.
శ్రీకృష్ణుడు హస్తినకు బయల్దేరాడు… యుద్ధ సన్నాహాలు వద్దని పాండవుల తరఫున రాయబారం… ఐదూళ్లు ఇచ్చినా చాలునని చెప్పమంటాడు ధర్మరాజు… ద్రౌపది మొహం అదోలా ఉండటం గమనించి, ఆమెను అడుగుతాడు…
ఏమైందమ్మా..? నీ మొహంలో యుద్ధానికి వెళ్లబోతున్న తరుణంలో కనిపించాల్సిన ఆ జోష్ లేదేమిటి..?
Ads
అన్నా, నువ్వు ప్రయత్నించాక వాళ్లు వినకుండా ఉంటారా..? అంటే యుద్ధం జరగదు అన్నట్టే కదా…
అయితే ఏమంటావమ్మా..?
యుద్ధమే జరగకపోతే నా పగ, నా ప్రతీకారం ఏమైపోవాలి..? ఆ కౌరవ సభలో, ఆ అగౌరవ సభలో జరిగిన అంత నీచమైన అవమానానికి నేను ఇన్నేళ్లుగా పడుతున్న అవమానాలు, అనుభవిస్తున్న నొప్పి, లోలోపల రగిలిపోతున్న ప్రతీకార భావన మాటేమిటి మరి..? భార్య పరాభవానికి ప్రతీకారం తీర్చుకోలేని అసమర్థులనీ, అందుకే ఆ దుష్టులతో రాజీ కుదుర్చుకున్నారనే కొత్త నిందను నా భర్తలు భరించాల్సిందేనా..? చరిత్ర వాళ్లను ఎలా చూస్తుంది..?
నీ నొప్పి, నీ వేదన నాకన్నా ఎక్కువ ఎవరికి తెలుస్తాయమ్మా.,.? అసలు మాయపాచికలు, దొంగ జూదం దగ్గరే నేను ఆపాల్సింది… ఆ సమయానికి రాలేకపోయాను… దానికే సిగ్గుపడుతున్నాను… అసలు నీ వస్త్రాపహరణం దాకా పరిణామాలు రాకుండా ఉండాల్సింది…
అర్థం కావడం లేదన్నా… నీ శాంతి స్థాపన పరమార్థం ఏమిటి మరి…? ఈ రాజీ చర్చలు ఏమిటి..? కర్ణుడిపై అర్జునుడి ప్రతీకార వాగ్దానం మాటేమిటి..? దుర్యోధన, దుశ్శాసనులన్ని నిర్జిస్తానన్న భీముడి వాగ్దానం మాటేమిటి..?
చూడమ్మా… రాయబారం కూడా యుద్ధనీతిలో భాగమే… నీ భర్తలు ఇంకెవరినో పంపించకుండా కావాలని నేనే వెళ్తానని చెప్పి మరీ ఒప్పించాను… ఎందుకో తెలుసా..? వేరేవాళ్లయితే ఎక్కడ రాజీప్రయత్నాలు విజయవంతం అవుతాయేమోనని నా భయం… కావద్దని నా సంకల్పం…
నువ్వయినా యుద్ధం వద్దు అనే చెబుతావుగా… వాళ్లు వింటే, అంగీకరిస్తే..?
లేదమ్మా… నాకు నా రాయబారం మీదకన్నా దుర్యోధనుడి ముష్కరధోరణి మీద అపారనమ్మకం ఉంది… నా ప్రయత్నాన్ని వాడు అడుగడుగునా విఫలం చేస్తాడు, తోడుగా కర్ణుడు, దుశ్శాసనుడు ఉండనే ఉన్నారు… యుద్ధం జరుగుతుంది… భీష్మాదులు చెప్పినా విన్నట్టు నటిస్తాడే తప్ప వెంటనే తన దుష్కర్మలు ప్రారంభిస్తాడు… వెరసి యుద్ధం తప్పదు… నీ పగ చల్లారకా తప్పదు… సరేనా..?
అన్నా, వెళ్లే ముందు ఒక్క మాట… నిజంగానే నువ్వు యుద్ధం లేదనే మాటను పట్టుకొస్తే ఈ చెల్లి నిన్నిక జన్మలో నమ్మదు, ఆదరించదు, మాట్లాడదు…
ఒకవైపు కాల్పుల విరమణకు అంగీకరించామని చెబుతూనే … నిమిషాల్లో ఆ ఒప్పందాన్ని కాలరాచి, మళ్లీ సరిహద్దుల్లో భారీ కాల్పులు, డ్రోన్ల ప్రయోగాలకు పాల్పడుతున్న పాకిస్థానీ దుష్కర్మల గురించి వార్తలు చూస్తుంటే పైన శ్రీకృష్ణ – ద్రౌపది సంభాషణే పదే పదే గుర్తొచ్చింది… దుర్యోధనుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదుగా..!! వాడెప్పుడూ మారడు… తన పరోక్ష యుద్ధాన్నీ ఆపడు… అంతే… తేల్చుకోవల్సింది మనమే…
Share this Article