అయోధ్యకూ తిరుమల-తిరుపతికీ ఏమైనా సంబంధం ఉందా..? ఏమీలేదు… రెండూ వైష్ణవాలయాలే అనే సామ్యం తప్ప రెండింటి చరిత్రలు చాలా భిన్నం… తిరుమల గుడికి ఆధ్యాత్మికత నేపథ్యం మాత్రమే ఉండగా, కాలగతిలో పరధర్మానికి చెందినవారు ఈ గుడిలో పాగా వేసి, అప్పుడప్పుడూ ఇది హిందూ ఆలయమేనా అనే విస్మయాన్ని, విరక్తినీ కలిగిస్తుంటుంది… పైగా కమర్షియల్, కార్పొరేట్ దైవాన్ని చేసేశారు…
అయోధ్య అలా కాదు, దాని వెనుక హిందూ ఆత్మాభిమాన పోరాటం ఉంది… త్యాగాల చరిత్రలున్నాయి… పరధర్మ దాడుల నుంచి తేరుకున్న హిందూ ధర్మానికి అది ఒక ప్రతీక… అదీ తిరుమలకూ అయోధ్యకూ నడుమ తేడా… ఇక రెండింటినీ పోలుస్తూ ఆర్య ధర్మం, ద్రవిడ ధర్మం దాకా వెళ్లిపోయారు… అదంతా ఓ ట్రాష్… తిరుమల బాలాజీ అంటే ఉత్తరాది భక్తులకూ ఇష్ట దేవుడే… అయోధ్య రాముడు హిాందువులందరికీ దేవుడే… ప్రాంతీయ భేదాల సృష్టి అనుచితం…
Ads
యాదాద్రి తిరుమలకు పోటీ కాదు… అయోధ్య అసలే కాదు… దేని ఉనికి దానిదే… దేని విశిష్టత దానిదే… అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని ప్రతి ప్రధాన ఆలయం ఏదో ఒక కంట్రిబ్యూషన్ ప్రకటించింది… అది అయోధ్యను ఓన్ చేసుకోవడం, అయోధ్యకు సాధనసంపత్తి లేక కాదు… పలు దేశాలు, ఆయా దేశాల్లో ఆలయాలు కూడా పాలుపంచుకున్నాయి… యాదాద్రి స్పందించినట్టు లేదు… అఫ్‌కోర్స్, తెలంగాణ దేవాదాయ శాఖ ఏ దిక్కూదివాణం, ఆదర్శం లేకుండా కొట్టుకుపోతోంది… అర్థం చేసుకోవాలి…
మరి తిరుమల..? లక్ష లడ్డూలను పంపించింది… గతంలో నాస్తికుడిగా, పరధర్మ పరాయణుడిగా ట్రోలింగుకు గురైన టీటీడీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యాడు… అంతే… రెండు తెలుగు రాష్ట్రాలూ అయోధ్య విరాళాలు తప్ప మరే విషయంలోనూ అయోధ్య పట్ల పెద్ద సానుకూలంగా స్పందించలేదు… జగన్ సర్కారు గురించి తెలిసిందే కదా… ఇక తెలంగాణలో కేసీయార్ అయోధ్య మీద విషం కక్కిన తీరు కూడా తెలిసిందే…
ఒక్కటి… తరచి వెతుకుతుంటే తిరుపతికీ అయోధ్యకూ నడుమ ఓ చిన్న లంకె కనిపించింది… ఆ లింక్ పేరు మోహిత్ పాండే… ఆశ్చర్యంగా ఉందా..? ఈ ఇరవయ్యేళ్ల యువకుడు మొన్నటి అయోధ్య గర్భగుడిలో జరిగిన ప్రాణప్రతిష్ఠ వీడియోల్లో మోడీతో పాటు కనిపిస్తాడు… ఎవరితను..?
యూపీలోని ఘజియాబాద్‌లో డుద్దేశ్వర్ వేద విద్యాపీఠం ఉంది… అందులో 6 నుంచి 12 దాకా చదువుకున్నాడు… 23 ఏళ్లుగా అర్చకత్వంలో, హిందూ ఆధ్యాత్మిక ప్రక్రియలు, శాస్త్రాలపై శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ.., మోహిత్ పాండే అక్కడి నుంచి టీటీడీ నడిపించే శ్రీవెంకటేశ్వర వేదిక యూనివర్శిటీలో చేరాడు… బీఏ (శాస్త్రి) కోర్స్ అయిపోయాక ఇప్పుడు ఎంఏ (ఆచార్య) కోర్సు చేస్తున్నాడు…
అయోధ్య గుడిలో ఎవరు అర్చకులుగా ఉండాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు… అన్నిరకాల అర్చన శాస్త్రాల్లో నైపుణ్యం ఉన్నవారినే తీసుకుందామని ట్రస్టు నిర్ణయించింది… 29 మందిని తీసుకోవాలని అనుకున్నారు… ప్రపంచంలోని ఏ మూల నుంచి వచ్చినా సరే తీసుకుంటాం అని చెప్పింది… 3000 మంది దరఖాస్తు చేసుకున్నారు… అందరికీ పరీక్షలు నిర్వహించారు… అందులో 29 మందిని ఎంపిక చేసి, ఆరు నెలలు అయోధ్య అర్చనలకు తగిన శిక్షణ మళ్లీ ప్రత్యేకంగా ఇచ్చారు… ప్రత్యేకించి స్పష్టమైన మంత్రోచ్ఛారణలో… సరైన ఉచ్ఛారణ లేకపోతే మంత్రానికి విలువ లేదు…
అదుగో, ఆ అర్చక బృందంలో మోహిత్ పాండే కూడా ఉన్నాడు… అలా ఎంపికైన, నియమితులైన టీం మెంబర్ కాబట్టే ప్రాణప్రతిష్ఠ బృందంలో మోడీతోపాటు గర్భగుడిలో కనిపించాడు… ఇదీ నేపథ్యం… తిరుమలకూ అయోధ్యకు నడుమ ఓ చిన్న లంకె… పైన ఫోటో ఏమిటీ అంటారా..? మన అచ్చమైన ద్రవిడ శిల్పకళానైపుణ్యంతో రూపొందించిన బాలరాముడి విగ్రహం… గణేష్ భట్ అనే కర్నాటక శిల్పి దీన్ని చెక్కాడు… ఇది కూడా బాగుంది… కానీ అంతిమ ఎంపికలో యోగిరాజు చెక్కిన శిల్పాన్ని ప్రాణప్రతిష్ఠకు తీసుకున్నారు, దీన్ని కూడా ఆలయంలోనే ప్రదర్శనకు ఉంచారు… అయోధ్యకూ దక్షిణాదికీ నడుమ మరో లింకు…
Share this Article