….. దుఖంలో ఉన్న సహదేవుడిని ఓదార్చి, కర్మ ఫలాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని హితోక్తులు చెప్పి కృష్ణుడు, అర్జునుడు, భీముడు తనను పట్టాభిషిక్తుడిని చేస్తారు….. కురుక్షేత్రంలో శకుని సహదేవుడిని హతమారుస్తాడు…. అరెరె, ఇదేమిటి..? సహదేవుడికి పట్టాభిషేకం ఏమిటి..? పైగా స్వయంగా భీమకృష్ణార్జునులు చేయడం ఏమిటి..? కురుక్షేత్రంలో సహదేవుడిని శకుని చంపేయడం ఏమిటి..? అంతా గందరగోళంగా ఉన్నట్టుగా ఉందా..?
మీరు చదివింది నిజమే… కాకపోతే ఈ సహదేవుడు వేరు..? భారతంలో ఇది మరో విశేషమైన పాత్ర… ఒక సహదేవుడు పాండవుల్లో ఒకడు కదా… ఈ సహదేవుడు జరాసంధుడి కొడుకు… అదీ కథ… జరాసంధుడికి ముగ్గురు పిల్లలు… ఆస్తి, ప్రాప్తి అనే ఇద్దరు బిడ్డలు… వాళ్లను కృష్ణుడి మామ కంసుడికి ఇచ్చి పెళ్లిచేశాడు జరాసంధుడు… కొడుకు పేరు సహదేవుడు… జరాసంధుడు అజేయుడు… బలసంపన్నుడు… తన మగధ రాజధాని కూడా గిరివ్రజం… గుట్టలు, అడవుల నడుమ అభేద్యం… అంతటి కృష్ణుడి మధురపైకి పలుమార్లు దాడిచేస్తే ప్రతిసారీ కృష్ణుడు పరాజితుడే… చివరకు తనే సముద్రం ఒడ్డుకు వెళ్లి, ద్వారకను నిర్మించుకున్నాడు…
Ads
మరి కృష్ణుడు రకరకాల మాయోపాయాలకు ప్రసిద్ధుడు కదా, ఆ జరాసంధుడిని ఎందుకు ఓడించలేకపోయాడు…? దీని వెనుక కూడా మరో చిన్న కథ… కీచకుడు, హిడింబాసురుడు, దుర్యోధనుడు, భీముడు, జరాసంధుడు ఒకే జాతక జన్ములు… ఇందులో ఎవరు ఎవరిని సంహరించినా, మిగతా ముగ్గురు కూడా తనతోనే సంహరింపబడతారని వాళ్ల జాతకాలు నిర్దేశించాయి… కృష్ణుడికి ఆ విషయం తెలుసు…
ఆ అయిదుగురికీ తెలుసు… అందుకే జరాసంధుడి నుంచి రక్షణ తప్ప తను వెళ్లి సంహరించేది ఏమీ లేదు… అందుకే జరాసంధుడు ఎప్పుడు దాడికి వచ్చినా దాక్కోవడం లేదంటే పారిపోవడం… ఎప్పుడైతే హిడింబాసురుడిని భీముడు హతమార్చాడో అప్పుడు కృష్ణుడికి జరాసంధుడి మరణం భీముడి వల్ల జరగాల్సిందే అనే స్పష్టత వస్తుంది… హిడింబాసురుడి మరణ సమాచారం దుర్యోధనుడికి తెలియదు గానీ కీచకుడి మరణం తరువాత ఆలోచనలో పడతాడు… భీముడు విరాటరాజ్యంలో తలదాచుకున్నాడని అనుమానిస్తాడు… పొగబెట్టి వాళ్లను అజ్ఞాతం నుంచి బయటికి రప్పించడానికి గోగ్రహణానికి పూనుకుంటాడు…
అర్జునుడు, భీముడు, కృష్ణుడు ముగ్గురే వెళ్లి… జరాసంధుడి అహాన్ని రెచ్చగొట్టి, తమలో ఎవరితోనైనా ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడాలని ఉసిగొల్పుతారు… తను సరైన ప్రతిద్వంద్వి భీముడే కాబట్టి తనతోనే పోరాడతాడు… అక్కడా జరాసంధుడి దేహాన్ని నిలువునా చీల్చి, విరుద్ధ పక్షాలకు విసిరేయడం అనే ఒక మాయోపాయంతో జరాసంధుడి కథకు ముగింపు పలుకుతారు… తన కొడుకు సహదేవుడికి రాజ్యం అప్పగిస్తారు…
ఈ సహదేవుడు కురుక్షేత్రంలో కూడా పాండవుల పక్షాన పోరాడతాడు… ఇదే వైచిత్రి మరి… జరాసంధుడు తన జీవితాంతం కృష్ణుడికి, కృష్ణుడి సన్నిహితులైన పాండవులకు విరోధి… కానీ తన కొడుకు మాత్రం ఆ పాండవుల తరఫున యుద్ధం చేస్తాడు… మరో విశేషం ఏమిటంటే..? తను శకుని చేతుల్లో మరణిస్తాడు… శకుని చేతుల్లో మరణించిన యోధులే తక్కువ… అందులో సహదేవుడు కూడా… ఇదీ భారతంలోని మరో సహదేవుడి కథ…
Share this Article