.
( రమణ కొంటికర్ల )… తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తోంది షాలినీ. ఆ సమయంలో ఎవడో ఓ వ్యక్తి తన కాస్త అసహ్యంగా బిహేవ్ చేశాడు. తను, తన తల్లి శుభలతా అగ్నిహోత్రి ఓ సీటులో కూర్చుంటే.. ఓ అపరిచిత వ్యక్తి వాళ్ల తల దగ్గరే చేయి పెట్టి డిస్టర్బ్డ్ గా వ్యవహరిస్తున్నాడు.
చేయి అక్కడి నుంచి తీసేయాలని.. ఆ తల్లీ, కూతుళ్లిద్దరూ పలుమార్లు చెప్పినా వినకపోగా.. ఆ నువ్వేమైనా డిప్యూటీ కలెక్టరా నీ మాట వినేందుకంటూ ఆ వ్యక్తి అవమానించిన తీరు షాలినీకి కోపం తెప్పించడంతో పాటు.. డిప్యూటీ కలెక్టరైతేనే రెస్పెక్ట్ లభిస్తుందా అనే బలమైన భావనను షాలినీ మనసులో ముద్రించింది ఆ ఘటన.
Ads
ఆ సమయంలో కాస్త అవమానంగా, ఏం చేయాలో తెలీని నిస్సహాయ పరిస్థితి, తానేం చేయలేకపోయానే బాధ, ఆవేదన నుంచి… ఏదైనా చేయగల్గే ప్రభావిత స్థాయికి ఎదగాలన్న కసి షాలినీలో పెరిగింది . అక్కడ కట్ చేస్తే షాలినీ ఇప్పుడో ఐపీఎస్ ఆఫీసర్…
(ఎవడో ఒకడు దొరకుతాడు జీవితంలో… ఎదగాలనే కసిని ఇగ్నైట్ చేసేవాడు… మంట అంటించేవాడు… వాడిది దురుద్దేశమే… కానీ అది మనకు వరం అవుతుంది… జాజ్వల్యమానం కావడానికి మనం… )
చాలామందికి ఐపీఎస్, ఐఏఎస్, డాక్టర్, ఇంజనీర్, డైరెక్టర్ ఇలా కావాలనే పలు కోరికలు, కలలుండటం సర్వసాధారణం. కానీ, ఒక వేదనాభరితమైన ఘటన నుంచి ప్రభావిత శక్తిగా మారాలనుకోవడం.. అందుకు సివిల్ సర్వీసెస్ ను ఎంచుకుని కష్టపడి దాన్ని సాధించడం మాత్రం విశేషం. షాలినీ అగ్నిహోత్రి అది సాధించింది కాబట్టే మనమిప్పుడు మాట్లాడుకుంటున్నాం.
షాలినీ పుట్టిన ఊరు కూడా పెద్దగా చదువులకు అనుకూలమైన ప్రాంతమేం కాదు. హిమాచల్ ప్రదేశ్ లోని కొండల్లోని ఉనా అనే జిల్లాలో తథాల్ అనే మారుమూల గ్రామంలో పుట్టింది. అయితే, షాలినీ ఆది నుంచీ చదువుల తల్లి కావడంతో తల్లిదండ్రులు ఆమెను ధర్మశాలలో చదివించారు.
పాఠశాల విద్యంతా అక్కడే సాగింది. పదో తరగతిలో 92 శాతం మార్కులు సాధించింది. కానీ, ఇంటర్మీడియట్ లో 77 శాతం మాత్రమే మార్కులు రావడంతో కాస్త డిజప్పాయింట్మెంట్ కు గురైంది. కానీ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అధైర్యపడకుండా పై చదువులకు వెళ్లింది. ధర్మశాలలో డీఏవీ స్కూల్ లో ఇంటర్ విద్య తర్వాత అక్కడే పాలంపూర్ లోని హిమాచల్ ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది.
ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన షాలినీకి సివిల్ సర్వీసెస్ పై చిత్తం పడింది. షాలినీ తండ్రి రమేష్ ఓ బస్సు కండక్టర్ గా పనిచేసేవాడు. అయితే, తమ పిల్లలను మాత్రం రమేష్, శుభలత అగ్నిహోత్రి ఇద్దరూ బాగా చదివించడంతో షాలినీ అక్క డెంటిస్ట్ గా, తమ్ముడు ఆర్మీలో లెఫ్టినెంట్ పోస్టులో పనిచేస్తుండగా.. షాలినీ తాననుకున్న లక్ష్యాన్ని సాధించి ఐపీఎస్ అయింది.
అయితే, షాలినీ ఎటువంటి కోచింగ్ సెంటర్స్ కు వెళ్లకుండానే యూపీపీఎస్సీలో ర్యాంక్ సాధించడమే ఆమె కథలో మరో విశేషం. స్వీయ అధ్యయనం, ఆన్లైన్ కోర్సుల ద్వారానే ప్రిపేరైంది. తెలిసినవాళ్ల దగ్గర ఎలా ప్రిపేరవ్వాలో తెలుసుకుంది. అలా 2011లో ఆల్ ఇండియా 285వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ కు ఎంపికైంది.
2012లోనూ మళ్లీ సివిల్స్ రాసి విజయం సాధించింది షాలినీ. 65వ ఐపీఎస్ బ్యాచులో తన ట్రైనింగ్ లో బెస్ట్ ఆల్ రౌండర్ గా కూడా షాలినీ అప్లాజ్ అందుకుంది. కమ్యూనల్ హార్మోనీ, నేషనల్ ఇంటిగ్రేషన్ వంటివాటిపై ఆమె రాసిన వ్యాసాలతో పాటు.. బెస్ట్ ఆల్ రౌండర్ ప్రతిభ కనబర్చినందుకు ప్రైమ్ మినిస్టర్స్ బాటన్ అంటే నైట్ స్టిక్ లేదా, ట్రంచన్ తో పాటు, హోం మినిస్టర్ రివాల్వర్ ను కూడా సొంతం చేసుకుంది షాలినీ.
మొట్టమొదట షిమ్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన షాలినీ.. ప్రస్తుతం షాలినీ హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తోంది.
షాలినీ విజయం కష్టానికి చిహ్నమే కాదు.. ఒక సామాజిక సంఘటన ఆమెలో నింపిన ఫైర్ కు ఎలా కారణమై, ఆమెను ఏ స్థాయికి చేర్చిందో చెబుతోంది. ఒక నిశ్శబ్ద విప్లవంగా ఎలా ఎదగచ్చో చూపించే విజయం షాలినీ. గట్టి పట్టుదల, బలమైన సంకల్పముంటే.. ఎలాంటి కోచింగ్ సెంటర్స్ సాయం కూడా లేకుండా ఎలా సాధించవచ్చో కూడా షాలినీ కథ మనకో పాఠాన్ని చెబుతోంది….
Share this Article