Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాముడితో రామేశ్వర తీరంలో శివ హోమం చేయించిన రావణబ్రహ్మ..!!

April 22, 2025 by M S R

.

కోరాను స్క్రోల్ చేస్తుంటే ఓచోట చూపు నిలిచిపోయింది… ఓ పిచ్చి కథ… చదవగానే కోపం వచ్చింది… పురాణాలను ఎవరికివారు ఇలా ఇష్టానుసారం మార్చేయడం దేనికి..? ప్రత్యేకించి వేల ఏళ్లుగా పూజించబడుతున్న పవిత్రగ్రంథాలకు సంబంధించి ఏం రాయాలన్నా, వాటిని విశ్వసించేవారి ఫీలింగ్స్ పరిగణనలోకి తీసుకోవాలి కదా అనిపించింది…

కానీ మళ్లీ మళ్లీ చదివితే… వింతగా ఉన్నా సరే, మూర్ఖపు క్రియేటివిటీ, చిత్తపైత్యంలా అనిపిస్తున్నా సరే… ఆయా పురాణ పాత్రల గొప్పతనాల్ని ఎలివేట్ చేస్తున్నట్టుగానే ఉంది… ఆ పాత్రలు ఒకరికొకరు కించపరుచుకున్నట్టుగా ఏమీ లేదు… (మరీ విజయేంద్ర ప్రసాదుడి ఆర్ఆర్ఆర్ మార్క్ అల్లూరి, కుమ్రం కథల వక్రీకరణల వికారంలా ఏమీలేదు…)  ముందుగా ఆ కథ చదవండి…

Ads

‘‘ఇది రామాయణంలోని కథ… సీత జాడ తెలిసిన రాముడు లంక వైపు వానరసైన్యంతో కలిసి బయల్దేరతాడు… ఈ దేశపు చిట్టచివరి దక్షిణ భూభాగం రామేశ్వరం చేరతాడు… అక్కడి నుంచి ఇక లంకకు వెళ్లాలి, రావణుడి పీచమణచాలి, సీతను వెనక్కి తీసుకురావాలి… ఇదీ లక్ష్యం…

అంగదుడి దౌత్యం అప్పటికే విఫలమైంది… ఇక యుద్ధమే శరణ్యం… ఆ సమరారంభానికి ముందు విజయసాధనకు శివుడి సాయం కోరుతూ ఓ హోమం చేయాలని రాముడి సంకల్పం… తను సాక్షాత్తూ విష్ణు అవతారమే అయినా శివుడి సాయం కోరడం కీలక దైవిక శక్తుల సయోధ్యకు చిహ్నం…

హోమ ఏర్పాట్లు చకచకా పూర్తయ్యాయి… కానీ ఒక్క లోటు… ఆ హోమం చేయించే బ్రాహ్మణుడు కావాలి… అక్కడున్నవాళ్లలో ఎవరూ బ్రాహ్మణులు లేరు… రాముడు క్షత్రియుడు, పైగా తను హోమ కర్త… లక్ష్మణుడూ క్షత్రియ సోదరుడే… కోవర్టు విభీషణుడు బ్రాహ్మణుడే గానీ హోమాలు చేయించగల సకల శాస్త్ర పారంగతుడు కాదు…

జాంబవంతుడు మినహా మిగతా వాళ్లంతా వానరులే… మరెలా..? ఎగువన మధురై వైపు వెళ్లి తీసుకురావడంకన్నా లంకకు వెళ్లి బ్రాహ్మణుడిని తీసుకురావడమే దగ్గర… కానీ లంక నుంచి వచ్చేదెవరు..? అప్పుడు రాముడు ఓ విచిత్ర, నమ్మలేని నిర్ణయం తీసుకుని హనుమంతుడిని పిలుస్తాడు…

‘హనుమా, మనకు పెద్దగా సమయం లేదు, నువ్వు లంకకు గతంలోలాగే వెళ్లు, రావణుడిని కలువు, మన అవసరం చెప్పి, ఎవరినైనా పంపించమని అడుగు, ఎవరూ రాకపోతే తననే రమ్మను…’ ఈ మాటలు విని వానరముఖ్యులు నిర్ఘాంతపోతారు… రాముడికి అసలు ఏమైంది అని విభ్రమతో చూస్తుంటారు…

హనుమంతుడు సిద్ధపడిపోతాడు… అంతే, రాముడు చెబితే ఏ పనైనా సరే చేసేయడమే… నిజమైన అనుచరుడు… హనుమంతుడు ఏ వార్త తీసుకొస్తాడోనని అందరిలోనూ ఉత్కంఠ… ఎందుకంటే..? నిన్ను చంపే పని మీద వస్తున్నాను, కాస్త ఈ హోమం చేసి పెట్టి, మా విజయానికి తోడ్పడు అని శత్రువునే అడగడం ఏమిటి..? రావణుడు ఏమంటాడు..? హనుమంతుడు మళ్లీ తిరిగి వస్తాడా అసలు..?

రావణుడు ఆ కోరిక వినగానే ఎలా స్పందించాడో తెలుసా..? రాముడి ఆహ్వానాన్ని మన్నిస్తున్నాను, వస్తాను, హోమం చేయిస్తాను అని చెప్పు… శివుడి పూజ ఎక్కడ, ఎవరు, ఎలా చేసినా సరే నాకు ఆనందదాయకం… ప్రపంచంలోకెల్లా శివుడికి ఆదర్శభక్తుడిని నేను… ఆ శివపూజ నన్నే చేయమంటే నేనెలా కాదనగలను..? అది శివధిక్కారం అవుతుంది అంటాడు హనుమంతుడితో… అదీ రావణుడు అంటే…

సకల శాస్త్రాలూ క్షుణ్నంగా తెలిసినవాడు… ఆ మాటల్లో తన శివభక్తి స్థాయినే కాదు, తన పర్వతమెత్తు వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాడు… అది తెలుసు కాబట్టే… రాముడు ‘‘ఎవరినీ పంపించకపోతే రావణుడిని తననే రమ్మను’’ అన్నది అందుకే…

హనుమంతుడితో కలిసి హోమ ప్రాంగణం వద్దకు రావణుడు వస్తాడు… ‘‘రామా, ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి… నీ శివహోమ సంకల్పమూ గొప్పదే… కానీ నువ్వు ఈ హోమకర్తగా అనర్హుడివి’’ అంటాడు… అందరూ విస్తుపోయి చూస్తుంటే ‘‘సతి లేకుండా హోమం ఎలా చేస్తావు..? నీ సతి నా రాజ్యంలో ఉంది’’ అంటాడు రావణుడు…

అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం… అందరి మొహాలూ ఉద్వేగరహితం అయిపోతాయి… చిక్కు ప్రశ్న,.. ఏ సీత కోసం వచ్చామో, ఏ సీత కోసం యుద్ధం చేయాలో ఆమె లంకలో ఉంది, ఆమెను ఎత్తుకుపోయినవాడు, ఆ రాజ్యానికి ప్రభువు హోమం చేయిస్తాను, నీ సీతను తెచ్చుకో అంటాడు… సీతను అలా తెచ్చుకోగలిగితే ఇక హోమం దేనికి..? యుద్ధం దేనికి..?

రాముడు అంటాడు… ‘‘రావణా, పరిష్కారం కోసం కూడా నువ్వే చెప్పు… నువ్వు ఎంత గొప్ప పండితుడివో నాకు తెలుసు… నువ్వు చెప్పగలవు… శివుడికి ప్రీతిపాత్రమైన హోమం జరగడానికి నువ్వేమైనా చేయగలవు’’… రావణుడు ఏమీ మాట్లాడలేని స్థితిలో పడిపోతాడు ఆ మాటలతో…

‘‘రామా, ఓ పనిచేస్తాను, హోమం జరిగే స్వల్పకాలానికి సీతను ఇక్కడికి రప్పిస్తాను, మళ్లీ తీసుకెళ్తాను, సరేనంటే చెప్పు’’ అంటాడు… అసలు ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు…

రాముడు సరేనంటాడు… రావణుడు త్రిజటతో సహా సీతను రప్పించి, హోమం జరిపిస్తాడు… ఇక తిరిగి వెళ్లిపోవాలి… రావణుడికి ఆపిన రాముడు నీ సంభావన ఎంత అనడుగుతాడు… అంటే ఇక్కడ తను శత్రువు కాదు, ఓ రాజ్యం ప్రభువు కాదు, ఓ సగటు బ్రాహ్మణుడు… అంతే…

