ఒక విద్యార్థి అనుభవం… లండన్ చదువు
“సరే! వన్ ఇయరే కదా ఏముంది? పిచ్చ లైట్” తో మొదలైన నా మాస్టర్స్ ప్రయాణం “హమ్మయ్య! మొత్తానికి వన్ ఇయర్ అయ్యింది”తో ముగిసింది . ఈ రెండు మాటల మధ్యలో జరిగిన సంఘటనలు , విశేషాలే ఇవి.
భౌతిక శాస్త్ర సూత్రాల గురించి చదివి మన విశ్వాన్ని శాసించే సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలనే తపన నాలో నిజం చెప్పాలంటే ఎన్నడూ లేదు . సాయంత్రం shuttle ఆడడం , ప్రసాద్స్ లో సినిమాలు చూడ్డం, స్నేహితులతో క్రికెట్ ఆడడం తప్ప వేరే ఇష్టాలు పెద్దగా ఏవీ లేని నాకు 11వ తరగతిలో దిమ్మ తిరిగిపోయింది .
Ads
“After tenth class your next stop for success and a secured good life is JEE!”- ఈ ఒక్క మాట జోరీగలా నన్ను వెంటాడుతూ ఉండేది . నలుగురితో నారాయణా… గుంపుతో శ్రీ చైతన్య… అదీకాకపోతే Fiitjee! అనే సింపుల్ సూత్రాన్ని గ్రహించి మూడో ఆప్షన్ని నా విద్యా భవితవ్యపు దారిదీపంగా ఎంచుకున్నాను. కట్ చేస్తే… ఏమీ అర్థం కాని అయోమయ పరిస్థితి.
I think I am a good student , I have received good grades in my school then why can’t I crack this JEE? అని ఆంగ్లంలో కూడా తెగ ఆవేదన చెందేవాడ్ని! రుద్రవీణలో చిరంజీవిలా సమాజాన్ని మార్చెయ్యాలి… ఎడ్యుకేషన్ సిస్టంని సాఫ్ చెయ్యాలి… అనుకునే నా ఆవేశం phase లో ఫిజిక్స్ మీద మక్కువ పెరిగింది . నెయిల్ డీగ్రేస్సే టీస్లోన్ అనే సుప్రసిద్ధ శాస్త్రవేత్త నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో “Cosmos a space time odyssey” అనే షో నిర్వహించారు . ఈ విశ్వానికి కూడా ఆది, అంతం ఉంటుందని; మన ప్రపంచం సాఫీగా సాగడానికి జరిగిన కోట్ల సంవత్సరాల ప్రసవ వేదన గురించి ఈ ప్రోగ్రాం ద్వారా తెలుసుకున్నాను .
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చివరిలో రేలంగి మావయ్య మంచితనాన్ని అర్థం చేసుకున్న రావు రమేష్ “ఐబాబోయ్ ఏదో అనుకున్నాను అండి కానీ మామూలు విషయం కాదు” అంటూ చిదానందుడైన మావయ్యకు దండం పెడతాడు . అదే విధంగా మనం ఉంటున్న ప్రపంచానికి ఇంత సీన్ ఉందా అనుకుని అవాక్కయ్యి ఎంతో ఉత్సాహం, అలాగే గౌరవంతో నా సొంత అన్వేషణ మొదలుపెట్టాను. ఈ గమ్యంలో నా గురువు , మిత్రుడు అన్ని ఇంటర్నెట్టే.
బిగ్ బాంగ్ ఏంటి ? బ్లాక్ హోల్స్ ఏంటి ? ఈ యూనివర్స్ ఏంటి ? అనే పెద్ద ప్రశ్నలకు జవాబులను యూట్యూబ్ లెసన్స్ లోనూ వికీపీడియా ఆర్టికల్స్ లో చదువుతూ swiggy లో సమోసా చాట్ ఆర్డర్ చేస్కుని, ఆ వేడి వేడి చాట్ ని ఆస్వాదిస్తూ ఈ భౌతిక శాస్త్ర సూత్రాల గురించి అన్వేషిస్తూ ఉండేవాడిని. ఎలాగైనా ఈ సబ్జెక్టును అర్థం చేసుకుని మన విశ్వంలోని చిత్ర విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవాలన్న నా ఆసక్తికి బీజం ఆ రోజుల్లోనే దృఢంగా పడింది.
ఇతరేతర కారణాల వల్ల బాచిలర్స్ డిగ్రీలో మెకానికల్ తీసుకున్నాను. ఆ ఇంజనీరింగ్ హాయిగా పూర్తి చేసుకున్న తర్వాత ప్రపంచంలోని వివిధ పేరుగాంచిన విశ్వవిద్యాలయాల్లో ఫిజిక్స్ లో మాస్టర్స్ కి అప్లికేషన్ పెట్టాను. సుమారు ప్రతి కాలేజీ నా విన్నపాన్ని వింత వింతగా తిరస్కరించిన తర్వాత కింగ్స్ కాలేజీ లండన్ నాకు ఒక ఏడాది గడువు ఉన్న MSc Physics కోర్సుకు పచ్చ జెండా ఊపారు. ఇదివరకు ఎన్నడూ లేని ఉత్సాహంతో బీటెక్ చదువు పూర్తి చేసుకున్న వెంటనే హుటాహుటిన లండన్ వీధుల్లో కింగ్స్ కాలేజీ గదుల్లో విహరించడానికి సిద్ధపడ్డాను .
2022 సెప్టెంబర్ 21న బయలుదేరే ముందు ఇంట్లో ఉన్న దేవుళ్లందరికి “పాస్ అయితే మీరు ఉన్నట్టు, లేకపోతే …..” అని వేడుకుని ఇంట్లో వాళ్ళకి టాటా చెప్పి పాన్- వరల్డ్ పయనానికి సిద్ధపడ్డాను . లండన్ ఎయిర్ పోర్ట్ నుండి ఒక క్యాబ్లో హాస్టల్ చేరుకున్నాను . ఆ క్యాబ్ డ్రైవర్ శ్రీలంకకు చెందినవాడు. ఆయన నన్ను నా హాస్టల్ దగ్గర దింపేవరకు అనర్గళంగా కుటుంబ విలువల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు.
అంతా కొత్తగా ఉన్న నాకు ఇంటికి టైంకి వెళ్తే చాలు అనుకుంటున్నాను. క్షేమంగా రూమ్ చేరుకున్న తర్వాత అసలు విషయం తెల్సింది . నేను బయలుదేరే ముందు ఒక వెబ్సైటు లో ఆర్డర్ ఇచ్చుకున్న సామగ్రి ఇంకా చేరలేదని . దాంట్లో నా గదికి సంబందించిన వస్తువులన్నీ ఉన్నాయి. ప్లేట్ల నుంచి దిండ్లు- దుప్పట్లవరకు అన్నీ నేను రూమ్ చేరుకున్న మరుక్షణమే నా ముందు ఉంటాయని ఆ వెబ్సైటులో చెప్పారు. అసలే చలి . దిండు లేదు దుప్పటి లేదు . అప్పుడు నా దగ్గర ఉన్న బ్యాగ్ ఖాళీ చేసి . నా దగ్గర ఉన్న వింటర్ జాకెట్లను రగ్గులుగా పేర్చుకుని , ” problem solved welcome to the UK “ అని నవ్వుకుని పడుకున్నాను.
తర్వాత మెల్లగా అన్ని పనులు సక్రమంగా అవడంతో నా కొత్త గృహానికి బానే అలవాటు పడిపోయాను. రోజూ కాలేజీకి వెళ్లడానికి రెండు ఆప్షన్స్ ఉండేవి ఒకటి అండర్గ్రౌండ్ ట్యూబ్; మరొకటి బస్సు. ఈ రెండిటి స్టేషన్స్ నా హాస్టల్ రూమ్ కు అర కిలో మీటర్ దూరంలో ఉంటాయి. లండన్లో ట్యూబ్ కి వందేళ్లకు పైబడ్డ చరిత్ర ఉంది . నా దృష్టిలో ఒక ఊరు మహానగరంగా మారడానికి కావాల్సిన ముఖ్యమైన అంశం Transport and connectivity. నగర వాసులు సుమారు 90 శాతం పనులకు ప్రభుత్వ రవాణా వ్యవస్థలను వాడడం వల్ల అంతులేని సానుకూలత ఏర్పడుతుంది .
“Bloody hell it’s almost 5 in the evening, I’ll be damned if I can hop in on the Tube today “ ఇలాంటి మాటలు కార్పొరేట్ ఉద్యోగాలు చేసే వారినుంచి కాలేజీ విద్యార్థుల వరకు అందరు అనుకునే సాధారణ మాటలే . హైదరాబాద్లో కూడా మెట్రో ఏర్పడిన తర్వాత మన వారి నోటి వెంట కూడా ఇలాంటి మాటలే వింటుంటాం. లండన్ ట్యూబ్ చాలా ఈజీ, ఎందుకంటే నాకు మా ఊళ్ళో మెట్రో అలవాటు అని ముంబై నుండి వచ్చిన ఒక స్నేహితురాలు అన్నప్పుడు బహుశా మహానగరాలన్నీ ఒక్కటేనేమో అని అనిపించింది .
లండన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బాగా అలవాటు అయిన తర్వాత ఒక రోజు ట్యూబ్ స్టేషన్ దగ్గరికి వెళ్తుండగా ఒక పెద్ద భవంతి నా కళ్ళకు చిక్కింది . ముందు ఎప్పుడు చూడలేదు కానీ ఎందుకో చాలా ఏళ్ళ నుండి ఆ భవనాన్ని టీవీలో చూశానే అనిపించింది. అప్పుడు తెల్సింది- అది జేమ్స్ బాండ్ సినిమాలలోని MI6 building అని . దెబ్బకి చిన్నప్పటినుంచి నాన్నతో సీడీలో చూసిన జేమ్స్ బాండ్ సినిమాలన్నీ గుర్తొచ్చాయి .
అదే రోజు సాయంత్రం దగ్గర్లో ఉన్న imax థియేటర్లో “60 years of James Bond “ అని skyfall సినిమా ఉందని తెలిసి… వెంటనే టిక్కెట్లు బుక్ చేసుకుని వెళ్ళాను . నాకు సినిమాలంటే పిచ్చి . పోకిరిలో మహేష్ బాబు ఖైరతాబాద్లో ఉంటాడు…నేను ఖైరతాబాద్ లోనే ఉండేవాడిని . ఇప్పుడేమో జేమ్స్ బాండ్ ఆఫీస్ నా పక్కనే ఉంది అనుకుని నేనో యాక్షన్ హీరో అనుకుని మురిసిపోయాను .
MI6 అంటే ministry of information section 6. అంతర్జాతీయ విషయాలపై నిఘా పెట్టడం… గూఢచారులను వేరు వేరు దేశాలకు పంపడం వీరి పని . అక్కడ నుంచి ఓ మైలు దూరంలో థేమ్స్ హౌస్ అనే బిల్డింగ్ కనపడింది . ఫలక్నుమా పాలస్ కు ధీటుగా ఉండేసరికి హోటల్ ఏమో అనుకున్నాను. తర్వాత తెల్సింది అది MI5 building అని . MI5 సభ్యులు దేశంలోని ఉగ్రవాదపు , తీవ్రవాదపు అంశాలపై దృష్టి పెడతారు . దీన్నే ఇంగ్లీషులో Internal Security అంటారు . ఏదో john la carre , ian flemming లాంటి రచయితల కధల్లో ఉన్నట్టు అనిపిచ్చింది.
MI6 నుండి నేరుగా ఒక దారి సుమారు సెంట్రల్ లండన్ లోని చూడదగ్గ ప్రదేశాలన్నిటిని థేమ్స్ నది ఒడ్డున cover చేస్తుంది. ఈ దారిని “Queen’s Walk” అని అంటారు . నాకు, నా మిత్రులకు లండన్ లో ఈ దారి అంటే తెగ ఇష్టం . ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా ఈ దారిలో నడుచుకుంటూ మధ్యలో బిగ్ బెన్ దగ్గర పబ్లిక్ బెంచీలమీద కూర్చుని రిలాక్స్ అయ్యేవాళ్ళము . ఇలా చుట్టూ ఉన్న ప్రదేశాలను చూసిన తర్వాత అసలు చిక్కు మొదలైంది .
Covid-19 రోజుల్లో ఆన్ లైన్లో క్లాస్ లు on లో పెట్టేసి స్ట్రీమింగ్లో ఉన్న ప్రతి సిరీస్ , సినిమాలని ఒక యజ్ఞoలా చూసిన నాకు ఇప్పుడు క్వాంటమ్ ఫీల్డ్ థియరీ క్లాస్ అనగానే వణుకు పుట్టింది . ఇలాంటి సబ్జక్ట్స్ పైన అమితమైన ఇష్టం ఉన్నా…ఫెయిల్ అవుతానేమో అనే భయమే నన్ను కుదిపేసేది . అక్టోబర్ మొదటి వారంలో క్లాసులు మొదలైయ్యాయి .
“Hello , excuse me , thank you very much , horrible weather isn’t it ? “ అనే బ్రిటీష్ సంప్రదాయ పిలుపులను పులకింతతో వాడుతూ లండన్లో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. ఇండియాలో చదువు అంటే ఒక భారం . చదువంటే ఒక బాధ్యత. అదే పాశ్చాత్య దేశంలో చదువు సాంకేతిక నైపుణ్యానికి , మానవ జిజ్ఞాసకు పునాది. అందుకే న్యూటన్ , హాకింగ్ వంటి మహామహులు బ్రిటన్ వారే అని అనుకుంటూ ఉండేవాడిని .
తీరా క్లాసులు మొదలయ్యాక తెల్సింది ఏంటంటే ఇండియా లేదు, యూకే లేదు అంతా ఒక్కటే . అసైన్మెంట్లు , ఎగ్జామ్ స్ట్రెస్ , ప్రెజెంటేషన్స్ , అటెండన్స్ లాంటివి భూమి మీద ఎక్కడ చదివినా ఒక్కటే అని క్లాసులు మొదలైన వెంటనే అర్థం చేసుకున్నాను. మొదట్లో ఇబ్బందిగా ఉన్నా తక్కువ సమయంలోనే అక్కడి చలిని , చదువుని అలవాటు చేసుకుని లండన్ నగరాన్ని ఇల్లు కాని ఇల్లుగా మలచుకున్నాను.
ఇంక అక్కడ నుంచి అందరికీ తెల్సిన ప్రయాణమే. బాగా చదవడం , ఊరుమీద దండయాత్ర చెయ్యడం , వండుకోడం ,అంట్లు తోముకోడం , డబ్బులు పొదుపుగా ఖర్చుచేయడం . హైదరాబాద్ లో ఒక వైపు అమ్మ ఇంకో వైపు swiggy ఉండడం వల్ల వంట అంటే ఏంటో కూడా తెలియని స్థితి నుంచి బెండకాయ ఫ్రై , బిర్యానీ , టమాటో రైస్ along with Quantum physics , cosmology and astrophysics చేయడంతో లైఫ్ స్కిల్స్ నేర్చుకుని తీరాలన్న అమ్మ కోరిక కొద్దిగా తీరింది. అలాగే ఫిజిక్స్ లో డిగ్రీ పొందాలన్న నా కల కూడా పూర్తయ్యింది .
సెప్టెంబర్ 2022లో మొదలైన నా ప్రయాణం సాఫీగా సెప్టెంబర్ 2023లో పూర్తయ్యింది . గ్రాడ్యుయేషన్ సెరిమోనీ కోసం అమ్మానాన్నలతో తిరిగి లండన్ వెళ్లి- నేను చూసిన వీధులు , తిరిగిన ప్రదేశాలు వాళ్లకి ఒకింత గర్వంతో చూపించి… డిగ్రీ పుచ్చుకుని… హైదరాబాద్ తిరిగి వచ్చాను.
మంచి ఉపాధి అవకాశాలు , వివక్షలేని వాతావరణం కోసమే మాతృభూమిని వదిలి లక్షల మంది అద్భుతమైన విద్యార్థులు వలస వెళ్తున్నారని నా ఏడాది ఫారిన్ చదువులో తెల్సింది . కుటుంబ ఆర్థిక పరిస్థితులను బాగుచేసుకోవడానికి వలస వెళ్లే విద్యార్థుల కష్టాలు; పొదుపు చెయ్యడానికి చదువుతో పాటు చేసే పార్ట్ టైం పనుల వల్ల ఎంతో అలిసిపోయినా… కష్టం విలువ తెలుసుకుని ఆ దేశపు జీవన శైలిలో ఒకటవుతున్నారు.
భారతదేశంలో ఉన్నప్పుడు గారాబంగా పెరిగినా… పరాయి దేశాలకు వెళ్లినప్పుడు మాత్రం ఏ పనైనా (పార్ట్ టైమ్ జాబ్స్) చేస్తూ… తల్లిదండ్రుల మీద ఉన్న అప్పుల బరువును తగ్గించడానికి అహోరాత్రాలు శ్రమిస్తున్న విద్యార్థులకు నా జోహార్లు…. – పమిడికాల్వ సుజయ్, sujaypamidikalva@gmail.com
Share this Article