పార్ధసారధి పోట్లూరి ……. అయిపాయే ! సుజుకి మరియు టొయోటలు పాకిస్థాన్ నుండి వెళ్లిపోతున్నాయి ! జపాన్ కి చెందిన ఆటోమొబైల్ దిగ్గజాలు సుజుకి మరియు టొయోటా లు పాకిస్థాన్ లో తమ కార్యకలాపాలని ఆపేస్తున్నాయి ! పాకిస్థాన్ లో సుజుకి మోటార్స్ సంస్థ ఈ రోజు నుండి తమ అసెంబ్లింగ్ ప్లాంట్ ని మూసివేస్తున్నది.
**********************************************
పాక్ సుజుకి మోటార్స్ కంపెనీ లిమిటెడ్ [Pak Suzuki Motor Company Limited (PSMCL)] పేరుతో 1983 లో జపాన్ కి చెందిన సుజుకి మోటార్స్ పాకిస్థాన్ ఆటోమొబైల్ కార్పొరేషన్ తో జాయింట్ వెంచర్ భాగస్వామ్యంతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ చేసుకొని, తన అసెంబ్లింగ్ యూనిట్ స్థాపించింది. 1984 నుండి అక్కడ కమర్షియల్ గా అసెంబ్లింగ్ ప్రారంభించింది.
Ads
ఇదే సుజుకి మన దేశంలో మారుతి సుజుకి పేరుతో 1981 లో భారత ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందంతో తమ కార్యకలాపాలు ప్రారంభించింది.
సుజుకి మన దేశంలో ఎలాంటి మోడల్ రిలీజ్ చేసినా అదే మోడల్ ని పాకిస్థాన్ లో కూడా విడుదల చేసేది. మన దేశంలో మారుతి వ్యాన్ అనే పేరుతో చెలామణి అయిన వ్యాన్ పాకిస్థాన్ లో సుజుకి వ్యాన్ పేరుతో లాంచ్ అయ్యింది. కానీ పాకిస్థాన్ లో కేవలం అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతూ వచ్చింది తప్పితే అక్కడ ఉత్పత్తి చేయలేదు. మన దేశంలో మాత్రం మొదట్లో జపాన్ నుండి స్పేర్ పార్ట్శ్ దిగుమతి చేసుకొని అసెంబ్లింగ్ చేసేది కానీ తరువాతి కాలంలో పూర్తి స్థాయిలో మన దేశంలోనే తయారు చేయడం మొదలుపెట్టింది. మొదట్లో అన్ని కార్ల డిజైన్ లు జపాన్ చేసి దానిని వరుసగా పాకిస్థాన్ మరియు భారత్ లలో అసెంబ్లింగ్ మరియు తయారు చేస్తున్నది. గత 10 ఏళ్లుగా సుజుకి తమ ఆటో మొబైల్ డిజైనింగ్ ని భారత్ లోనే చేస్తున్నది.
**********************************************************
సుజుకి ఎందుకు తమ అసెంబ్లింగ్ ఆపేస్తున్నది ?
డాలర్ల కొరత ప్రధాన కారణం. ప్రస్తుతం పాకిస్థాన్ దగ్గర ఒక నెల వరకు అత్యవసర వస్తువులు దిగుమతి చేసుకొని వాటికి డాలర్ల రూపంలో చెల్లింపులు చేయడానికి మాత్రమే రిజర్వ్ ఉన్నది. అయితే గత మూడేళ్ళ నుండి ఇలానే ఉన్నా ఎక్కడో అక్కడ అప్పు పుట్టగానే మళ్ళీ యధా పూర్వ స్థితిలోకి వస్తూ ఉంది కానీ గత 6 నెలలుగా పరిస్థితి మరింత దిగజారి దిగుమతుల మీద ఆంక్షలు విధించింది పాకిస్థాన్ సెంట్రల్ బాంక్.
1. ఈ రోజు ఒక డాలర్ విలువ పాకిస్తాన్ రూపాయలలో 227 గా ఉంది.
2. పాకిస్థాన్ లోని సుజుకి మోటార్స్ కి విడి భాగాల కొరత ఉంది. జపాన్లో ని తమ మాతృ సంస్థ నుండి విడిభాగాలు దిగుమతి చేసుకోవాలంటే దానికి పాకిస్థాన్ సెంట్రల్ బాంక్ నుండి అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే దిగుమతి చేసుకున్న విడిభాగాలకి డాలర్ రూపంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది కానీ అక్కడ అన్ని డాలర్లు లేవు కాబట్టి సుజుకి విడి భాగాల దిగుమతి కోసం అనుమతి కోరితే, గత మూడు నెలల నుండి అనుమతి రాలేదు.
3. మూడేళ్ళ నుండి దిగుమతుల కోసం అనుమతులు రావడంలో జాప్యం జరుగుతూనే వస్తున్నా… గత ఆరు నెలలనుండి ఒక్కసారి మాత్రమే అనుమతి లభించింది. దాంతో ఉద్యోగులకి కూర్చోబెట్టి జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి సుజుకి మోటార్స్ కి.