మళ్లీ మొత్తం వానరయోధులు నిశ్చేష్టులైపోతారు… నిజంగానే రావణుడు ఓ వంద వరహాలు అడిగితే, రాముడు ఇస్తాడు సరే, సంభావన అనంతరం హోమాన్ని చేయించిన సదరు బ్రాహ్మణ శ్రేష్టుడికి పాదాభివందనం చేస్తాడా..? అసలు ఆ దృశ్యం ఊహించగలమా..? ఇదీ మరో చిక్కుప్రశ్న…

రావణుడి అహం తెలిసే రాముడు ఆ ప్రశ్న అడిగాడు… రావణుడు సంభావన స్వీకరణకు నిరాకరిస్తాడని తెలుసు కాబట్టే అడిగాడు… రావణుడిలోని అహం ఊరుకోదు కదా… ‘‘రామా, నేను ఎవరికైనా ఇచ్చేవాడినే గానీ, ఎవరి నుంచీ తీసుకునేవాడిని కాదు…

కానీ సంభావన లేనిదే హోమం పూర్తిగా పూర్తయినట్టు కాదు కదా… ఒకవేళ నిజంగానే నీ చేతుల్లో నేను మరణించే పక్షంలో… నా మరణసమయంలో నువ్వు నా పక్కనే నిలబడి ఉండాలి… అదీ నా సంభావన’’ ఇదేం కోరిక..? మళ్లీ అక్కడ గాలి స్తంభించిపోతుంది… అందరి బుర్రలూ పనిచేయడం మానేస్తాయి…

రావణుడు తన శత్రువుగా, తనను చంపడానికి వచ్చే రాముడిని… తన మరణవేళ పక్కన నిలబడి అని అడగడం ఏమిటి..? అందులోనే ఓ మర్మం ఉంది… విష్ణువు ద్వారపాలకులైన జయవిజయులు శాపవశాత్తూ వివిధ జన్మలు ఎత్తడం, వైరభక్తితో విష్ణు వ్యతిరేకులుగా వ్యవహరించడం, చివరకు విష్ణు అవతారాల్లో హతమారి, చివరకు విష్ణు సన్నిధిని చేరే కథ తెలిసిన వాళ్లకు… రావణుడి కోరికలో ఔచిత్యం, ఆర్ద్రత, ఆ కోరిక విలువ అర్థమవుతాయి…

‘‘నా పక్కనే ఉండి, నాకు ఈ జన్మ నుంచి ఇక సాయుజ్యం ప్రసాదించు స్వామీ’’ అని రాముడిని పరోక్షంగా అర్థిస్తున్నాడు తను… నిర్వాణం, ముక్తి, మోక్షం పేరు ఏదైనా సరే, తిరిగి వైకుంఠం చేరడం రావణుడిలోని అసలైన విష్ణు ద్వారపాలకుడి తహతహ… రాముడు చిరునవ్వు నవ్వుతాడు, రావణుడు లంక వైపు అడుగులు వేస్తాడు…’’

చదువుతుంటే ఓ పిచ్చి కథలా అనిపించినా… నాన్సెన్స్ అనిపించినా… రాముడు, రావణుడు రామాయణంలోని తమ పాత్రల్ని గొప్పగా ఆవిష్కరించుకున్నట్టుగానే ఉంది… రావణుడిలోని గొప్పతనాన్ని రాముడు గుర్తిస్తాడు… రాముడిలోని దైవత్వాన్ని రావణుడు అంగీకరిస్తాడు…

తమ అవతారాల లక్ష్యమేమిటో ఒక్కసారి మననం చేసుకుంటారు… కథ స్థూలంగా చదివితే అర్థరాహిత్యం… కాస్త లోతుగా వెళ్తే అనంతార్థం… అంతే…!!

(నిజానికి రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి, తనను వధించిన బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికి, అయోధ్య తిరుగు ప్రయాణంలో, ఆ రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్టించాలని సంకల్పించి, కైలాస పర్వతం నుంచి లింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని పంపిస్తాడు రాముడు… అదంతా వేరే కథ…!!

ఇక్కడ ప్రశ్న ఏమిటంటే… ఈ కథ గురించే కాదు, అసలు కోరా వంటి విస్తృత పాఠకాదరణ ఉన్న పబ్లిక్ డొమయిన్‌లో ఎవరైనా ఏమైనా రాసుకోవచ్చా..? ఎడిటింగ్, రివ్యూ వంటివేమీ అవసరం లేదా..?)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions