ఇప్పుడు ఢిల్లీలో రచ్చ అంతా పెగసస్ మీదే కదా… అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఓ ఇజ్రాయిలీ తయారీ స్పైవేర్ ద్వారా తమకు పడని జర్నలిస్టులు, యాక్టివిస్టులు, విపక్షనేతలు, ఇతర ప్రముఖ టార్గెట్ల ఫోన్లను హ్యాక్ చేయిస్తుందనేది ఆరోపణ… నిజానికి ఏ ప్రభుత్వం ఉన్నా చేసే పనే, చేయకపోతేనే ఆశ్చర్యపడాలి, అది వేరే చర్చ… అయితే కేంద్ర ప్రభుత్వం ‘డేంజర్’ అని భావిస్తున్న వాళ్లలో తెలుగు వాళ్లు ఎవరైనా ఉన్నారా అని చూస్తే… కేవలం మూడే పేర్లు కనిపించాయి ఒక జాబితాలో..! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి మోడీకి గానీ, మోడీ ప్రభుత్వానికి గానీ, మోడీ పార్టీకి గానీ, దేశానికి గానీ, ధర్మానికి గానీ పెద్దగా ‘ప్రమాదకారులు’ లేరు… 1) వరవరరావు బిడ్డ పవన… 2) ప్రొఫెసర్ హరగోపాల్ 3) సాయిబాబా భార్య వసంత… వీరిలో వరవరరావు, సాయిబాబా ఎల్గర్ పరిషత్ కేసులో నిందితులు, వీళ్ల ఫోన్లను ట్రాక్ చేస్తే, ఇంకేమైనా విషయాలు తెలుస్తాయేమో అనుకున్నట్టున్నది ఎన్ఐఏ… అయితే, ఇంకెవరూ ‘టార్గెట్లు’ లేరా..? ఉండొచ్చు… కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇజ్రాయిలీ టెక్నాలజీతోనే చాలా ఫోన్లను ట్రాక్ చేస్తున్నయ్… ఇంటలిజెన్స్ విభాగానికి తప్పదు… ఒకవేళ ‘పొటెన్షియల్ థ్రెట్స్’ గనుక దొరికితే ఆ సమాచారాన్ని కేంద్రంతో పంచుకుంటారు… ఇక్కడ మరో విశేషం ఉంది…
ఇప్పుడు ఆమ్నెస్టీ గానీ, దివైర్ సైట్ గానీ ఏమంటున్నయ్… మరికొన్ని మీడియా సంస్థలతో కలిసి వర్క్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నయ్… ప్రత్యేకించి ఫ్రాన్స్ బేస్డ్ మీడియా గ్రూపు ఫర్ బిడెన్ స్టోరీస్ ఎక్కువ వర్క్ చేస్తోంది… ఈ స్పైవేర్ సృష్టికర్త ఎన్ఎస్ఏ గ్రూపు తెలుసు కదా… దాదాపు 50 వేల ఫోన్ల డేటా లీకైందనీ, సదరు ఫ్రాన్స్ మీడియా గ్రూపు వాటిని అనలైజ్ చేసే పనిలో పడ్డట్టు చెబుతున్నారు… అయితే ఆ 50 వేల ఫోన్ నంబర్లనూ హ్యాక్ చేసినట్టు కాదు… కొన్ని ప్రయత్నించబడ్డాయి, కొన్ని సక్సెస్‌ఫుల్‌గా హ్యాక్ చేయబడ్డాయి, కొన్ని వదిలేయబడ్డాయి… అయితే ప్రభుత్వాల ‘‘టార్గెట్లు’’ ఆ ఫోన్ నంబర్ల ఓనర్లు అనేది మాత్రం సుస్పష్టం… అయితే ఇక్కడ మరో విశేషమూ చెప్పుకోవాలి… ఇప్పుడు మేం ఈ ఫోన్ హ్యాక్ బాగోతాన్ని బ్రేక్ చేశాం అని ఈ మీడియా సంస్థలు చెప్పుకుంటున్నాయి కదా… నిజానికి వాట్సప్ సంస్థ గత అక్టోబరులోనే దీన్ని పట్టేసింది… ఏయే నంబర్లకు ఈ స్పైవేర్ లింక్స్ వస్తున్నట్టుగా అనుమానిస్తున్నదో, వాళ్లకు వాట్సప్ స్వయంగా సమాచారం ఇచ్చింది… అంటే… వాట్సప్‌కు ఈ స్పైవేర్ ఎవరెవరి మీద ప్రయోగించబడిందో మొత్తం తెలుసు అన్నట్టే కదా…!
Ads
మోడీ ప్రభుత్వం టార్గెట్ చేసినట్టు చెబుతున్న ఫోన్ నంబర్లలో దాదాపు 115 పేర్ల వరకూ వెబ్‌సైట్లు వెల్లడిస్తున్నయ్… సహజంగానే రాహుల్ గాంధీ, తదితర విపక్ష నేతల ఫోన్లు టార్గెట్ అయి ఉంటయ్… అసలు ఫోన్ల హ్యాకింగే కాదు, తన కదలికలు, తనను కలుస్తున్న నాయకుల మీద కూడా నిఘా ఉంటుంది… 40 మంది వరకూ జర్నలిస్టులున్నారు… నిజానికి ఆ పేర్లన్నీ యాంటీ-మోడీ అని ముద్రలున్న జర్నలిస్టులవే… సో, స్పై వేర్ ప్రయోగించారూ అంటే ఆశ్చర్యమేముంది..? అప్పట్లో జెఎన్‌యూ గొడవలు చెలరేగాయి కదా, అప్పుడు జేఎన్‌యూ యాక్టివిస్టుల ఫోన్లను ఈ జాబితాలో చేర్చారు… అలాగే వెంటబడి తరిమిన వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా ఫోన్ కూడా టార్గెటెడ్ లిస్టులో చేరింది సహజంగానే…! కొన్నేళ్ల క్రితం నాగాలాండ్ తీవ్రవాదులతో చర్చలు గట్రా జరిగాయి… ఆ ముఖ్యుల ఫోన్లూ జాబితాలో ఉన్నయ్… అలాగే ఎల్గర్ పరిషత్ కేసును మోడీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది కదా, ఆ కేసు నిందితులు, వారి బంధువులు, పిల్లల ఫోన్లనూ జాబితాలో చేర్చినట్టున్నారు… అప్పట్లో కర్నాటకలో ప్రభుత్వమార్పిడి జరిగింది కదా, అప్పుడు కొందరి ఫోన్లు జాబితాలోకి ఎక్కినయ్… ఇలా ఫోన్ల హ్యాకింగ్ ఆయా సందర్భాలు, అవసరాలను బట్టి సాగినట్టుగా, అంటే ఓ లెక్కప్రకారమే సాగినట్టుగా కనిపిస్తుంది… నిజానికి దేశంలోని చాలామంది ముఖ్యనేతల ఫోన్లనూ ట్రాక్ చేస్తూ ఉండవచ్చు, ఇప్పుడు లీకైన నంబర్ల జాబితాలో అవి కనిపించకపోవచ్చు కూడా… చివరగా :: ఈ స్పై వేర్ ప్రయోగించబడిన బాధితుడు అశ్విన్ వైష్ణవ్ ఇప్పుడు ఐటీ మంత్రిగా, తూచ్, అదంతా అబద్ధం అని సమర్థించాల్సి రావడం…!!! (స్టోరీ నచ్చితే దిగువకు వెళ్లి డొనేషన్ బటన్ దగ్గర ఆగి ముచ్చటను సపోర్ట్ చేయండి)
Share this Article