మనిషి విధిని గెలవగలడా..? ఎలా గెలుస్తాడు..? జరగాల్సింది ఏదో ముందే రాయబడి ఉన్న తరువాత, ఇక మారేదేముంది..? సో, తన రాతను విధి కూడా మార్చలేదు… ఇది నమ్మకం… గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు… అయితే దీనికి భిన్నంగా, విధిని కూడా గెలవొచ్చు ప్రయత్నిస్తే… అనే కాన్సెప్టు ఓ కల్పన… మంచిదే… కానీ అది బలంగా ప్రజలకు ఎక్కించాలంటే, నమ్మించాలంటే ఎక్సట్రా ఆర్డినరీ ఎఫర్ట్ అవసరం… యమధర్మరాజును తప్పుదోవ పట్టించిన సతీ సావిత్రి రేంజులో జనాన్ని నమ్మించగలగాలి… అక్కడ రాధేశ్యాం దర్శకుడు రాధాకృష్ణ ఫెయిలయ్యాడు…
అందుకే రాధేశ్యాం ఫెయిలైంది… పాటలు, వీక్ సీన్స్, ప్రభాస్ ఇమేజీకి భిన్నమైన పోకడ గట్రా ఎన్ని కారణాలున్నా సరే, బేసిక్ కథలో దమ్ము లేదు… కాదు, కాదు… క్లారిటీ లేదు… ఒక జ్యోతిష్కుడు, తను చెప్పింది జరిగి తీరుతుందనే ధీమా ఉన్నవాడు, రైలు వెంట పరుగులు తీస్తూ ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తాడు..? అదొక ఎమోషన్… తెలిసీ ఓ పరుగు… తన సొంత సమస్య వస్తే విధిరాతనే మార్చడానికి ప్రయత్నం… కర్మణ్యే వాధికారస్తే… జరగాల్సిన దాన్ని నేను కూడా మార్చలేను, అందరమూ నిమిత్తమాత్రులమే అంటాడు గీతకారుడు…
సరే, ఈ డెస్టినీ సంబంధ చర్చ ఒడవదు, తెగదు… కానీ సినిమా కథ విషయానికొద్దాం… దిగువన ఓ వీడియో ఉంది… యూట్యూబ్ లింక్… 2005లో ఓ సినిమా వచ్చింది… సినిమా పేరు రిలాక్స్… అందులో ఓ సన్నివేశం… అనుకోకుండా ఓ ప్రముఖ జ్యోతిష్కుడిని తోటి రైలు ప్రయాణికుడు జాతకం చెప్పమంటాడు… మొహమాటంతో చేయి చూసి, ఏవో లెక్కలు వేసి షాక్ తింటాడు జ్యోతిష్కుడు… సందేహంతో మిగతా రైలు ప్రయాణికుల చేతుల చూస్తాడు…
Ads
అందరివీ సేమ్ జాతకాలు… మరణం సమీపించింది…! అంటే ఏమిటి..? ఈ రైలుకే ఏదో కాబోతోంది అని అర్థం… వెంటనే నెక్స్ట్ స్టేషన్‌లో దిగిపోయి, రైలు ముందుకు వెళ్లకుండా నిలువరించడానికి ప్రయత్నం చేస్తాడు… తనకు తెలుసు, సామూహిక మరణాలు సంభవించబోతున్నాయని… ఐనా ఓ ప్రయత్నం… అన్నట్టుగానే జరుగుతుంది… రాధేశ్యాం సినిమాలో ఓ సీన్ గుర్తొచ్చిందా మీకు..? ఎస్… ఇలాంటిదే…
2005 నాటి సినిమాను రాధాకృష్ణో… సినిమా కథకులు అబ్బాస్, హుస్సేన్‌లో కాపీ కొట్టారని కాదు… నిజానికి గతంలో కీరో అనే ఓ విదేశీ జ్యోతిష్కుడికి కూడా ఇలా జరిగిందంటారు మరి… ఏదో చదివి, ఎక్కడో చూసి వాళ్లు ఇన్‌స్పయిర్ అయి ఉంటారు… రిలాక్స్ మూవీ కథనం వేరు… రాధేశ్యాం కథనం వేరు… కాకపోతే ఓ జ్యోతిష్కుడి సొంత అనుభవాల కథే… కాకపోతే ముందే చెప్పుకున్నట్టుగా… అంత వీజీగా జనానికి ఎక్కదు సబ్జెక్టు… అందుకే రిలాక్స్ మూవీ అట్టర్ ఫ్లాప్… అఫ్‌కోర్స్, రాధేశ్యాం కూడా ఫ్లాపే… ఇదే తరహా సీన్ ఒకటి అయ్యర్ ది గ్రేట్ అనే మలయాళ మూవీలో ఉన్నట్టు ఇప్పుడే ఒక మిత్రుడి అప్డేట్… అది 1990 మూవీ… మమ్ముట్టి హీరో…
Share this Article