నమస్తే తెలంగాణలో ఓ వార్త… ఫస్ట్ లీడ్… బొంబాట్… వచ్చే ఐదేళ్లలో 44,051 మంది ఇంటికి… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్లు పునఃప్రారంభం… రిటైర్మెంట్ వయస్సును కేసీయార్ 61 ఏళ్లకు పెంచడం ద్వారా మూడేళ్ల దాకా రిటైర్మెంట్లకు విరామం… వచ్చే మార్చిలో ఏకంగా 8,194 మంది పదవీవిరమణ… 2024 నుంచి ఏటా 8 నుంచి 9 వేల మంది రిటైర్మెంట్… ఇదీ వార్త…
దీన్ని ఒక సాధారణ సమాచార వార్తగా గాకుండా… నమస్తే అలా ఫెయిర్ అండ్ నాన్-పొలిటికల్ స్టోరీలు రాయదు కాబట్టి, దాని రాజకీయ కోణంలోనే చదువుకుంటే…. ‘‘ఇక మొదలైంది రిటైర్మెంట్ల పర్వం… ఏదో మా కేసీయార్ 61 ఏళ్లకు రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచాడు కాబట్టి మూడేళ్లుగా ఏమీ లేవు… ఇక చూడండి, వచ్చే ఐదేళ్లలో, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 44 వేల మంది ఇంటికి పోవడమే… ఏటా 8, 9 వేల మందికి వీడ్కోలే…’’
మా కేసీయార్‌ను కాదని కాంగ్రెస్‌ను సపోర్ట్ చేశారుగా, కుర్చీ నుంచి దింపేశారుగా… ఇక అనుభవించండి ప్రారబ్దం… అన్నట్టు ధ్వనిస్తోంది కదా… హహహ… అయ్యా, మూడేళ్ల రిటైర్మెంట్ వయస్సును పెంచి, నిరుద్యోగుల ఆశలపై జడివాన కురిపించిందే మీరు… అటు నియామకాల్లో లీకులు, కేసులు, కుట్రలు, ద్రోహాలు… మరోవైపు ఖాళీలు ఏర్పడకుండా ఈ వయోపరిమితి పెంపుదల… ఐనా ఉద్యోగుల మీద ప్రేమతో చేశారా ఈ వయోపరిమితి పెంపు..?
Ads
ఒకేసారి ఇంతమందిని రిటైర్ చేసేస్తే వాళ్లందరికీ వందలు, వేల కోట్ల రూపాయల మానిటరీ బెనిఫిట్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది, ఆ భారం తప్పడానికి ఎవరో పనికిమాలిన ఉన్నతాధికారి ఎవరో సూచిస్తే ఇలా వయోపరిమితిని పెంచేశారు… మూడేళ్లు పెంచారు… సో, ఆ మూడేళ్ల గడువు అయిపోయింది… మరి వాళ్లంతా ఇక రిటైర్ కావల్సిందే కదా… పైగా ఏయే రాష్ట్రంలో ఎంత గరిష్ట వయోపరిమితి ఉంది, తెలంగాణ సెకండ్ ప్లేసు అన్నట్టుగా అదో ఘనతగా ఈ స్టోరీ రాసుకొచ్చారు…
నిజానికి ఒక సీనియర్, అంటే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న ఉద్యోగికి ఇచ్చే జీతంతో ముగ్గురు నలుగురు కొత్త, యువ ఉద్యోగుల జీతాలు ఇవ్వవచ్చు… కానీ ఒకేసారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక ఆ జీతభత్యాల్నే భరించడానికి సిద్ధపడటం పెద్ద బ్లండర్… పైగా ప్రభుత్వ యంత్రాంగంలోకి కొత్తరక్తం రాకుండా నిరోధించినట్టవుతుంది… వీళ్లకుతోడు బోలెడుమంది ఉన్నతాధికారులు రిటైరైనా సరే, వాళ్ల సర్వీసును కొనసాగిస్తూ వచ్చింది కేసీయార్ సర్కారు… వాళ్లను రేవంత్ అర్జెంటుగా వదిలించుకోవాలిప్పుడు…
సరే, నమస్తే తెలంగాణ ఉద్దేశంలో రేవంత్ మరేం చేయాలిప్పుడు..? ఈ భారానికి భయపడి రేవంత్ అర్జెంటుగా మరో మూడేళ్లు పెంచాలా..? అదేనా ఈ స్టోరీ పరమార్థం..? ఒకవైపు ప్రపంచమంతా ‘పని లేని ప్రభుత్వ శాఖల’ను మూసేస్తూ, ఖజానాపై జీతభత్యాల భారం తగ్గించుకుంటుంటే… కేవలం ప్రభుత్వ ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పడానికి… ఖజానా భారం తగ్గించుకోవడానికి వయోపరిమితి పెంచేయాలా..? కానీ ఎన్నాళ్లిలా..? ఏ వయోపరిమితి దాకా..? మరి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి రావడం ఎలా..? ఇంకా కొత్త కొలువులు క్రియేట్ చేయాలా..?
ఎస్, బీఆర్ఎస్ పాలన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుట ఎన్నో వైఫల్యాలను ఉంచింది… అవన్నీ చక్కబెట్టడం చాలా పెద్ద టాస్క్… పైగా వాళ్లు ఎన్నికల్లో ఇచ్చిన అలవిమాలిన హామీల అమలు మరో పెద్ద టాస్క్… కేసీయార్ కత్తెర వ్యూహంతో కాంగ్రెస్‌ను చీల్చకుండా కాపాడుకోవడం ఇంకో పెద్ద టాస్క్… కాళేశ్వరం వంటి బ్లండర్స్‌ను చక్కదిద్దడం అత్యంత పెద్ద టాస్క్… తవ్వేకొద్దీ కరెంటు, సివిల్ సప్లయిస్ ఇతర ప్రభుత్వ విభాగాల్లోని అప్పుల తీవ్రత బయటపడుతోంది… లక్షల కోట్ల అప్పులు… ఈ స్థితిలో ఉద్యోగుల పదవీవిరమణ భారం కూడా సర్దుబాటు చేయడం మరో పెద్ద టాస్కే… దీన్నెలా అధిగమిస్తారో చూడాల్సిందే..!!
Share this Article