Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదే సీన్… 2 పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…

June 4, 2025 by M S R

.

ఆమధ్య తెలుగు పాట గురించి… సందర్భోచితం గురించి… పాత్రోచితం గురించి… సహజత్వం గురించి… ఏదేదో చెప్పుకుంటూ ఆగిపోయినట్టున్నాం కదా… అంతేకదా మరి… ఎహె, ఊరుకొండి సార్, తెలుగు సినిమా పాటల్లో విలువలు, ప్రమాణాల గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది..?

సొట్టలు పడిన సత్తురేకు డబ్బాలో గులకరాళ్ల మోతలా ఓ ట్యూన్, చిత్రవిచిత్ర పదాల్ని అందులో పేర్చేయడం అంటారా..? అలాగని అన్నీ ఒకేగాటన కట్టేసి తీసిపారేయలేం కదా… సహజత్వం, పాత్రోచితం, సందర్భోచితాల గురించే తీసుకుంటే…

Ads

పర్ సపోజ్, ఓ జానపదుడు, ఏదో ఆనందంలో కాస్త కల్లు తాగి, అదే ఊపులో గంతులేస్తూ ఓ పాట అందుకున్నాడు అనుకుందాం… తనకు అక్కడ ఓ త్యాగరాజు కీర్తనో పెడితే ఎలా ఉంటుంది..? అర్థమైంది కదా… అదే ఓ శాస్త్రీయ గాయకుడు వేదిక మీద కచేరీ చేస్తుంటాడు అనుకుందాం…

అకస్మాత్తుగా ‘‘ఏక్ బార్, ఏక్ బార్, డప్పేసి స్టెప్పు మార్, ఏక్ బార్, ఏక్ బార్, దంచేయ్‌రో డాన్స్ ఫ్లోర్’’ అని పాట అందుకుంటే..? రాధేశ్యాంలో మరీ భావగర్భితమైన పదాలేవేవో పేర్చాడు రచయిత, అవే వింటుంటే… ఆమధ్య ఫేస్‌బుక్ మిత్రుడు Vijayakumar Koduri రాసిన ఓ పోస్టు యాదికొచ్చింది… ఆసక్తికరంగా ఉంది…

ఒక సందర్భం – రెండు పాటలు
____________________________

అది అయోధ్య… వనవాస తదనంతరం రాజ్యంలోకి అడుగుపెట్టిన రాముని రాకతో పుర ప్రజలు గొప్ప సంతోషంతో వున్నారు. ఆ సంతోష సందర్భంలో అయోధ్య రాజ్య ప్రజలు పాడుకునే పాట ఎట్లా వుండాలి ? ఆ పాటకు వాళ్ళు చేసే నాట్యాలు ఎట్లా వుండాలి ? ఇవి అర్థం కావాలంటే ‘అయోధ్య రాజ్య ప్రజలు అంటే ఎవరు?’ అనేది కూడా కొంత అర్థం కావాలి.

1950 లలో దర్శకుడు సి పుల్లయ్య గారు, అయోధ్య రాజ్య ప్రజలు అంటే కుల వృత్తుల వాళ్ళు, బహుజనులు, జానపదులు అని అర్థం చేసుకున్నారు. అలా అర్థం చేసుకున్నారు కాబట్టే, ఉత్తర రామాయణ కథ ఆధారంగా తీసిన పాత ‘లవకుశ’ సినిమాలో రాముడు రాజ్యంలోకి ప్రవేశించినపుడు, ప్రజలు పాడుకున్న పాటగా ‘రామన్న రాముడూ, కోదండ రాముడూ, శ్రీరామ చంద్రుడూ వొచ్చాడురా – హెయ్ – సీతమ్మ తల్లితో వొచ్చాడురా…’ అన్న జానపద గీతాన్ని పెట్టాడు.

ఆ పాటలో రాజ్య ప్రజలు స్వేచ్చగా నాట్యం చేయడం కనిపిస్తుంది. రాజును ‘అన్న’ అనీ, రాణిని ‘తల్లి’ అనీ ప్రజలు సంబోధిస్తున్నట్టు చూపిన హృదయమున్న పాట అది! కట్ చేస్తే —

దాదాపు 50 యేళ్ళ తరువాత..,

యువరత్న బాలకృష్ణ గారికి తమ తండ్రి గారు నటించిన ఆ ‘లవకుశ’ను బాపు గారితో మళ్ళీ తీయాలనిపించింది. తెలుగు ప్రేక్షకులుగా మనకు తెలుసు గదా … శైవ సాంప్రదాయ పద్ధతిలో సినిమా తీయాలంటే విశ్వనాథ్ గారు, వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో సినిమా తీయాలంటే బాపు గారు తప్ప మరెవరూ లేరని!

సరే – ఆ పాత ‘లవకుశ’ను ‘శ్రీ రామరాజ్యం’ పేరుతో తీసారు. పాత సినిమాలోలాగే, రాముడు వనవాసం నుండి తిరిగి వొచ్చినపుడు ఆ సంతోషంలో అయోధ్య ప్రజలు పాడుకునే పాట వుండాలి కదా ! బాపు, బాలకృష్ణ, ఇళయరాజా ఇతర బృందం బా…గా ఆలోచించినట్టున్నారు.

ప్రజలు పాడుకునే పాట కొత్తగా వుండాలని భావించినట్టున్నారు. ఫలితం — మంద్రంగా సాగే సంక్లిష్ట పదబంధాల పాట – ‘జగదానంద కారకా .. జయ జానకీ ప్రాణ నాయకా … శుభ స్వాగతం … ప్రియ పరిపాలకా!’… (ఇది జొన్నవిత్తులతో రాయించినట్టున్నారు)

పాట వింటూ వుంటే, రాజు గారి ఆస్థాన కవులు రాసిస్తే, ఆస్థాన శాస్త్రీయ సంగీత విద్వాంసుడు స్వరపరిస్తే , ఆస్థాన గాయకులు పాడినట్టు లేదూ ? అదే కాదు, పాట తెరపై చూస్తే కూడా, ప్రజలు ఆ పాటకు పెదాలు కదుపుతూ, ఆస్థాన భరత నాట్య / కూచిపూడి కళాకారిణి రూపొందించిన నృత్య భంగిమల ప్రకారం డాన్స్ చేసినట్టు వుంటుంది తప్ప, అభిమానించే రాజు రాజ్యానికి వొచ్చినపుడు ఉత్సాహంతో స్వేచ్చగా నాట్యం చేసినట్టు వుండదు. అట్లా అని ఈ కొత్త పాట బాగా లేదా ? భలే వారే ! చాలా బాగుంది… యూట్యూబులో ఇప్పటికీ దానికి వ్యూస్ వస్తూనే ఉంటాయి…

telugu song

జగదానంద కారకా పాట బాగానే ఉండవచ్చుగాక… కానీ రామన్న రాముడూ, కోదండరాముడూ అనే ఆ పాత పాట ఆపాతమధురం… సహజం… లవ్లీ, లైవ్లీ… అది జనం పాట… జనంలోకి బలంగా వెళ్లిన పాట… జనం మూడ్ ఆవిష్కరించే పాట…

అందుకే ఒక రాతగాడు ఏదో రాసేస్తే సరిపోదు, ఓ పాటగాడు అది పాడేస్తే సరిపోదు, ఓ సంగీతకారుడు ఓ మంచి ట్యూన్‌ కంపోజ్ చేస్తే సరిపోదు, అది నాలుగు కాలాలపాటు సహజంగా, సజీవంగా ఉండాలంటే… పాటకు సందర్భశుద్ధి ఉండాలి, సాహిత్యశుద్ధి ఉండాలి, సంగీతశుద్ధి ఉండాలి, గాత్రశుద్ధి ఉండాలి… అన్నింటికీ మించి దర్శకుడికి ఆ పాటలో ఏముండాలో తెలియాలి… టేస్టుండాలి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!
  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions