బాల్యంలో కిడ్నాప్ కు గురయ్యాడు… 22 ఏళ్లు కనిపించకుండా పోయాడు. ఇక తిరిగి రాడని… తమ బిడ్డ లేడని ఆ కుటుంబం శోకసంద్రమైంది. కానీ, మనిషికి దేవుడిచ్చిన ఓ వరం.. మరుపు! అలా కాలంతో పాటే… మానవ సహజంగా మర్చిపోయారు… అప్పుడప్పుడూ గుర్తుకొచ్చి ఆందోళన కనిపించినా.. చేసేదేమీలేదని తమకు తాము సర్ది చెప్పుకుని బతుకుతున్న ఆ కుటుంబానికి ఓ ఊహించని పరిణామమెదురైంది. అదే, తమ కొడుకు 22 ఏళ్ల తర్వాత… 29 ఏళ్ల వయస్సులో తిరిగిరావడం. మానవ జీవితంలో పేగుబంధాల మధ్య ఉండే తడితో మనసును తాకే కథ ఇది.. అలాగే, ఊహించని పరిణామాలెదురైనప్పుడు కలిగే అనుభూతిని కళ్లకు కట్టే కథనమిది.
అది 2003.. ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పూర్ జిల్లా బహదూర్ పూర్ నుంచి సుమారు 7 ఏళ్ల వయస్సులో అమిత్ కుమార్ అనే బాలుడు కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు తల్లడిల్లారు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కి దిగని రోజు లేదు. కానీ, బాలుడి ఆచూకీ మాత్రం లభించలేదు. కానీ, ఆ ఏడేళ్ల వయస్సులోనే అమిత్ కుమార్ ముంబైలోని రైల్వే ఫ్లాట్ ఫామ్ పై ప్రత్యక్షమయ్యాడు. కిడ్నాప్ చేసిన దుండగులు వదిలివెళ్లారో.. లేక, అమిత్ కుమారే తెలియక ఏదైనా రైలెక్కి ముంబైకి చేరుకున్నాడో కూడా అంత చిన్నప్పుడు జరిగిన ఘటన ఇప్పుడు అమిత్ కూ గుర్తు లేదు.. ఆ ఘటన తాలూకు విషయాలెవ్వరికీ కనీసం తెలియదు.
అలా రైల్వే ఫ్లాట్ ఫామ్ పైనే అమిత్ మూడు, నాల్గురోజులు గడిపాక.. అక్కడి రైల్వే పోలీసులు వివరాలడిగి తెలుసుకునే యత్నం చేశారు. ఆ పసితనంలో అమిత్ ఏం చెప్పాడో.. పోలీసులకు ఏమర్థమైందోగానీ… కట్ చేస్తే అమిత్ ను ఢిల్లీ ట్రైన్ ఎక్కించారు. అలా ఢిల్లీ రైల్వే స్టేషన్ కు మారింది అమిత్ ఠికాణా. అలా ఢిల్లీకి చేరుకున్న అమిత్ పొట్ట నింపుకునేందుకు.. దేశ రాజధానిలో భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తరువాత ఢిల్లీ పోలీసులు ఒంటరిగా తిరుగుతున్న అమిత్ ను పరిశీలించి.. వివరాలడిగి తెలుసుకున్నారు. కానీ, అమిత్ చెప్పలేకపోయాడేమో మొత్తంగా అమిత్ ఊరి పేరును కనుక్కోలేకపోయిన ఢిల్లీ పోలీస్ సైతం.. అతణ్ని ఢిల్లీలోని ఓ అనాథ శరణాలయానికి చేర్చారు. అలా అమిత్ పదో తరగతి వరకు అక్కడే ఉండి చదువుకున్నాడు.
Ads
కానీ, నాల్గు రోజులు ముంబైలో ఉన్నప్పుడైనా… ఢిల్లీలో భిక్షాటన చేసే క్రమంలోనైనా… తల్లిదండ్రులుండీ, అనాథగా మారి శరణాలయంలో ఉన్నప్పుడైనా… అమిత్ ను అమితమైన ప్రేమతో పెంచిన తన తల్లిదండ్రుల జ్ఞాపకాలు వెంటాడసాగాయి. తన ఇంటివద్ద తన బాల్య స్మృతులు తనకు నిద్రలేని రాత్రులను మిగిల్చాయి. కానీ, ఆ బాల్యంలో మసక మసక గుర్తుల వల్ల తన ఊరిని చేరుకోలేకపోయాడు. అయితే, సహరన్ పూర్ జిల్లాలోని బాలాచోర్.. ముజఫర్‌నగర్ జిల్లాలోని ఘుమావతి అనే రెండు గ్రామాల పేర్లు మాత్రం ఏదో చూచాయగా అమిత్ ను వెంటాడసాగాయి.
