పెళ్లికి ముందే కాబోయే వధూవరులను ఎక్కడికో తీసుకెళ్లి… రకరకాల కాన్సెప్టుల్లో, భిన్న ఫోజుల్లో Pre-Wed పేరిట ‘షార్ట్ ఫిలిమ్స్’ తీసి, ఫోటోలు తీయడం కూడా ఇప్పుడు ఓ తప్పనిసరి పెళ్లితంతు అయిపోయింది కదా… అడ్డగోలు చార్జీలు… లక్షల్లో… భరించాల్సిందే… ఆడపిల్ల తండ్రి జేబులు కత్తిరించడమే కదా పెళ్లి తంతు అంటే..! ఒకడిని చూసి ఇంకొకడు… ఈ ప్రివెడ్ బరువు తప్పడం లేదు… లేకపోతే సమాజం ఊరుకోదు మరి… ఖర్మ… ఈ ప్రి-వెడ్ పైత్యం ఎక్కడిదాకా పోయిందో ఆమధ్య కొన్ని చూశాం కదా ఫోటోలు, వీడియోలు… సన్నని తెల్లటి బట్ట ఒకటి కాస్త అడ్డంగా చుట్టుకుని, బరిబాతల ఫోటోలు, వీడియోలు తీయించుకున్నది ఓ జంట… ఇంకా నయం… డ్యాష్ డ్యాష్ అనుకుని పాఠకులు బూతులు తిట్టారు, అది వేరే కథ… కానీ ఈ విశృంఖల ప్రి-వెడ్ పైత్యం కరోనాను మించి విస్తరిస్తూనే ఉంది… అయితే కొన్ని జంటల టేస్టు చూస్తే ముచ్చటేస్తుంది… ఎలాగూ ప్రి-వెడ్ షూట్ చేయించుకుంటున్నాం కదా, అందరూ మెచ్చేలా, తమ మనస్సులకూ నచ్చేలా కాన్సెప్టులు సెలెక్ట్ చేసుకుంటున్నారు…
ఇది చూశారుగా… ఒక pre-wedding photoshoot… కర్నాటక, ధర్వాడ్‌కు చెందిన జంట చేతన్ దేశాయ్, నికిల్ మగ్గవి పెళ్లి ఈ నెల 23న ఉంది… వాళ్ల డిఫరెంటు కాన్సెప్టు ఫోటో షూట్ ఇది… ఉత్తర కర్నాటక పాత సంప్రదాయ జీవితాన్ని ప్రతిబింబించేలా, దంపతుల అన్యోన్యతను చాటేలా ప్లాన్ చేసుకున్నారు… దానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత దత్తాత్రేయ రామచంద్ర బేంద్రె రాసిన పద్యాలను నేపథ్యంగా తీసుకుని, అప్పటి పరిస్థితుల్ని చిత్రించేలా ప్రివెడ్ షూట్ చేయమన్నారు… ఆ వీడియో కమ్ ఫోటోగ్రాఫర్ ఎవరో కాస్త దమ్మున్నోడే… ఈ ప్లాన్ భలే నచ్చేసి, అచ్చంగా వాళ్లు అనుకున్నట్టుగా దింపేశాడు…
Ads
దీనికి ఇంకో కారణమూ ఉందండోయ్… ఈ బేంద్రె ఇంటి పక్కనే చేతన కుటుంబం ఉంటుంది… ఆ కవి కుటుంబంతో చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధాలున్నయ్… బేంద్రె అప్పట్లో రాసిన పద్యాల్లో అప్పటి ఉత్తర కర్నాటక కల్చర్ కనిపిస్తుంది… దాన్ని విజువలైజ్ చేయడం, దాచుకోవడం ఈ ప్రి-వెడ్ షూట్ కాన్సెప్ట్… పైన ఫోటో చూశారుగా… అయ్యగారు అమ్మగారి జుత్తు దువ్వి జడవేస్తున్నాడు… చీరకు శింగులు పోసుకుని, కాళ్లకు పట్టీలు పెట్టుకుని, గాజులు, చెవికమ్మలు, ముక్కుకు పెద్ద పుడకతో ఎంత అందంగా కనిపిస్తున్నదో కదా… అయ్యగారూ తక్కువేమీ కాదు… ఓ ఛెత్రీ, నెత్తికి టోపీ, బిగించి కట్టిన ధోతీ, పైన కోటు, జేబుకు పెన్ను… మరి ఆమాత్రం ఉండొద్దా ఏం..?
ఆరు బయట కూర్చుని పుంజీతం, అష్టాచెమ్మా ఆడుకోవడం… వాళ్ల మురిపెం… భలే తీశాడు ఫోటోగ్రాఫర్… ఈ ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి… ఒకటీరెండు జాతీయ పత్రికల్లోనూ ఈ వార్త వచ్చింది… ఈ షూట్‌కు కావల్సిన ఛెత్రీ, టోపీ, గ్రామఫోన్ గట్రా ఆ కవిగారి ఇంటి నుంచే అడిగి తెచ్చుకున్నారు… పాత ప్రాపర్టీస్… కానీ లుక్కు భలే వస్తుంది కదా… ఈ ప్రి-వెడ్ షూట్ చేసిన యువ ఆర్ట్ స్టూడియో ఫోటోగ్రాఫర్ హర్షద్ ఉదయ్ కామత్ ఏమంటాడంటే..? ‘‘ఈ కాన్సెప్టు పూర్తిగా ఆ జంటదే… ఉత్తర కర్నాటక పాత గ్రామీణ సంస్కృతి కనిపించాలనేది వాళ్ల ఐడియా, అమల్లోకి తెచ్చింది నేను, అంతే… బేంద్రె కుటుంబం కూడా ఆనందంగా సహకరించింది… వాళ్లింట్లోని పాత సామాను వాడుకోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు… ఈ జంట, వాళ్ల తల్లిదండ్రులు కూడా ఫుల్ హేపీ…’’ మనవాళ్లలో ఎవరైనా మన పాత కవుల పద్యాల్ని నేపథ్యంగా తీసుకుని మన గోదావరి పల్లెలు, ఉత్తర కోస్తా, తెలంగాణ, రాయలసీమ గ్రామీణ సంస్కృతిని చిత్రీకరించుకుంటారా..? ఆ ప్రి-వెడ్ వీడియోలు, ఫోటోలు చాలాకాలం మనల్ని మురిపిస్తూనే ఉంటయ్… ఏమంటారు..?! ఎట్ లీస్ట్, ఆల్ రెడీ ఆ సంస్కృతికి అద్దంపట్టే పాత సినిమా పాటల్ని బ్యాక్ డ్రాప్ చేసుకుని ప్రి-వెడ్ షూట్ చేయించుకున్నా బాగానే ఉంటుంది… #PreWedShoot
Share this Article