Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ వార్త రాయాల్సి వచ్చినందుకు బాధ… ఓ స్టుపిడ్ రూల్ ఓ ప్రాణం మింగింది…

February 29, 2024 by M S R

ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య.. అదిలాబాద్ జిల్లా: ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటు చేసుకుంది. మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివ కుమార్ అనే విద్యార్థి  గురువారం సాత్నాల ప్రాజెక్ట్ డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష రాయలేక పోయాననే మనో వేదనతో చనిపోతున్నట్లు తన తండ్రికి సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

నిజానికి ఈ వార్త అబద్ధం కావాలని కోరుకున్నాను… ఓ దిక్కుమాలిన నిబంధన కారణంగా ఓ విద్యార్థి ప్రాణం పోయి ఉండకూడదనే కోరుకున్నాను… ఈ వార్త రాయాల్సిన అవసరం రావద్దనే కోరుకున్నాను… అన్ని పరీక్షల్లోనూ పాటించబడుతున్న ఈ నిబంధన గురించి రేవంత్ రెడ్డికి ఎవరైనా చెప్పారో లేదో తెలియదు గానీ… సత్పరిపాలన అంటే పాత ప్రభుత్వాల తప్పిదాల దిద్దుబాటు కూడా… తలతిక్క పాత నిర్ణయాలకు హేతుబద్ధమైన సవరణ కూడా… సున్నితమైన విద్యార్థుల మనస్సులపై పడే ఒత్తిడి మామూలుగా ఉండదు… ఎప్పుడో వైఎస్ హయాంలో ప్రారంభమైన ఈ నిబంధనను పెద్ద పెద్ద విద్యావేత్తలు, ఐఏఎస్‌లు గుడ్డిగా కొనసాగిస్తూ పోయారు తప్ప, అది అభ్యర్థులు, విద్యార్థులకు ఎంతటి సమస్యల్ని తెచ్చిపెడుతుందో గుర్తించలేకపోయారు…

సీనియర్ జర్నలిస్టు Bhandaru Srinivas Rao… గతంలో ఎంసెట్ సందర్భంగా రాసిన ఓ వ్యాసం సందర్భసహితం… చదవాలి ఒకసారి…

Ads

one minute



నిమిషము అనగా ఏడాది – భండారు శ్రీనివాసరావు

నిమిషము అనగా ఏడాది.

ఇదేం లెక్క అంటారా? పరీక్షలు నిర్వహించే వారి లెక్కలు ఇలాగే వుంటాయి.

‘ఒక్క నిమిషం ఆలస్యం అయినా సరే పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదు’

ఎం సెట్ పరీక్షలకు ముందు టీవీల్లో ఈ స్క్రోలింగు చకచకా పరిగెత్తుతూ పరీక్షార్దుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తూ వుంటుంది. ఎం సెట్ ఒక్కటే కాదు ఏ సెట్టయినా ఇదొక ఆనవాయితీగా మారిపోయింది.

ఏదో సబబైన కారణం వుండి నిమిషం ఆలస్యం అయి పరీక్ష హాల్లో ప్రవేశించలేని వాళ్ళు మళ్ళీ పరీక్ష రాయాలంటే ఒక ఏడాది నిరీక్షించాలి. పైగా ఈ ‘సెట్ల’ కు సప్లిమెంటరీలు కూడా వుండవు, మార్చి తప్పితే సెప్టెంబరు ఉందిలే అనుకోవడానికి. ఏకంగా ఏడాది ఆగాల్సిందే. అందుకే చెప్పింది, నిమిషం అంటే ఏడాది అని.

పరీక్షలు అనేవి రాసే పిల్లలకే కాదు, వాళ్ళ తలితండ్రుల పాలిట కూడా విషమ పరీక్షలే. ఆ పరీక్షలే పెద్ద పరీక్ష అనుకుంటే పరీక్ష రాయడం, రాయించడం మరో పరీక్షగా పరిణమిస్తోంది. రాసే పరీక్షకు సిద్ధం అవడం ఒక పరీక్ష అయితే, ఆ పరీక్ష రాయడానికి చదువుతో నిమిత్తం లేని అదనపు కసరత్తులు కొన్ని చేయాల్సివస్తోంది.

ముందు హాలు టిక్కెట్టు వస్తుందో లేదో అన్న ఆందోళన. వచ్చిన తరువాత అది సరిగా వుందో లేదో అని సరి చూసుకోవడం, అచ్చు తప్పులు వుంటే అదో మనాది. అది బాగుంటే, రాయాల్సిన పరీక్షాకేంద్రం ఆనుపానులు కనుక్కోవడానికి దుర్భిణీ వేసి వెతుకులాడడం. హైదరాబాదువంటి మహానగరాల్లో వాటి అడ్రసులు కనుక్కోవడంలోనే తలప్రాణం తోకకు వస్తుంది. ఎలాగో అలా కనుక్కుని వెడితే ఇది కాదు మరో చోటికి పొమ్మంటారు. అది వెతుక్కుని వెళ్ళేలోగా పుణ్యకాలం ముంచుకు వస్తుంది. ‘నిమిషం నిబంధన’ నెత్తి మీది కత్తిలా వేలాడుతుంటుంది. ఆ ఆందోళన బుర్రల్ని నిరామయం చేస్తుంది. ఇన్నాళ్ళు చదివింది పూజ్యంగా మారి, సమయానికి అక్కరకు రాని కర్ణుడి విలువిద్యను గుర్తుకు తెస్తుంది.

ఈ విషయంలో ఒక అధికారి ఇచ్చిన వివరణ ఇలా వుంది.

“పోటీ పరీక్షల్లో ప్రతి నిమిషం అమూల్యమైంది. ఒక్క మార్కుతో వందల ర్యాంకులు తేడా వచ్చే అవకాశం వుంది. రైలు ప్రయాణాలు చేసేవాళ్ళు రైలు సమయానికి రాదని ఖచ్చితంగా తెలిసినా, ఎందుకయినా మంచిదని ముందుగానే స్టేషనుకు వెడతారు. అలాగే విమానాల్లో వెళ్ళే వాళ్ళు నిబంధనల ప్రకారమే కొన్ని గంటలు ముందుగా వెళ్లి నిరీక్షిస్తారు. ఇక సినిమాలకు వెళ్ళేవాళ్ళు సరే సరి. టైటిల్స్ నుంచి చూడాలనే కోరికతో నానా ఇబ్బందులు పడయినా సరే సినిమా హాలుకు ఒకింత ముందుగా చేరుకుంటారు. మరి తమ భవిష్యత్తుకు కీలకమైన పరీక్షలకు సకాలంలో చేరుకోవాలని నిబంధన పెడితే ఇన్ని విమర్శలు అవసరమా?”

ఆ అధికారి చెప్పింది వినడానికి సబబుగానే వుంది.

test

నిజమే! పరీక్ష అనే కాదు, ఏ విషయంలోనయినా క్రమశిక్షణ అవసరమే. సమయపాలన మరింత ముఖ్యమే. చిన్నతనంలోనే ఈ రెంటికీ సరయిన పునాదులు పడడం అభిలషణీయమే. ఈ దిశగా అధికారులు కానీ, వారిని పర్యవేక్షించే ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవడం కూడా అవశ్యమే. కాదనలేని సంగతే. అయితే కొండ నాలుకకు మందు వేసే క్రమంలో వున్న నాలుక ఊడిపోకూడదు. ఇలా హితోక్తులు పలికేవాళ్ళు, తమ మార్గానికి అడ్డం వస్తున్నారని, మార్పుకి వ్యతిరేకులని అనుకోరాదు.

ఎంసెట్ అనేది చదువుకునే పిల్లలకు, వారి తలితండ్రులకి ఒక అపూర్వమైన ఘట్టం. ఈ పరీక్షే తమ భవితను నిర్దేశిస్తుందని నమ్మేవారు కోకొల్లలు. వారిలోని ఈ నమ్మకమే ప్రైవేటు విద్యా సంస్థలకు కల్పతరువుగా మారుతోంది. కోట్ల రూపాయలు కురిపించే కామధేనువుగా తయారవుతోంది.

అయితే ఒక విషయం గమనంలో వుంచుకోవాలి. ఈ పరీక్షలు రాసేవాళ్ళు జీవితంలో ఢక్కామొక్కీలు తిన్న బాపతు కాదు. లేలేత ప్రాయంలో వున్నవాళ్ళు. ఎటువంటి ఎదురుదెబ్బలను అయినా తట్టుకోగల మానసిక నిబ్బరం ఈ వయస్సులో వారికి వుండదు. తమ బతుకు బాట మార్చే పరీక్ష రాసే అవకాశం చేజారి పోయిందన్నప్పుడు వారికి కలిగే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. బస్సు తప్పిపోయో, అడ్రసు దొరక్కనో, వారి చేతిలో లేని వేరే ఏదయినా కారణం చేతనో, నిమిషం ఆలస్యం అయిందన్న ఒకే ఒక్క కారణం తమ జీవిత ధ్యేయానికి తూట్లు పొడుస్తుంటే వారికి కలిగే వేదనను అర్ధం చేసుకోవడానికి సైకియాట్రిస్టులు కానవసరం లేదు.

కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే అసలు ఈ నిమిషం నిబంధన ఎంత అర్ధరహితమో అన్నది అర్ధం అవుతుంది.

నిమిషం కూడా లేటు కాకూడదు అంటున్నారు సరే! అది ఏ లెక్క ప్రకారం? పరీక్ష రాసే అభ్యర్ధి పెట్టుకున్న గడియారం ప్రకారమా? గేటు కాపలాదారుడి చేతికి వున్న వాచీ ప్రకారమా? పరీక్ష హాల్లో పర్యవేక్షణ చేసే అధికారుల గడియారాల ప్రకారమా? నిమిషం ఆలస్యాన్ని నిర్ధారించడానికి ఏది ప్రామాణికం? ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒక సమయం చూపెట్టవని అంటారు. అలాంటప్పుడు నిమిషం ఆలస్యం అయిందా లేదా అనే విషయం ఎవరు నిర్ణయించాలి? ఎవరు నిర్ధారించాలి? అసలు ఈ నిమిషం నిబంధన ఏ ప్రాతిపదిక పైన విధించారు? అనే ప్రశ్నకు కూడా సమాధానం కావాల్సివుంది.

ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలస్యం అనేది తమ హక్కుగా పరిగణిస్తున్నప్పుడు, ఒక్క నిమిషం ఆలస్యాన్ని కూడా ఉపేక్షించేది లేదు అనే ఈ వైఖరిని ఒక్క పరీక్షార్ధుల పట్ల మాత్రమే ఎందుకు వర్తింప చేస్తున్నారు? ఇది ఏమేరకు సమంజసం?

అధికారులు సమయానికి ఆఫీసులకి రారు. వారికోసం వచ్చిన వారికి, వెయిట్ చేయండి, సారు వచ్చే టైం అయింది అనే జవాబు సిద్ధంగా వుంటుంది. గంటలు గడిచి పోతున్నా ఆ నిమిషం అనేది ఎప్పటికీ రాదు. అదేమని అడిగే హక్కు ఎవరికీ వుండదు. మంత్రులు, ముఖ్యమంత్రుల కోసం సరైన సమయానికి ఎగరాల్సిన విమానాలు ఆగిపోతాయి. బయలుదేరాల్సిన రైళ్ళు నిలిచిపోతాయి. ఎందుకు ఆలస్యం అని అడిగేవాళ్ళు వుండరు.

ఎవరూ ఎప్పుడూ పాటించని సమయ పాలన అనే నిబంధనను లేలేత ప్రాయంలోని విద్యార్ధుల పట్లనే ఇంత నిర్దయగా ఎందుకు అమలు చేస్తారు అన్నదే జవాబు దొరకని ప్రశ్న. ఒక్క నిమిషంలో పుట్టేమీ మునగదు అంటూ నీతి సూక్తాలు వల్లె వేసే వాళ్ళే ఈ నిమిషం నిబంధన పట్ల గంభీర ప్రకటనలు చేస్తూ వుండడం విడ్డూరం… ((Published in Andhra Prabha on 17-07-2022 Sunday))

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions