Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జైలుకైనా వెళతా… ఇంటికి మాత్రం వెళ్లను… ఇది భారతీయ భార్య శిక్షా స్మృతి…

August 18, 2024 by M S R

జైలుకైనా వెళతా… ఇంటికి మాత్రం వెళ్లను… భారతీయ భార్య శిక్షా స్మృతి

మగవాడి కష్టం పగవాడికి కూడా రాకూడదని తెలియజెప్పే కథనమిది. “గృహహింస” అంటే వ్యుత్పత్తి ప్రకారం ఇంట్లో హింస అని. కాకపోతే గృహహింస కేసుల్లో సాధారణంగా భార్యను అత్తమామలు, భర్త వేధిస్తుండేవారు కాబట్టి ఆ మాట అనగానే మహిళలు బాధితులు అన్నంతగా అర్థవ్యాప్తి పొందింది. నిజానికి వ్యుత్పత్తిలో ఆ అర్థం లేదు. కాలం మారింది. ఇప్పుడు గృహహింసకు మగవారు కూడా గురవుతున్నారు కాబట్టి…హింసలో సమానత్వం సాధించినట్లే అనుకుని…ఒకానొక గృహహింస బాధితుడి కథలోకి వెళదాం.

ఉత్తరప్రదేశ్ లక్నోవాసి విపిన్ గుప్తాకు పెళ్లయ్యింది. దంపతులు భారత ఐ టీ కలల రాజధాని బెంగళూరు చేరారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఇద్దరు పిల్లలు పుట్టారు. హాయిగా సాగుతున్న వారి సంసార నౌకలోకి అలజడుల అలలు వచ్చి పడ్డాయి. నౌక నిలువెల్లా కంపించడం మెదలయ్యింది. భార్యలో చంద్రముఖి రెండో ముఖం తొంగి చూసేది. చిత్ర విచిత్రంగా ప్రవర్తించేది. విసుక్కునేది. నోటికొచ్చినట్లు తిట్టేది. చేతికి దొరికిందల్లా తీసుకుని దాడి చేసేది. గిచ్చేది. మీదపడి రక్కేది. శరీరంలో ఓపిక నశించినప్పుడు ఆ పూటకు వదిలిపెట్టి…మళ్లీ కాస్త ఓపిక రాగానే దాడులు మొదలుపెట్టేది. విపిన్ మానసిక శాంతిని బెంగళూరు కాకులెత్తుకుపోయాయి.

Ads

స్నేహితులకు, బంధువులకు ఎవరికీ చెప్పుకోలేక విపిన్ ఒంటరిగా బైక్ మీద రోజుల తరబడి గమ్యం సినిమాలో శర్వానంద్ వెళ్లినట్లు ఉత్తర భారత్ లో హిమాలయాల చెంత తిరిగేవాడు. భవిష్యత్తులో వెళ్లాల్సిన హిమాలయాలను ముందుగానే రెక్కీ చేసి చూసుకునేవాడేమో!

అలా ఈనెల మొదట్లో బైక్ పై ఒంటరిగా వెళ్లిన విపిన్ పదిహేను రోజులైనా తిరిగిరాకపోయేసరికి…ఎవరితో గొడవపడాలో తెలియని భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో భర్త ఆచూకీ కోసం కేసు పెట్టింది. వెళ్లే ముందు విపిన్ లక్షా ఎనభై వేలు డ్రా చేసుకుని వెళ్లినట్లు పోలీసులు కనుక్కున్నారు. సెల్ ఫోన్ వెంట ఉంటే సెల్ టవర్ ఆధారంగా భూ ప్రపంచంలో ఎక్కడున్నా పోలీసులు పట్టుకోగలరన్న కనీస స్పృహ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన విపిన్ కు ఉంది కాబట్టి ఫోన్ పక్కన పడేశాడు. టోల్ గేట్ల సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతి కష్టం మీద విపిన్ ను ఢిల్లీ పక్కన నోయిడాలో పట్టుకుని…బెంగళూరికి తీసుకొచ్చారు.

