.
Priyadarshini Krishna ….. కుంభమేళా బ్యూటీ మొనాలీసా జీవితంలో సినిమా కథకి మించిన మలుపులు …
నిజం చెప్పాలంటే TV సీరియల్‌లో వారం వారం ఒక ట్విస్ట్‌లాగా ఆమె జీవితంలో కూడా ఒకదాని తర్వాత ఒక ట్విస్ట్… శుభమా అని ఏదో జీవితం మారిపోయే తరుణంలో, రెండుమూడు సినిమాలు చేతికొచ్చిన టైంలో రాంగ్ స్టెప్ వేసింది.
పెళ్లి తన జీవితానికి అవసరం, కానీ ఆ టైంలో ఆ వ్యక్తితో అవసరమా కాదా అనే జ్ఞానం, విచక్షణ, లోకం పోకడ ఎలాగు ఆమెకు లేవు, అలాగని ఎవరి గైడెన్స్ అయినా తీసుకుని నడుచుకున్నాదా అంటే అది కూడా లేదు …
Ads
సినిమా ఇండస్ట్రీ చరిత్ర చూస్తే ఇంతకు మునుపు ఎందరో అనామకులను కూడా అక్కున చేర్చుకుని తారాపథకానికి తీసుకెళ్లింది. అత్యంత బీదవారు, చదువు సంధ్యలు లేనివారు సైతం తమకి దొరికిన అదృష్టాన్ని పట్టుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కి, పేదరికం నుండి తమని తమ కుటుంబాన్ని రక్షించి, సమాజంలో గౌరవాన్ని తీసుకొచ్చిన చరిత్రలు కూడా ప్రేక్షకులుగా మనం చూసాము ….
మోనాలిసా మాత్రం అందుకు భిన్నం … తెలుగులో కూడా రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. ఒక సినిమా 40% షూట్ కూడా అయిపోయింది. ఆ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆ అమ్మాయికి ఉన్న క్రేజ్‌ని సొమ్ము చేసుకుందాం అని స్వార్ధంగా ఆలోచించినా కూడా… ఒక అనామకురాలికి బంగారంలాంటి అవకాశం మాత్రం దొరికింది .
తనపైన కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. తనపైన ఎందరో ప్రేక్షకులు అభిమానం చూపిస్తున్నారు కాబట్టి… నేను వీళ్ళందరికీ జవాబుదారీగా ఉండాలి., చేతిలోని పని ముగించుకోవాలి అని ఆమె ఏకోశానా అనుకోలేదు.
కుటుంబంలోనివాళ్ళు తమ ఊరిలోని ఎవరో అనామకునికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు అని భయపడింది. అదే సమయంలో ఆసరాగా నాలుగు మాయ మాటలు చెప్పిన యువకుడిపైన మనసుపడింది.
ఆతగాడి ఇంటెన్షన్ అర్థం చేసుకునేంత తెలివి, జ్ఞానం ఎలాగూ లేవు. అసలు ఆమె వయసెంతని?
అతను చెప్పినట్లు నడిచింది. ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి పెళ్లి అనే పబ్బం గడుపుకుందాం అని ఆ సదరు ప్రియుడు చూసాడు. అది నేరం అని కూడా ఆమెకి తెలియలేదు . చివరికి POCSO కేసులో అతడిని బుక్ చేశారు. ఇప్పుడు ఆమె ఏకాకి అయింది…..
వదిలేసిన సినిమాలు ఏమయ్యాయో, వాళ్ళెందుకు ఆమెని తిరిగి తమ సినిమాల్లోకి తీసుకోలేదో అర్థం అవ్వడం లేదు. తాజాగా ఎవడో ఒక పోకిరి గాడు, నేనే ఆ సదరు మోనాలిసా మొగుడుని అంటూ, అసలు మోనాలిసా అచూకీ తెలియడం లేదు అంటూ, ఆమె మీకు ఎక్కడైనా కనపడితే సమాచారం ఇవ్వండి అంటూ ఒక వీడియో వదిలాడు.

జైల్‌లో ఉన్నవాడు కార్‌లో తిరుగుతూ వీడియో ఎలా పెట్టాడు అని ఒక్కరూ ఆలోచించకుండా ఆ వీడియోని కూడా షేర్ల మీద షేర్లు చేసి వైరల్ చేశారు. అతగాడు కూడా ఫేక్ గాడే అనీ, వాడు ఆ అమ్మాయి పేరు చెప్పుకుని ఫేమస్ అయిపోదామనే ప్లాన్ చేశాడని మీడియా వాళ్లు తేల్చారు…
ఓ అందమైన అమ్మాయి పేరుపైన ఎందరు బతికేద్దాం అని చూస్తున్నారో కదా … ఇప్పుడు మోనాలిసాకి కావలసింది ఒక కుటుంబం, ఒక ఓదార్పు, పేదరికం నుండి బయటపడేసే వృత్తి. అది దొరుకుతుందా, ఇంతకీ ఎక్కడుంది ఆమె?
Share this Article