కెప్టెన్ అంశుమన్ సింగ్… గత జులైలో సియాచిన్ అగ్నిప్రమాదంలో పలువురిని రక్షించి తన అమరుడైన మెడికల్ ఆఫీసర్… ప్రభుత్వం కీర్తిచక్ర ఇచ్చింది… దాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన భార్య స్మృతి సింగ్ అందుకుంది కన్నీళ్లతో… చిన్న ఏజ్‌లోనే భర్తను కోల్పోయిన ఆమె ఫోటో చూసి చిల్లర వ్యాఖ్యలకు దిగారు కొందరు నెటిజన్లు… సరే, అదొక దరిద్రం మన సమాజంలో…
సరే, ఆయన తల్లిదండ్రుల బాధ జాతీయ మీడియాలో కనిపించింది… (మన తెలుగు మీడియా ఇంకా పొలిటికల్ బురదలో పొర్లాడుతున్నదని పదే పదే మనం చెప్పుకునేదే కదా…) నిజంగా పెళ్లి తరువాత కొడుకు మీద తల్లిదండ్రులకు ఉద్వేగ రక్తబంధం తప్ప మరే ఇతర ఆర్థిక హక్కులూ ఉండవా..? ఇదీ ప్రశ్న…
Ads
NOK… next to kin… అంటే సైనికుడికి ఏమైనా అయితే పరిహారాలు గట్రా ఎవరికి ఇవ్వాలో తేల్చేది… అంటే బ్యాంకుల్లో నామినీలాగా..! సైన్యంలో జాయిన్ అయినప్పుడు తల్లిదండ్రుల పేర్లు, వాళ్లు లేకపోతే సమీప బంధువుల పేర్లు రాస్తుంటారు… తరువాత పెళ్లయితే ఆ పేర్ల స్థానంలోకి భార్య పేరు వచ్చి చేరుతుంది…
ఒక కోణంలో అది కరెక్టే… భర్తను నష్టపోయిన ఆమే అన్నిరకాల పరిహారాలకు అర్హురాలు అవుతుంది… కానీ ఇక్కడ ఈ ఇష్యూలో అంశుమన్ సింగ్ తల్లిదండ్రులు రవిప్రతాప్ సింగ్, మంజూ సింగ్ చెప్పేదేమిటంటే… ‘‘అప్పటికి పెళ్లయి అయిదు నెలలు, పిల్లల్లేరు, వాడిని కోల్పోయాం, ఇప్పుడు ఆమె మాతో ఉండటం లేదు, వెళ్లిపోయింది… కీర్తిచక్ర సహా పరిహారం తీసుకుంది… మాకు గోడ మీద వాడి ఫోటో ఒక్కటే మిగిలింది’’… ఇదీ నిజమే…
ఆమె ఆ ఇంటి కోడలిగా ఉండటం లేదు… ఉంటే మరణించిన భర్త తాలూకు ఆస్తిని కూడా అనుభవించొచ్చు… కానీ ఇంత చిన్న వయస్సులో ఆమె ఇంకా ఆ ఇంటి పట్టునే ఉండిపోవాలనడమూ న్యాయం కాదు… ఆమె మరో జీవితాన్ని వెతుక్కోవల్సిందే… మరి ఆయన తల్లిదండ్రుల మాటేమిటి..? కొడుకును పెంచి, పెద్దచేసి, చదివించి, తనపై ఆశలన్నీ పెట్టుకున్న వాళ్లు గతేమిటి..?
రాజనాథ్ సింగ్‌తో కూడా నేను ఈ అన్యాయం గురించి వివరించాను, ఆర్మీ రూల్స్ సవరించాల్సిన అవసరాన్ని కూడా చెప్పాను, మేమే ఆ అవసరం ఏమిటో చెప్పడానికి ఉదాహరణ… అంటున్నాడు తండ్రి రవిప్రతాప్ సింగ్… వాళ్ల ఆవేదనలోనూ, వాదనలోనూ న్యాయం ఉంది… NOK ను సవరించాలి, రీడిఫైన్ చేయాలి… లేకపోతే మంజూ సింగ్ చెబుతున్నట్టు వాళ్లకు మిగిలేవి జ్ఞాపకాలు, కన్నీళ్లు… గోడ మీద వేలాడే ఓ ఫోటో, దానికి దండ..!!
Share this Article