యవ్వన మోహంతో, మాయమాటలకు లొంగి వెళ్లిపోయిన బిడ్డ కోసం ఆమె తండ్లాడుతూనే, తిరిగి వస్తే గుండెల్లో పెట్టుకుంటానని చెప్పిన మాటలు చలింపచేశాయి.

తల్లిదండ్రుల హృదయ వేదన ఈ పిల్లలకు అర్థమయ్యేది ఎలా!? ఆధునిక ప్రపంచంలో అన్నీ తెలిసినట్టు మాట్లాడే అమ్మాయిలకు, ప్రేమమైకంలో అసలేమీ తెలుసుకోరని అనుకోవడం తప్పు కాదేమో!


అన్న‌ట్టు మౌనిక కథకు ఫాలోఅప్ ఇదీ.., మౌనికతో పాటు ఆమె ఇద్ద‌రు పిల్ల‌ల మృత‌దేహాల‌ను భ‌ర్త షేక్ బాజీ ఇంటికి తీసుకువ‌చ్చిన త‌ర్వాత అంత్య‌క్రియ‌ల‌కు ఆటంకం ఏర్ప‌డింది. ఎందుకో తెలుసా, దొంగ‌త‌నాల కేసులో రిమాండ్ ఖైదీగా బాజీ జైలులో ఉన్నాడు. బెయిల్ రావ‌డం కుద‌రలేదు. అప్ప‌టికే చ‌నిపోయి రెండు రోజుల‌వుతోంది..

శ‌వాల‌ను అలాగే ఉంచ‌డం స‌రికాద‌నుకొని, గ్రామ‌స్థులే చొర‌వ తీసుకొని భ‌ర్త బాజీ లేకుండానే, అంత్య‌క్రియలూ పూర్తి చేశారు. మౌనిక కాద‌న‌ుకున్న త‌ల్లిదండ్రులు బ‌తికే ఉన్నారు. వారు వ‌చ్చి కూతురు, మ‌న‌వ‌రాళ్ల శ‌వాల‌ను చూసి ఉండ‌లేక వెళ్లిపోయారు.

త‌న వ‌ల్ల భార్యాబిడ్డ‌లు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందిన విష‌యం తెలిసిన బాజీ బ‌య‌ట‌కు రాలేక జైలులో ఉన్నాడు. అంద‌రూ ఉన్నా.. అనాథ‌ల్లా మ‌ట్టిలో క‌లిసిపోయారు మౌనిక, ఆమె పిల్ల‌లు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions