Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వినోదం కోటింగు లేని ఓ చేదు సామాజిక మాత్ర… ఇదోతరహా ఎర్ర సినిమా…

September 3, 2024 by M S R

ఊరుమ్మడి బతుకులు . జాతీయ స్థాయిలో 1976 వ సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికయిన సినిమా . రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చిత్రంగా , ఈ సినిమాలో హీరోగా నటించిన సత్యేంద్ర కుమార్ కు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు వచ్చిన సినిమా . ఊరుమ్మడి బతుకుల కష్టాల సినిమా . ఓ అరవై డెభ్భై ఏళ్ళ కిందట బాగా వెనుకబడ్డ ప్రాంతాలలోని గ్రామాల్లో పేదల్ని పీల్చిపిప్పి చేసిన పెత్తందార్లను నోరు లేనోడు చంపేసిన సినిమా . నా అనుమానం కనీసం ఓ పది సెంటర్లలో అయినా రిలీజ్ అయిఉంటుందా ! పట్టుమని పదిరోజులు అయినా ఆడిఉంటుందా ! అనుమానమే .

ఈ సినిమా నిర్మాత బి యస్ నారాయణ . వామపక్ష భావజాలం ఫుల్ గా ఉన్నవాడు . కరీంనగర్ జిల్లా వాసి . నిమజ్జనం సినిమా నిర్మాత . ఈ సినిమా కొరకు ఈయనతో పాటు రాళ్లు ఎత్తిన తోటి నిర్మాత మరో వామ పక్ష భావజాల సినిమాలు తీసిన వేజెళ్ళ సత్యనారాయణ . వీరిద్దరితో పాటు కె వి చలం , జి వి ఆర్య .

ఈ సినిమాలో హీరో సత్యేంద్ర కుమార్ కూడా తెలంగాణా లోని ఖమ్మం జిల్లా వాడు . నాటకాల మీద , సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగం వదులుకొని , విఫల నటుడిగా నిష్క్రమించాడు . చాలా సినిమాల్లో చిన్నాచితకా పాత్రల్లో కనిపించాడు . బాలయ్య సినిమాల్లో ఎక్కువగా కనిపించాడు . ఓ అయిదారు సినిమాల్లో హీరోగా నటించాడు .

Ads

హీరోయిన్ మాధవి . తూర్పు పడమర సినిమా కన్నా ముందే ఈ సినిమా ప్రారంభించబడి ఉండాలి . ఎందుకంటే నూతన్ ప్రసాద్ పేరుని టైటిల్సులో వర ప్రసాద్ అనే వేసారు . బహుశా పూర్తి కావటం , రిలీజ్ కావటం ఆలస్యం అయి ఉండవచ్చని నేను భావిస్తున్నాను . మాధవి మొదటి సినిమా అయినా , రెండోది అయినా బాగా నటించింది .

నూతన్ ప్రసాద్ సినిమాలో మోతుబరి విలన్ పాత్రను వేసాడు . ఇతనితో పాటు మరో పెత్తందారీ విలన్ . అచ్చోసిన ఆంబోతుల్లాగా ఆడామగా అందరి మీద పడుతుంటారు . ఆ క్రమంలో హీరో చేతిలో ఖతం అవుతారు .

ఈ సినిమా ద్వారా బ్రేక్ వచ్చిన నటుడు రాళ్ళపల్లి . 1973 లో వచ్చిన స్త్రీ సినిమా మొదటిది అయినా ఈ సినిమాతోనే అతనికి బ్రేక్ వచ్చింది . సుమారు 800 సినిమాల్లో నటించాడు . ఈ సినిమాకు రచయిత సి యస్ రావు . దర్శకుడు సి యస్ రావు కాదు . చింతపెంట సత్యనారాయణరావు . కధకుడు , రచయిత . యం బి శ్రీనివాస్ సంగీత దర్శకుడు . ఎర్ర కన్నీరు పాటలు . పాటల్ని శ్రీశ్రీ , కొంపెల్ల శివరాంలు వ్రాసారు . వ్రాసిన శ్రమైక జీవనం , మంటలు రేగు రాముడే దేవుడైతే నీవు కూడా వంటివి ఓ మూడు పాటలు ఉన్నాయి . బాల సుబ్రమణ్యం పాడారు . ఫిమేల్ సింగర్ ఎవరూ లేరు.

కళ , కళలు జనానికి వినోదం పంచిపెట్టి సంతోషాన్ని కలగచేయటానికా లేక సమాజంలో ఉన్న వివిధ రకాల రుగ్మతలను దిగంబరంగా ఎత్తి చూపి , సందేశాలను ఇచ్చి జాగృతపరచటానికా అనే చర్చ తెగేది కాదు . బి యస్ నారాయణ , తిలక్ , మాదాల రంగారావు , నారాయణమూర్తి , నర్రా వెంకటేశ్వరరావు వంటి దిగంబర , విప్లవ , అభ్యుదయ నిర్మాతలు రెండో కేటగిరీ సినిమాలను అందించారు .

రుగ్మతలను మెత్తగా , ఆలోచింప చేసే విధంగా మేధో విప్లవ సినిమాలను షుగర్ కోటేడ్ మాత్రల్లాగా గూడవల్లి రామబ్రహ్మం , కె విశ్వనాథ్ , వి మధుసూధనరావు , దాసరి నారాయణరావు , బాపు వంటి నిర్మాతలు అందించారు . జనానికి సినిమాల ద్వారా వినోదాన్ని , ఆనందాన్ని అందించారు కె యస్ ప్రకాశరావు , ఆయన కుమారులు రాఘవేంద్రరావు , బాపయ్యలు .

సినిమాలను చూసి జనం మారుతారా ?! అనుమానమే . ఎక్కడో ఒకరో అరా . నాగయ్య గారి యోగి వేమన సినిమా చూసి ఓ బాలయోగి అవతరించాడని చెపుతారు . మనకు తెలియకుండా ఇలా ఎక్కడైనా మారారేమో తెలియదు .

మళ్ళీ ఈ సినిమాకు వస్తే……. ఇలాంటి ఉరుమ్మడి బతుకుల కష్టాల మీద చాలా సినిమాలు వచ్చాయి . షుగర్ కోటింగ్ లేకుండా ఆయుర్వేద ఆచార్యుల గారి కషాయం , విరేచనం నల్ల మాత్రల్లాంటి సినిమా . మస్తు సామాజిక స్పృహ లేకపోతే చూడలేరు . ఉందనుకున్న వారు యూట్యూబులో చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …….. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వారసత్వమంటే బీజేపీకి పడదట… కానీ టీ-స్టేట్ కమిటీలో ఆరుగురు వాళ్లే..!!
  • కేసీయార్ స్కామ్స్ చూసీచూడనట్లు వదిలేయాలా… ఎందుకు..?!
  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…
  • బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…
  • అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?
  • శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…
  • ఓరాకిల్ కాదు, మిరాకిల్..! ఒకే రోజులో 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద..!
  • నటన తెలియనివాళ్ల నుంచీ నటన పిండుకోవడం ఎలాగంటే..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions