కార్గిల్ యుద్ధం… 25 ఏళ్ల క్రితం… అప్పట్లో ఫైట్ లెఫ్టినెంట్ కె.నచికేతరావు… ఆరోజు ఉదయం శ్రీనగర్ నుంచి మరో ముగ్గురితోపాటు ఫైటర్ విమానాల్లో ఓ టీమ్‌గా బయల్దేరారు… వాళ్ల టార్గెట్ ముంతు ధాలో ఏరియా… అక్కడ పాకిస్థాన్ భారీ లాజిస్టిక్ హబ్… నచికేతరావు, తన బాస్ రాకెట్లు కాలుస్తున్నారు… తను మిగ్27 లో ఉన్నాడు… హఠాత్తుగా ఇంజిన్ ఫెయిల్…
ఎదురుగా కొండలు… అటువైపు తన విమానం దూసుకుపోతోంది… 15 వేల అడుగుల ఎత్తులో తను చేయడానికేమీ లేదు… దాన్నలా వదిలేసి తను బయటపడటమే… ఎజెక్ట్ అయిపోయాడు… అది కొండల్ని ఢీకొని మండుతున్న దృశ్యమూ చూశాడు… తను పడిన చోట మొత్తం మంచు… తన దగ్గర ఉన్నది ఓ చిన్న పిస్టల్, 16 రౌండ్లు… వణికించే చలి… తను ఎక్కడ పడ్డాడో తనకే తెలియదు… ఈలోపు తనవైపు కాల్పుల శబ్దం వినిపించింది… తను శత్రువుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో చిక్కుపడ్డట్టు అర్థమైంది… బండరాళ్ల వెనక్కి పరుగెత్తి దాక్కునే ప్రయత్నం చేస్తూ ఆరు రౌండ్లు కాల్చాడు, కానీ అది పిస్టల్… అత్యాధునిక ఆయుధాలతో ఆరుగురు పాకిస్థానీ సైనికులు… తను దొరికిపోయాడు…
ఈలోపు ఒకడు విసురుగా వచ్చాడు… ఏకే-47 బ్యారెల్ నచికేత నోట్లో గుచ్చాడు… ఇక తన ఖతం అనుకున్నాడు… కళ్లు మూసుకోలేదు… ట్రిగ్గర్ నొక్కుతాడేమోనని చూస్తున్నాడు… వెన్నులో జరజరాపాకిన చలి, భయం… ఈలోపు వాళ్ల కెప్టెన్ వారించాడు… ‘మనలాగే తను కూడా ఓ సైనికుడు, తన డ్యూటీ తాను చేశాడు, వదిలెయ్’ అని తన టీమ్‌ను కన్విన్స్ చేశాడు… తనవైపు నమ్మలేనట్టు చూస్తున్నాడు నచికేత… తనను బందీగా పట్టుకుని క్యాంప్ సైట్‌కు తీసుకెళ్లారు… ఆ పాకిస్థానీ కెప్టెన్ తనకు ప్రాథమిక చికిత్స కూడా చేశాడు…
Ads
(అలాంటి కెప్టెన్ తరువాత మన సైన్యం మన కీలక స్థానాల్ని తిరిగి స్వాధీనం చేసుకునే యుద్ధంలో, మన సైనికుల చేతుల్లో మరణించాడు, ఆర్మీ ఇంటలిజెన్స్‌కు దొరికిన తన డైరీల వల్ల నచికేతకు ఈ విషయం చాన్నాళ్లు తరువాత తెలిసింది… మనసులోనే తనకు చెమ్మ నిండిన కళ్లతో సైనిక వందనం సమర్పించాడు… సైనికుడి జీవితం అంతే…)
తరువాత నచికేతను ఛాపర్‌లో స్కర్దుకు తీసుకుపోయారు… అక్కడి నుంచి మరో విమానంలో ఇస్లామాబాద్ తీసుకెళ్లారు… తరువాత రావల్పిండికి… నేను వాళ్లకు ఏమీ చెప్పడం లేదు, ఇక చెప్పించే బాధ్యతను, నన్ను ఐఎస్ఐ స్పెషలిస్ట్ సెల్‌కు అప్పగించారు… సెల్‌లో ఒంటరిగా ఉంచడం, తరువాత సిస్టమాటిక్‌గా కొడుతూ తను మానసికంగా బ్రేకయ్యేలా చూడటం… ఆహారం ఇవ్వరు, నీళ్లు ఇవ్వరు, నిద్ర పోనివ్వరు… విధి లేక నోరు విప్పే దశకు తీసుకెళ్లాలనే ప్రయత్నం…
నచికేత అదృష్టం బాగుండి, యుద్ధం ముగిసింది… యుద్ధ ఖైదీల మార్పిడికి నిర్ణయం… వేరే ఇంటికి తనను తరలించారు… కొత్త బట్టలు ఇచ్చారు… ఆహారం పెట్టారు… ఏదో జరుగుతోందని తనకు అర్థమైంది… కాస్త విశ్రాంతి తరువాత తనను ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించారు… అక్కడ కొన్ని పరీక్షలు చేసి చివరకు ఇండియన్ ఎంబసీకి పంపించేశారు… అక్కడి నుంచే ప్రధాని వాజపేయితో కూడా మాట్లాడాడు ఫోన్‌లో…
క్షేమంగా తిరిగి వచ్చాడు నచికేత… ఈరోజుకూ ఆ పాకిస్థానీ ఆర్మీ కెప్టెన్‌ను తలుచుకుంటాడు తను… ఎజెక్ట్ అవుతున్నప్పుడు వెన్నెముకకు తగిలిన దెబ్బలతో తిరిగి ఫైటర్ విమానం నడిపేందుకు దేహం సహకరించలేదు… తనను రవాణా విమానాల్ని నడిపే డ్యూటీలో వేశారు… 2017లో రిటైరయ్యాక, కమర్షియల్ ఫైట్లలో రిక్రూటయ్యాడు…
(నచికేత ఇన్నేళ్లూ మీడియాకు ఈ వివరాలు చెప్పలేదు… ఎన్డీటీవీతో పంచుకున్నాడు తాజాగా తన అనుభవాల్ని… ఆ యుద్ధంలో ఎందరో అభినందన్‌లు… ఈ కథనంలో నాకు ఇంట్రస్టింగుగా అనిపించింది తోటి సైనికుడికి గౌరవం ఇచ్చి రక్షించిన ఆ పాకిస్థానీ ఆర్మీ కెప్టెన్ కనబరిచిన దృక్పథం…)
Share this Article