.
మనిషి తను వేసుకున్న లెక్కలు, అనుభవాలు, అంచనాలను బట్టి… శుభ గ్రహాలు, దుష్ట గ్రహాలు గట్రా పేర్లు పెట్టుకున్నాడు… ఇటీవల రోగ్ ప్లానెట్ అనే పదం కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చింది… నిజానికి అది రోగ్ ప్లానెట్ కాదు, దుష్టగ్రహం అంతకన్నా కాదు… వివరాల్లోకి వెళ్తే…
పెకింగ్ యూనివర్శిటీకి చెందిన సుభో డోంగ్ సారథ్యంలోని ఖగోళ శాస్త్రవేత్తలు, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన నేషనల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలు… స్వేచ్ఛగా తిరుగుతున్న ఒక రోగ్ ప్లానెట్‌ను గుర్తించారు…
Ads
సాధారణంగా మన భూమిలాంటి గ్రహాలన్నీ ఒక పద్ధతి ప్రకారం సూర్యుడి చుట్టూ తిరుగుతూ, ఓ క్రమశిక్షణ గల కుటుంబంలా ఉంటాయి (సౌరకుటుంబంఏ)… కానీ ఈ రోగ్ ప్లానెట్ అలా కాదుట… ఇది ఒక “ఒంటరి ప్రయాణం” చేసే గ్రహం… ఏ నక్షత్రం తోడు లేకుండా, ఏ నిర్దిష్ట కక్ష్యలోనూ తిరగకుండా, చీకటి అంతరిక్షంలో ఇష్టమొచ్చినట్టు విహరిస్తుంటుంది… అందుకే దీనిని ‘సంచారి’ లేదా ‘అనాథ గ్రహం’ అని కూడా అనొచ్చు…
శాస్త్రవేత్తలు దీన్ని ఎలా కనిపెట్టారు?
మరి ఒంటరి చీకట్లలో తిరిగే ఈ గ్రహం మన కంట ఎలా పడింది? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది… దీనికి మైక్రోలెన్సింగ్ (Microlensing) అనే టెక్నిక్ వాడారు…
-
ఈ గ్రహానికి సొంత కాంతి ఉండదు…
-
కానీ ఇది ఏదైనా నక్షత్రం ముందు నుండి వెళ్తున్నప్పుడు, తన గురుత్వాకర్షణ శక్తితో ఆ నక్షత్ర కాంతిని ఒక లెన్స్ లాగా కాస్త వంచుతుంది…
-
ఆ కాంతిలో వచ్చే మార్పులను గమనించి, శాస్త్రవేత్తలు “అక్కడో గ్రహం ఉంది సుమీ!” అని కనిపెట్టారు…
దీని కథాకమామిషు
-
సైజు: ఇది మన బృహస్పతి (Jupiter) గ్రహంలో 22 శాతం బరువు ఉంటుందట… అంటే దాదాపు శనిగ్రహం పరిమాణంలో ఉంటుంది…
-
దూరం: ఇది భూమి నుంచి చాలా దూరంలో, పాలపుంత మధ్య బిందువుకు దగ్గరగా ఉంది…
-
గతం: ఇది పుట్టినప్పుడు ఒక సోలార్ సిస్టమ్‌లో భాగంగానే పుట్టి ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా… కానీ తోటి గ్రహాల గురుత్వాకర్షణ తోపులాట వల్ల ఆ కుటుంబం నుంచి బయటకు నెట్టివేయబడి ఉండవచ్చు…
“Rogue” అంటే తెలుగులో ‘ఒంటరిగా తిరిగేవాడు’ లేదా ‘నియమాలను ధిక్కరించేవాడు’ అని అర్థం వస్తుంది… తెలుగు వార్తల్లో దీన్ని “దుష్ట గ్రహం” అని కూడా పిలుస్తున్నారు… అయితే, అది చెడ్డ గ్రహం అని కాదు, అది అనుసరించే “దారి” వేరు కాబట్టి ఆ పేరు పెట్టారు… కానీ ఆప్ట్ కాదు…
తెలుగులో దీనిని “ఏక సంచారి గ్రహం” లేదా “ఏకాకి గ్రహం” అంటే చాలు… ఎందుకంటే అది ఎవరికీ కీడు చేయదు, పాపం… తన దారిన తాను ఒంటరిగా అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ ఉంటుంది…
ఆసక్తికరమైన విషయం…: శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, మన పాలపుంతలో నక్షత్రాల కంటే ఇలాంటి రోగ్ ప్లానెట్స్ సంఖ్యే ఎక్కువగా ఉండొచ్చు! అంటే కొన్ని కోట్ల ‘అనాథ గ్రహాలు’ అంతరిక్షంలో ఎవరికీ తెలియకుండా…. క్రమ శిక్షణ లేకుండా, అంటే ఓ క్రమ కక్ష్య లేకుండా తిరుగుతున్నాయి..!!
Share this Article