4. సుజుకి కి విడిభాగాల కొరతతో పాటు విద్యుత్ మరియు గ్యాస్ కొరత కూడా మరో కారణం!
5. ప్రస్తుత పరిస్థితులలో విడిభాగాలు, విద్యుత్ మరియు గ్యాస్ లభ్యమయినా కారు అసెబ్లింగ్ అయి షో రూమ్ కి వెళ్ళినా రెండేళ్ల క్రితం ధరకంటే మూడు రెట్లు ధర ఎక్కువగా చెల్లించి కొనాలి, కానీ మూడు రెట్ల ధర చెల్లించి కొనడానికి ఎవరూ సిద్ధంగా లేరు పాకిస్థాన్ లో. దాంతో గత డిసెంబర్ లో నే సుజుకి తన అసెంబ్లింగ్ యూనిట్ శాశ్వతంగా మూసి వేయాలనే నిర్ణయం తీసుకుంది. అది ఈ రోజు నుండి అమలులోకి వస్తున్నది.
6. టొయోట పాకిస్థాన్ లో ‘ఇండస్ మోటార్స్ ‘ పేరుతో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నది కానీ గత డిసెంబర్ నెలలోనే టొయోటా తన కార్యకలాపాలని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఆల్రెడీ నిలిపివేసి రెండు వారాలు అవుతున్నది. సుజుకికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో టొయోటాకి కూడా అవే ఇబ్బందులు ఉన్నాయి పైగా సుజుకి కంటే టొయోట కార్లు ఖరీదు ఎక్కువ సహజంగానే.
7. పాకిస్థాన్ వార్తా GEO న్యూస్ సంస్థ కధనం ప్రకారం… పాకిస్థాన్ లో ట్రాక్టర్స్ ని అసెంబ్లింగ్ చేసే ‘మిల్లెట్ ట్రాక్టర్స్‘ కూడా తన కార్యకలాపాలని గత శుక్రవారం నుండి ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ట్రాక్టర్ లు అమ్ముడుబోవడం లేదు ఎందుకంటే పాకిస్థాన్ రూపాయి డాలర్ తో పోలిస్తే చాలా బలహీనంగా ఉండడంతో ట్రాక్టర్ ధరలు తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి ఉండడంతో వాటి అమ్మకాలు పడిపోయాయి అని.
8. పాకిస్థాన్ ఆటోమొబైల్ పరిశ్రమ చాలా వరకు విడిభాగాలు దిగుమతి చేసుకొని, అసెంబ్లింగ్ చేసి అమ్మడం మీదనే ఆధార పడుతూ రావడం ఈ సమస్యకి మూల కారణంగా నిపుణులు చెప్తున్నారు.
*************************************************************
రెండు నెలల క్రితం భారీ వరదల కారణంగా అక్కడ బాస్మతి బియ్యం మరియు గోధుమలు పండించే పొలాలు పూర్తిగా బురదతో పూడుకు పోయాయి. దాంతో బియ్యం మరియు గోధుమల పంట చేతికి రాకుండానే నాశనం అయ్యాయి. పంట పొలాలలో బురదని తీసివేయడానికి గాను ప్రపంచ బాంక్ తిరిగి చెల్లించనవసరం లేకుండా గ్రాంట్ రూపంలో డాలర్లు ఇచ్చింది కానీ పాక్ ప్రభుత్వం పొలాలలోని బురదని వెలికి తీయడానికి ఖర్చుపెట్టకుండా వాటిని వేరే వాటికి మళ్లించి ఖర్చుపెట్టింది.
వచ్చే రెండు నెలలు పాకిస్థాన్ కి చాలా కీలకం. మరో సంవత్సరం వరకు తమ దేశంలో గోధుమ, బాస్మతిలకి తీవ్ర కొరత ఉంటుంది. వాటిని దిగుమతి చేసుకోవాలంటే డాలర్లు ఉండాలి, కాని అవి లేవు. మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరత ఉండడం వలన పారిశ్రామిక ప్రగతి 50% పైగా పడిపోయింది. గత సంవత్సరం శ్రీలంకలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో దాని రెండు రెట్ల అశాంతి ఉండబోతున్నది పాకిస్థాన్ లో.
గత నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశం సందర్భంగా పాకిస్థాన్ విలేఖరి మన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఒక ప్రశ్న వేశాడు. భారత్, పాకిస్థాన్ లలో ఉగ్రవాదం ఎప్పుడు అంతం అవుతుంది అని భావిస్తున్నారు ?. దానికి జవాబు ఇస్తూ మీరు రాంగ్ వ్యక్తిని ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్నని ఆడగాల్సింది పాకిస్థాన్ ని, ఎందుకంటే ప్రపంచానికి ఉగ్రవాదాన్ని సప్లై చేస్తున్నది మరియు ఉగ్రవాదానికి కేంద్ర బిందువు పాకిస్థాన్ లో ఉన్నది కనుక…
జై శంకర్ మరో ఆణిముత్యం లాంటి వ్యాఖ్య చేశారు: మన దొడ్లో పాములు పెంచుతూ అవి పక్క ఇంటి వాళ్ళనే కాటేస్తాయి అని అనుకోవడం పిచ్చితనం ! నెలరోజుల క్రితం జై శంకర్ చెప్పినట్లే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాక్ ల మధ్య జరుగుతున్నది. TTP [తెహ్రిక్ తాలిబాన్ పాకిస్థాన్ ] పాక్ ప్రభుత్వాన్ని సవాల్ చేసింది యుద్ధం చేసుకుందామా అంటూ. అమెరికన్ CIA వ్యూహం ఏమిటో ఇప్పుడిప్పుడే తెలిసివస్తున్నది ప్రపంచానికి.
అమెరికన్ సైన్యం ఎందుకంత విలువయిన ఆయుధాలని ఆఫ్ఘనిస్తాన్ లో వదిలేసి వెళ్లిపోయిందో ఇప్పుడు తెలిసిపోయింది. వాటిని నేరుగా పాకిస్థాన్ మీద ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది తాలిబాన్ ప్రభుత్వం మరియు TTPలు. ఇది బాగా బలహీన పడ్డ పాకిస్థాన్ ఆర్ధిక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలని చూసి, ఇదే అదనుగా తాలిబన్లు ప్రతీకారం తీర్చుకోవడానికి సవాల్ చేస్తున్నారు పాక్ సైన్యాన్ని.
వచ్చే రెండు రోజుల్లో హెలికాప్టర్లు మరియు జెట్ ఫైటర్స్ తో ఆఫ్ఘనిస్తాన్ లోకి చొరబడి TTP స్థావరాల మీద దాడులు చేయడానికి పాకిస్థాన్ సైన్యం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఒక్క హెలీకాప్టర్ లేదా జెట్ ఫైటర్ ఆఫ్ఘన్ భూ భాగంలోకి ప్రవేశించినా దానిని నేరుగా ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం చేస్తున్నట్లుగా భావిస్తామని TTP ప్రకటించింది. తాలిబాన్ ప్రభుత్వం మౌనంగా ఉంది అంటే దీనర్ధం మౌనం అర్ధాంగీకారం అని కాదు, పూర్తిగా అంగీకరిస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది.
అసలయిన CIA గేమ్ ప్లాన్ !
తాలిబన్ల కి కానీ TTP కి కానీ బ్లాక్ మార్కెట్ లో ఆయుధాలు కొనడానికి డాలర్లు ఎక్కడి నుండి వస్తున్నాయి ? గత సంవత్సరం నుండి మేలు రకం గంజాయిని ప్రాసెస్ చేసి దానిని హెరాయిన్ గా మార్చి డ్రగ్ మాఫియాకి సప్లై చేసి వాటికి వదులుగా అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటూ వచ్చింది తాలిబన్! 1987 నుండి ముజాహిదీన్ లు కావొచ్చు, తరువాతి కాలంలో తాలిబాన్ లు కావొచ్చు వాళ్ళు పండించిన గంజాయిని అంతర్జాతీయ మార్కెట్ లో ఎలా అమ్మాలో దారి చూపిస్తూ వచ్చింది CIA మాత్రమే ! ఇప్పటికీ CIA అదే పని చేస్తున్నది.
ఆఫ్ఘనిస్తాన్ కంటే మంచి ఆయుధాలు పాకిస్థాన్ దగ్గర ఉన్నాయి కానీ హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు ఎన్ని రోజులు వాడగలదు పాకిస్థాన్ ? అదే ఆఫ్ఘనిస్తాన్ తనకి కావాల్సిన పెట్రోల్ మరియ డీజిల్ ని తానే ఉత్పత్తి చేసుకుంటున్నది. పైగా నాటో సైన్యం 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాలో పెట్రోల్ మరియు డీజిల్ ని నిల్వ చేసుకునే అత్యాధునిక డిపోలని నిర్మించాయి తమ అవసరాల కోసం వాటినే ఇప్పుడు తాలిబన్లు వాడుకుంటున్నారు. ఆయిల్ కోసం ఆఫ్ఘనిస్థాన్ ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదు, పాకిస్థాన్ మాత్రం దిగుమతి చేసుకోవాలి, కానీ చేతిలో డాలర్లు లేవు. అన్నీ గమనించే తాలిబన్లు, TTP లు ఇప్పుడు బహిరంగంగానే పాకిస్థాన్ ని సవాల్ చేస్తున్నాయి! పాలు పోసిన వాడి చేతిని కాటేస్తాయి పాములు !
Share this Article