సినిమా పాటకు సాహిత్యంకన్నా ట్యూనే ప్రాణం… జనంలోకి తీసుకుపోయేది అదే… హిట్టో ఫ్లాపో తేల్చేదీ అదే… మంచి ట్యూన్లతో పాటలు హిట్టయితే సహజంగానే సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చిన ఉదాహరణలు బోలెడు… అసలు పాటలతోనే నడిచిన సినిమాలూ బొచ్చెడు… చాలామంది సంగీత దర్శకులు పాపులర్ ట్యూన్లను కాపీలు చేస్తూ, కాస్త మార్పులు చేసుకుని తమ క్రియేటివ్ ఖాతాలో వేసుకోవడమూ చూస్తూనే ఉన్నాం… అదేమని అడిగేవారు ఎవరుంటారు..? ట్యూన్లకు కాపీరైట్లు గట్రా ఏముంటయ్..? (నిజంగా అలాంటి రక్షణ ఏమైనా ఉందా..?) అయితే ఒకే సంగీత దర్శకుడు ఒకే ట్యూన్‌ను పలు సినిమాల్లో యథాతథంగా వాడేస్తే దాన్నేమనాలి..? ఆ ట్యూన్ అంత బలంగా ప్రేక్షకుడిని కనెక్టయిందీ అనుకోవాలి… ఆ ట్యూన్‌కు చప్పట్లు కొట్టాలి… మళయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వాడుకోబడిన ఆ ట్యూన్ ఇళయరాజాది… (ఈ సమాచార సేకరణ క్రెడిట్స్ :: హరి పడుకొనె)
- ఓళంగల్ అనే సినిమా 1982లో వచ్చింది, బాలు మహేంద్ర సినిమా… అందులో పూర్ణిమ జయరాం, అమోల్ పాలేకర్ నటించారు… తుంబి వా తుంబక్కుడత్తిన్ అనే ఆ పాటను జానకి పాడింది… ఇదీ ఆ పాట
- 1980లో కన్నడంలో ఆటోరాజా అనే సినిమా వచ్చింది… దాన్ని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు అదే సంవత్సరం… సినిమాకు సంగీత దర్శకత్వం శంకర్-గణేశ్ అయినా… ఈ ఇళయరాజా ట్యూన్ అందులోకీ వచ్చి చేరంది… ఆయన పేరుతోనే… మళయాళంలో మొదట పిల్లల పాట కాగా, ఇందులో ఇది రొమాంటిక్ సాంగ్‌గా మారిపోయింది… మళ్లీ జానకే గాయని… ఇదీ ఆ పాట
- అదే 1982… బాలు మహేంద్ర తెలుగులో ఓ సినిమా తీశాడు… పేరు నిరీక్షణ… అందులో అర్చన నటనకు మంచి ప్రశంసలూ దక్కాయి… పాటలన్నీ హిట్టే… బాలు మహేంద్రకు ఈ ట్యూన్ అంతకుముందే తెలుసు కదా… సేమ్ ఒక పాటకు పెట్టేశాడు… మళ్లీ జానకే గాయని… ఈ సినిమాను యాత్ర పేరుతో మళయాళంలో రీమేక్ చేశారు… ఇదీ ఆ పాట
- తెలుగులో క్లిక్కయింది… మళయాళంలో రీమేక్ అయ్యింది… మరి తమిళం వాళ్లు ఎందుకు వదిలిపెడతారు… నిరీక్షణ సినిమాను తమిళంలోకి కన్నే కలైమానే పేరుతో రీమేక్ చేశారు… అందులో మళ్లీ ఇదే ట్యూన్ సూపర్ హిట్… నీర్ వీల్చి తీముట్టుదే అనే ఆ పాట ఇదుగో…
- ఆ ట్యూన్ అలా అలా దక్షిణ భాషల్లో కాలర్ ఎగరేసుకుని, చక్కర్లు కొడుతూనే ఉంది… 14 ఏళ్లు గడిచిపోయాయి… 1996లో… ఔర్ ఏక్ ప్రేమ్ కహానీ అని ఓ హిందీ చిత్రం… మళ్లీ బాలు మహేంద్ర… మళ్లీ ఇళయరాజాకు సంగీత సారథ్యం… మళ్లీ అదే ట్యూన్… కాకపోతే కాలం ఓ తరం మారిపోయిందిగా… కొన్ని మార్పులు చేశారు… దాంతో ట్యూన్ మరింత హొయలుపోయింది… ఇలా…
- మరో ఎనిమిదేళ్లు గడిచిపోయాయ్… 2004లో ఇటలీలో ఓ కాన్సర్ట్… అనగా కచేరీ… ఇళయరాజా ఈ ట్యూన్‌ను మూడ్ కాపీ అనే పేరుతో ప్రజెంట్ చేశాడు… దక్షిణ భాషలు ప్లస్ హిందీ అయిపోయి, ఇప్పుడిది ఇంటర్నేషనల్ వెర్షన్ అయిపోయింది… గ్రేట్ కదా… ఇదీ ఆ సింఫనీ
- మరో అయిదేళ్లు గడిచిపోయాయ్… 2009లో… బాల్కి దర్శకత్వంలో పా అనే హిందీ చిత్రం వచ్చింది… ఇదే ట్యూన్… ఇంకాస్త మారింది… కాలానుగుణంగా మారాలి కదా… మూలం అదే… ఈసారి గాయని ఎవరో తెలుసా..? ఇళయరాజా బిడ్డ భవతరణి… ఇదీ హిట్టయింది… ఇలా…
- ఏమో… సదరు ట్యూన్‌కు జీవం పోసినవాడున్నాడు… ఎల్లలు లేని స్వర ప్రపంచమిది… ఎదురులేని ట్యూన్ అది… ఏమో, మళ్లీ ఏ భాషలోనో ఒదిగి మళ్లీ మన చెవుల వద్దకు చేరుకుంటుందేమో…!!
Ads
Share this Article