“సార్! మీ కాళ్లు పట్టుకుంటా. నా కష్టం మీకేమి తెలుసు! ఇంట్లో నా భార్య మాటలు పడలేను. ఆ దెబ్బలు తినలేను. దయచేసి నన్ను మా ఇంటికి పంపకండి. కావాలంటే జైలుకు పంపండి. నా భార్య దెబ్బలకంటే నాకు జైలే చాలా భద్రమైన చోటు. పెద్ద మనసుతో…కనీసం సాటి మగవాడిగా నా గుండె గాయాన్ని అర్థం చేసుకోండి!” అని విపిన్ పోలీసుల కాళ్లు పట్టుకుంటుంటే కఠినాత్ములైన ఖాకీ మగ పోలీసుల కళ్లల్లో కూడా నీళ్లు జలజలా కారి కావేరిలో కలుస్తున్నాయి.

“నాయనా! నీ బాధ నిజమే కావచ్చు. బొడ్లో పిస్టల్ ఉన్న మేమే మా భార్యల దాడుల నుండి కాపాడుకోలేక మా బాధలేవో మేము పడుతున్నాము. మగ పుట్టుక పుట్టాక ఇవన్నీ తప్పవు. నిన్ను జైలుకు పంపాలంటే నువ్వు నీ భార్యను కొట్టాలి. ఇప్పుడున్న సాక్ష్యాధారాలను బట్టి…నిన్ను మీ ఇంటికి పంపి…నీ భార్యకు అప్పగించడమే మా విధ్యుక్త ధర్మం. ఆపై ఆమె దయ. నీ ప్రాప్తం!” అని విపిన్ ను ఓదారుస్తున్నారు. దాడులను మౌనంగా భరించడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధం చేస్తున్నారు!

“మీ ఉత్తర భారతంలో పదాలకు వ్యుత్పత్తి అర్థం సరిగ్గా చెబుతున్నారో! లేదో! మాకు తెలియదు కానీ…మా దక్షిణ భారతంలో “భర్త” అంటే “భరించువాడు” అని స్పష్టంగా వ్యుత్పత్తి అర్థం అనాదిగా చెప్పుకుంటున్నాం. కాబట్టి నువ్ గృహ హింసను భరించాల్సిందే!” అని పోలీసులు తమ పని కాకపోయినా…భాషాశాస్త్రవేత్తలనడిగి విపిన్ కు సర్ది చెబుతున్నారు.

“ఇంటికన్నా గుడి పదిలం- గుడి కన్నా జైలు పదిలం” అన్నవి మాటవరసకు చెప్పుకునే సామెతలే తప్ప… నాకు అన్వయమయ్యే సామెతలే లేవా? అని మౌనంగా రోదిస్తున్నాడు విపిన్ ఇంటికి వెళ్లలేక. “నీ విషయంలో జైలు కన్నా ఇల్లు నరకం” అని సామెతను తిరగరాసుకోవచ్చు అని విపిన్ కు చెప్పగలిగినవాళ్లమా మనము?

ఏ పుట్టలో ఏ పాముందో? ఏ ఇంట్లో ఏ భార్య ఇలా ఉందో? ఎవరికెరుక? “భారతీయ శిక్షా స్మృతిలో భార్య విధించే శిక్షకు, పెట్టే హింసకు విస్మృతి తప్ప నిష్కృతి లేదా?” అని విపిన్ గుండె పగిలేలా రోదిస్తుంటే బెంగళూరు ఆకాశం కూడా చిల్లు పడి రోదించడం తప్ప ఏమీ చేయలేకపోతోంది!

గమనిక:- ప్రస్తుతం విపిన్ వయసు 34 ఏళ్లు. విపిన్ భార్య వివరణ మీడియాలో ఎక్కడా రాలేదు కాబట్టి…ఇది ఒకవైపు కథనంగానే పరిగణించి…ఆమె సమాధానం కోసం నిరీక్షించగలరు. ఆ ఉత్తమ ఇల్లాలి వర్షన్ కూడా విని ఒక నిర్ణయానికి రాగలరు! -పమిడికాల్వ మధుసూదన్ 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions