ప్రేమ అంటే..? ఈ పదాన్ని సరిగ్గా, సమగ్రంగా నిర్వచించినవాడు ఈ ప్రపంచంలో పుట్టలేదు… పుట్టబోడు..! ఇప్పుడు అకస్మాత్తుగా ఇండియన్ మీడియాలో ఒక లవ్ స్టోరీ వైరల్ అవుతోంది… దానికీ ఓ నేపథ్యం ఉంది… షేర్ షా అని ఓ హిందీ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది… సిద్ధార్థ మల్హోత్రా హీరో, కియరా అద్వానీ హీరోయిన్… 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓ ఆర్మీ కెప్టెన్ బయోపిక్ ఇది… ఆ కథానాయకుడి పేరు విక్రమ్ బాత్రా… ఈ దేశ సర్వోన్నత గౌరవ పురస్కారం పరమవీరచక్ర పొందిన సైనికుడు…
సినిమా గురించి కాసేపు వదిలేద్దాం, గతంలో ఎల్వోసీ-కార్గిల్ పేరిట ఓ సినిమా వచ్చింది, అందులో అభిషేక్ బచ్చన్ కూడా ఇదే ఆర్మీ కెప్టెన్ పాత్రలో నటించాడు… మరీ ఈ షేర్షా సినిమా ఏమాత్రం ఇంప్రెసివ్‌గా లేదు… అసలు సిద్ధార్థ మల్హోత్రా ఆ పాత్రకు అస్సలు సూట్ కాలేదు… పైగా ఒక యుద్ధవీరుడి కథలో ఉండాల్సినంత ఎమోషన్ కూడా సినిమాలో అస్సలు కనిపించలేదు… అందుకే దాన్నలా వదిలేసి, మనం ఆ విక్రమ్ బాత్రా రియల్ లవ్ స్టోరీ, ఈ తరం నమ్మలేని లవ్ స్టోరీ గురించి చెప్పుకుందాం…
Ads
విక్రమ్… హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టిన ఓ పంజాబీ హిందూ… చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్శిటీలో ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌లో జాయినయ్యాడు… పంజాబీ డింపుల్ చీమా కూడా అదే సంవత్సరం, అదే కోర్సులో జాయినైంది… మెల్లిగా పరిచయం… దగ్గరలోని ఓ కేఫ్‌లో తరచూ కలిసేవాళ్లు… అన్ని లవ్ స్టోరీల్లాగే వీళ్ల ప్రేమ కూడా బలపడుతూ వచ్చింది… సమీపంలోనే ఉన్న మానసాదేవి గుడికి, శ్రీనద సాహెబ్ గురుద్వారాకు వెళ్లేవాళ్లు… ఆమె ఇంట్లో ఆమె పెళ్లి కోసం… అతని ఇంట్లో అతని పెళ్లి కోసం ప్రెజర్ పెరుగుతోంది… ఏవేవో సాకులు చెప్పి వీళ్లిద్దరూ వాయిదాలు వేస్తున్నారు…
ఎప్పుడో ఓసారి అందరికీ చెప్పేసి, పెళ్లి చేసుకోవాలి… కానీ ఎప్పుడు..? ఓరోజు గురుద్వారా పరిక్రమ చేస్తున్నారు… నాలుగు పూర్తయ్యాయి… వెంటనే ఆమెను ఆపి, దుపట్టా అంచు పట్టుకుని, ఏయ్, మిసెస్ బాత్రా, మన పెళ్లయిపోయిందోయ్ అన్నాడు నవ్వుతూ… అప్పుడామె పెళ్లయినట్టేనని ఫిక్స్ అయిపోయింది… మరోసారి ‘మన పెళ్లి మాటేమిటి విక్రమ్, జరుగుతుందంటావా..?’ అనడిగింది… వెంటనే తన వ్యాలెట్‌లో ఉన్న చిన్న బ్లేడ్ తీసి, బొటనవేలు కోసుకుని, ఆ రక్తాన్ని ఆమె పాపిట్లో రాశాడు… హత్తుకున్నాడు… విక్రమ్‌తో పెళ్లయినట్టేననే ఆమె భావన మరింత బలపడింది… ఇక కాలం చెరపలేనంతగా…!
విక్రమ్‌కు సైన్యంలో జాయిన్ కావాలని కోరిక… అందుకే ఇండియన్ మిలిటరీ అకాడమీకి అప్లయ్ చేశాడు… దానికి సెలెక్ట్ కాగానే ఎగిరి గంతేశాడు… ఆమె తన నిర్ణయాన్ని ఆమోదించింది… ఇద్దరిలో ఎవరూ వాళ్లు జాయినైన ఎంఏ ఇంగ్లిష్ కోర్సు పూర్తి చేయలేదు, విక్రమ్ డెహ్రాడూన్‌లో శిక్షణకు వెళ్లిపోయాడు… అదయ్యాక మర్చెంట్ నేవీలో జాబ్ వచ్చింది కానీ పోలేదు… ఇండియన్ ఆర్మీలో చేయాలని కదా తన లక్ష్యం… అనుకున్నట్టుగానే చేరాడు…
జమ్ముకాశ్మీర్‌లో కొంతకాలం డ్యూటీ… ఉగ్రవాదులతో ఎన్కౌంటర్లు, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సందర్భాలు బోలెడు… మధ్యమధ్యలో చండీగఢ్ వెళ్లి, డింపుల్‌ను కలిసేవాడు… నాలుగేళ్ల ప్రణయం పాకాన బడింది… ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పాడు, నాకోసం సంబంధాలు వెతకొద్దు అని… వాళ్లకు అర్థమైంది… అమ్మాయిని చూపించురా ఓసారి అనడిగారు… నేరుగా పెళ్లిలోనే చూద్దురు గానీ అన్నాడు… ఈలోపు కార్గిల్ యుద్ధం వచ్చిపడింది… ఈ యుద్ధం అయ్యాక ఇక పెళ్లి చేసుకోవడమే… కానీ మనం అనుకున్నట్టుగా జరిగితే ఇక విధి దేనికి..? ఉరిమింది…
రెండు కీలక పోస్టులను పునఃస్వాధీనం చేసుకునే క్రూషియల్ ఘట్టంలో… తన ట్రూప్ సభ్యుల ప్రాణాలు కాపాడే క్రమంలో… విక్రమ్ బాత్రా ప్రాణాలు కోల్పోయాడు… తను యుద్ధానికి వెళ్లే ముందు ఆందోళనగా ఉన్న డింపుల్‌ను ఊరడిస్తూ విక్రమ్ ఓ మాటన్నాడు… ‘‘ఎందుకు డియర్ ఆందోళన..? తప్పకుండా తిరిగి వస్తాను కదా… మన మూడు రంగుల పతాకాన్ని ఎగరేస్తూ వస్తాను గర్వంగా… లేదంటే ఆ రంగుల పతాకంతో చుట్టబడి తిరిగొస్తాను మరింత గర్వంగా..! సినిమాటిక్ అనిపిస్తోంది కదా… తన కథ అంతే…
విగతజీవుడై తిరిగొచ్చాడు… ఆమె గుండె పగిలింది… శవం దగ్గర కుప్పకూలింది… అప్పుడే తొలిసారిగా డింపుల్‌ను చూశారు విక్రమ్ తల్లిదండ్రులు ఆమెను… ఆమె అంతకుముందే తన ఇంట్లో చెప్పింది కదా… ‘‘జీవితంలో పెళ్లి చేసుకుంటే విక్రమ్‌నే… లేకపోతే ఇక పెళ్లే చేసుకోను’’ అని… అంతే… అదే మాట మీద నిలబడింది… ఇప్పటికి 22 ఏళ్లు… విక్రమ్ విడోగానే… చండీగఢ్‌లో ఒంటరిగా బతుకుతోంది… జస్ట్, విక్రమ్ జ్ఙాపకాలే తోడుగా… పిల్లలకు పాఠాలు చెబుతూ…! అదేమిటమ్మా, తనతో నీకు పెళ్లి కాలేదు కదా అనెవరైనా అడిగితే అంటోంది ఇలా…
‘‘అయిపోయింది, అయిపోయినట్టే… ఇప్పటికీ ఏరోజైనా నన్ను తన స్మృతులు వదిలితే కదా… రేపోమాపో వస్తాడు అనిపిస్తూనే ఉంటుంది ఈరోజుకూ… మరో పెళ్లి ఎలా చేసుకోను..? ఇప్పటికీ నా దుపట్టా అంచు పట్టుకుని, ఓ నీడగా నా చుట్టే విక్రమ్ తిరుగుతూ ఉంటే… ఎటు వెళ్లను..? ఏం చేయను..? ఇంకెవరో ఎరుపు చేయడానికి నా పాపిట ఖాళీగా ఉంటే కదా..?!
Share this Article