తన గ్రామంలో బెల్లం తయారీ యూనిట్స్, ఎద్దుల బండ్లు ఇలా అన్నీ ఒక్కొక్కటిగా తెరలు తెరలుగా తన మదిలోకొచ్చేవి. కానీ, ఆ గ్రామాల్లో తన తల్లిదండ్రులెక్కడ ఉన్నారు.. అసులుండి ఉంటారా అన్న అనుమానాలోవైపు.. తనను వెంటాడుతున్న జ్ఞాపకాలోవైపు ఇలా సాగింది ఊరు కాని ఊర్లో… ఓ మెట్రోపాలిటన్ సిటీలో.. ఏకంగా దేశ రాజధానిలో అమిత్ లైఫ్ జర్నీ.
18 ఏళ్ల వయస్సులో అమిత్ ఘజియాబాద్ లోని పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఓ షెల్టర్ హోమ్ లో పనికి కుదిరాడు. అక్కడే, అమిత్ కు మానవ అక్రమ రవాణా నిరోధక శాఖలో సబ్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న రాజేశ్ తో పరిచయమేర్పడింది. అలా రాజేశ్ పరిచయం.. అమిత్ ను 22 ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రుల వద్దకు చేర్చింది.
హృదయాన్ని మెలిపెట్టే అమిత్ కథలో.. మరి రాజేశ్ చేసిన సాయమేంటి..?
అమిత్ కథ విన్న రాజేశ్ కు.. హృదయం చలించిపోయింది. ఎలాగైనా అమిత్ కు సాయం చేయాలన్న సంకల్పం దావానంలా నరనరాన వ్యాపించిపోయింది. రాజేశ్ కు అమిత్ తన ఊరి పేరు బాలాచౌక్ అయ్యుండొచ్చని చెప్పాడు. రాజేశ్ తన డ్యూటీలో భాగం కాకపోయినా.. తనకున్న పరిచయాలు, తనకున్న అధికార పరిధితో.. అమిత్ గ్రామాన్ని కనిపెట్టేందుకు.. ఆ ఊళ్లో అమిత్ తల్లిదండ్రులను కనిపెట్టేందుకు గాలింపు ప్రారంభించాడు. కానీ, కరెక్ట్ అడ్రస్ దొరక్క అది రాజేశ్ కు కూడా ఓ సవాల్ గా మారింది.
బాలాచోర్ బదులు బాలాచౌక్ అని చెప్పాడేమోనని ఒకింత అనుమానం వచ్చిన సబ్ ఇన్స్ పెక్టర్ రాజేశ్.. బాలాచోర్ లో కూడా ముమ్మురమైన గాలింపు చేపట్టాడు. అయినా ఆచూకీ దొరకలేదు. దాంతో అమిత్ కుటుంబీకులను పట్టుకోవడం గగన గండమైపోయింది. అమిత్ చెప్పిన వివరాల ప్రకారం పెద్దగా ఎడ్ల బండ్లు, బెల్లం తయారీ యూనిట్స్ ఏవీ కూడా అటు బాలాచౌక్ లో గానీ… ఇటు బాలాచోర్ లో గానీ కనిపించలేదు. ఉత్తరప్రదేశ్ లోని పశ్చిమ భాగంలో అమిత్ చెప్పిన ఆనవాళ్లైతే ఉంటాయన్న ఓ చిన్న నమ్మకంతో.. సబ్ ఇన్స్ పెక్టర్ రాజేశ్… ముజఫర్ నగర్ జిల్లాలోకి అడుగుపెట్టాడు. అదిగో అక్కడే అమిత్ తల్లిని గుర్తించాడు.
ఈ నెల మే19. 2024న అమిత్ తో కలిసి రాజేశ్… ముజఫర్ నగర్ జిల్లాలోని ఘుమావతికి చేరుకున్నాడు. ఒక్కసారిగా తన కొడుకును తీసుకొచ్చానన్న రాజేశ్ మాటలను ముందు అమిత్ తల్లి నమ్మలేకపోయింది. నిశ్ఛేష్ఠురాలైపోయింది. ఓవైపు కళ్ల నుంచి ఆనందభాష్పాలు ధారై ప్రవహిస్తుంటే.. కొడుకును ఒక్కసారిగా ఆప్యాయంగా అమాంతం కౌగిలించుకున్న ఆ అమ్మ అనుభూతి… ఏకంగా 22 ఏళ్లు అమ్మకు దూరమైన ఆ కొడుకు అనుభవం రెండూ ఒకే దృశ్యంలో సాక్షాత్కారమయ్యాయి. చూసేవాళ్ల కళ్లూ ఒకింత ద్రవించాయి. ఆరోజు ఘుమావతిలోని అమిత్ ఇల్లు… అతణ్ని చూసేందుకు వచ్చే స్థానికులతో ఓ పర్యాటక కేంద్రమైపోయింది.
రాజేశ్ సారుకు కృతజ్ఞతలు చెప్పడానికి నాదగ్గరగానీ… నా కుటుంబం దగ్గరగానీ.. మాటల్లేవంటాడు అమిత్. తన కుటుంబీకులను.. కన్న తల్లిని మళ్లీ చూస్తానో, లేదోనన్న బెంగతో… సుమారు రెండు దశాబ్దాల నుంచీ వెతుకుతున్న నాకు.. రాజేశ్ సారే దేవుడంటున్నాడు అమితమైన ఆనందంలో ఇప్పుడు అమిత్. తానిప్పుడు బాగా సంపాదిస్తూ.. తన కుటుంబానికి దూరమైన ఈ రోజుల్లో ఓ తోడు కావాలన్న ఉద్ధేశ్యంతో పెళ్లి చేసుకుందామనుకున్నాను. కానీ, ఇప్పుడు నా ప్రాధాన్యాలు మారాయి. అందుకే నిర్ణయమూ మారింది. ముందు మా పాత ఇంటిని బాగు చేసుకుంటాను. నా తమ్ముడిని బాగా చదివించాలనుకుంటున్నానంటూ మారిన తన అభిప్రాయాలనూ షేర్ చేసుకున్నాడు అమిత్.
అమిత్ తల్లిదండ్రులు సునీతాదేవీ, జగ్గూసింగ్… 22 ఏళ్ల క్రితమే విడిపోయారు. దాంతో అమిత్ తన తల్లి, తాతతో కలిసి సహరాన్ పూర్ జిల్లాలోని బాలాచోర్ లో కొంతకాలం గడిపాడు. అదే సమయంలో, సునీతాదేవికి ఆమె తల్లిదండ్రులు ఘుమావతిలోని మరో వ్యక్తితో పెళ్లి చేశారు. ఆ క్రమంలో అమిత్ తండ్రి జగ్గూసింగ్ అతణ్ని సహరాన్ పూర్ జిల్లాలోని బహదూర్ పూర్ కు తీసుకెళ్లాడు. అదిగో అక్కడే అమిత్ తన ఏడేళ్ల బాల్యంలో కిడ్నాప్ కు గురై.. సుమారు 22 ఏళ్ల పాటు అందరూ ఉన్నా వారిని చేరుకోలేని ఓ అనాథలా బతికాడు.
కుటుంబం మొత్తం అమిత్ ఆచూకీ తెలియక రెండు దశాబ్దాలు గడిచిన క్రమంలో ఆశలు వదులుకున్నారు. కానీ, అమిత్ తల్లి సునీతాదేవి మాత్రం అమిత్ పై ఆశలు వదులుకోలేదు కదా.. తన కళ్లల్లో వేయి వత్తులు వేసుకుని తప్పిపోయిన కొడుకు ఏనాటికైనా తిరిగివస్తాడన్న చిరు ఆశతో నిరీక్షించసాగింది. అయితే, ఆ నిరీక్షణ సబ్ ఇన్స్ పెక్టర్ రాజేశ్ రూపంలో 22 ఏళ్ల తర్వాత నిజమైంది. ఇంతకాలం తల్లి ప్రేమకు దూరమైన అమిత్.. తన కోసం వేయి వత్తులు వేసుకుని ఎదురుచూసిన తన అమ్మకు.. తాను వేయి ఏనుగుల బలమై పీడకలలోంచి బయటకొచ్చిన కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశిద్దాం…. (రమణ కొంటికర్ల)
Share this Article