నవ్వొచ్చింది… వీజే సన్నీ అని ఓ నటుడు… బిగ్‌బాస్ వల్ల నాకు ఒరిగిందేమిటి..? అని ఏదో ఇంటర్వ్యూలో బాగా బాధపడిపోయాడట… ముందుగా తను ఏమన్నాడో చదవండి ఓసారి… ‘‘బిగ్‌బాస్ వల్ల నాకు ఒరిగిందేమీ లేదు… బిగ్‌బాస్ విన్నర్ అని చెప్పుకోవడం కూడా మానేశాను… ఎవరినైనా కలిసినప్పుడు బిగ్‌బాస్ విన్నర్‌ను అని చెబితే ‘అంటే ఏమిటి’ అనడుగుతున్నారు… బిగ్‌బాస్ వల్ల నాకు ఫేమ్, నేమ్ వచ్చిన మాట నిజమే… నా కెరీర్‌కు ఉపయోగపడిందేమీ లేదు… అందుకే ఇవన్నీ చెప్పడం మానేసి, నా సినిమాలు, సీరియల్స్ మీద దృష్టి పెడుతున్నా…’’
నవ్వు ఎందుకొచ్చిందీ అంటే..? అసలు బిగ్‌బాస్ వల్ల ఏదో ఒరుగుతుందని భ్రమపడటం… ఆ షో వల్ల కెరీర్‌కు ఏదో ఊపు, జంప్ వస్తాయని ఆశించడం… ఫీల్డ్‌లో ఉంటూ, గత బిగ్‌బాస్ షోలను చూస్తూ, ఆ షోల విజేతలు- పార్టిసిపెంట్లకు ఏం ఒరిగిందో గమనిస్తూనే, తనకేదో ఒరుగుతుందని నమ్మడం… ఇప్పుడు ఏమీ ఒరగలేదంటూ వ్యాఖ్యలు చేయడం…! అన్ని భాషల్లో బిగ్‌బాస్ షోలు కలిపి వందల మంది పార్టిసిపెంట్లు, బోలెడు మంది విజేతలు… సో వాట్..?
అదొక ఎంటర్‌టెయిన్‌మెంట్ షో… ఆల్ రెడీ జనానికి తెలిసిన ఫిలిమ్- టీవీ నటులు, టీవీ హోస్టులు, న్యూస్ రీడర్లు, సింగర్స్, ఆర్జేలు, వీజేలు, మోడల్స్, ఫిలిమ్ క్రిటిక్స్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంచుకుని, డబ్బు ప్యాకేజీలు ఆశచూపి, కొన్నాళ్లు వినోదాన్ని ప్రేక్షకులకు పంచడమే ఆ షో ఉద్దేశం… దాంతో కొన్నాళ్లు పాపులారిటీ వస్తుంది, అంతే… ఒక సెక్షన్ టీవీ ప్రేక్షకుల్లో చర్చల్లోకి వస్తారు… అంతేతప్ప దీంతో అవకాశాలేమీ తన్నుకురావు…
Ads
అందుకే నాకు ఒరిగిందేముంది అనే ప్రశ్న పెద్ద అబ్సర్డ్… ఒరగడానికి ఏముంది అనేదే దానికి జవాబు… షో ముగిశాక ఏమీ ఉండదు, ఎవడి జీవితం వాడిదే… ఎవరి పాత వృత్తి వాళ్లదే… కాకపోతే లేడీ కంటెస్టెంట్లయితే టీవీ స్పెషల్ షోలలో పాల్గొంటూ, నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు కొన్నాళ్లు… అంతే తప్ప హీరోలు, హీరోయిన్లు అయిపోరు… నిర్మాతలు ఖాళీ చెక్కులతో క్యూలు కట్టరు… ఆ లెక్కలే వేరు… ఆల్‌రెడీ ఇండస్ట్రీలో ఢక్కామొక్కీలు తింటూ, కిందామీదా పడుతున్నవారినే ఎవడూ సరిగ్గా దేకడు… బిగ్‌బాస్ విజేతవా..? సో వాట్..?
ఆ షో వాడు ఓ ఇరవై మందిని ఓ హౌజులో పడేసి, ఏవో పిచ్చి టాస్కులు చేయించి, అందరికీ వోట్ల పంచాయితీలు పెట్టి, చివరకు ఎవరినో విజేత అని ప్రకటిస్తే… అదేం పెద్ద ఘనతా..? సినిమావాళ్లు ఎగబడాల్సిన ప్రతిభా..? అలా నమ్మడంలోనే మన భ్రమలున్నయ్… తెలుగునే తీసుకుందాం… మొదటి సీజన్ విజేత శివబాలాజీ… నయాపైసా ఉపయోగపడలేదు తనకు… రన్నరప్ ఆదర్శ్… ఇప్పటికి మళ్లీ కనిపించలేదు ఎక్కడా… ధనరాజ్, ముమైత్, నవదీప్… సేమ్…
రెండో సీజన్ విజేత కౌశల్… మస్తు ఖర్చు కూడా పెట్టాడు… తనకూ పైసా ప్రయోజనం రాలేదు… ఇప్పటికీ అంతే… గెలుపు నాదే అనుకున్న గీతామాధురి విజయమూ దక్కలేదు, షో అయిపోయాక గతంలోకన్నా పాటలు తగ్గిపోయాయి… భాను, తనీష్, తేజస్వి, సామ్రాట్… అందరికీ బిగ్‌బాస్ షో వల్ల ఏమీ ఒరగలేదు… మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్… ఏమైనా సాంగ్స్ పెరిగాయా చెప్పలేం… పునర్నవి మళ్లీ కనిపించలేదు… గెలుస్తాను అనుకున్న శ్రీముఖికి అదీ దక్కలేదు, అంతకుముందుతో పోలిస్తే అదనంగా దక్కిన అవకాశాలూ లేవు… వరుణ్‌సందేశ్, వితిక జంటకు కూడా దక్కిందేమీ లేదు…
ఈ షోలలో పాల్గొన్న దీప్తి, జాఫర్ తమ టీవీల నుంచి బయటికి వచ్చారు… సుజాత టీవీ కామెడీ షోలు చేసుకుంటోంది… దేవి బెటర్… నాలుగో సీజన్ విజేత అభిజిత్… మళ్లీ ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు… రన్నరప్ అఖిల్ ఒకటీరెండు టీవీ షోలు చేసుకుంటున్నాడు… మోనాల్ ఏదో డాన్స్ షోలో జడ్జిగా కనిపించి, మళ్లీ మాయమైపోయింది… సాక్షాత్తూ చిరంజీవి ఆశీర్వదించి, అవకాశాల హామీ ఇచ్చిన సోహెల్ మెహబూబ్‌లకు కూడా దక్కిందేమీ లేదు… ఒక్క గంగవ్వకు మాత్రం ఇల్లు సమకూరింది…
అయిదో సీజన్ విజేత ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సన్నీ… నిజానికి షన్నూ నుంచి మంచి పోటీ ఎదుర్కున్నాడు… సన్నీ అయినా, షన్నూ అయినా మళ్లీ ఎక్కడా కనబడలేదు… సిరి సీరియళ్లలోనూ కనిపించకుండా పోయింది… సింగర్ శ్రీరామచంద్రకు ఆహాలో ఇండియన్ ఐడల్ హోస్ట్‌గా చాన్స్ వచ్చింది, కానీ దానికి బిగ్‌బాస్ కారణం కాదు… ఆనీ మాస్టర్ షో తరువాత కనిపించలేదు… (నాన్ స్టాప్ షోను పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదు… దాని రీచ్, ప్రేక్షకుల సంఖ్య చాలా స్వల్పం…)
సో… ఇవిగో ఇన్ని ఉదాహరణలు… అందుకని బిగ్‌బాస్ ఏదో ఉద్దరిస్తుందని అనుకోవడమే తప్పు… తప్పున్నర… డబ్బుల కోసమే కంటెస్టెంట్లు హౌజులోకి వెళ్తారు… డబ్బులు తీసుకుని, ఆ నాలుగు వారాలూ వాడేసుకుని బిగ్‌బాస్ వదిలేస్తాడు… తరువాత ఎవడి బతుకు వాడితే… ఆ కంటెస్టెంట్లను ఇండస్ట్రీ మెచ్చి, అలుముకోదు… ఎందుకంటే..? బిగ్‌బాస్ షోలలో చూపించే ప్రతిభ కాదు, అవి జస్ట్, ప్రొలాంగ్డ్ కిట్టీ పార్టీలు మాత్రమే… సన్నీ… సమజైందా..?!
Share this Article