ఓ పేద హీరో… పెద్దింటి హీరోయిన్… లవ్ ట్రాక్… దాని చుట్టూ ఓ కథ… కొన్ని ట్విస్టులు… పాటలు, సపరేట్‌గా కామెడీ ట్రాక్… ఎన్నెన్ని పాత సినిమాల్లో చూశామో కదా… ఇప్పుడు ఈ కథల్ని దరిద్రపు టీవీ సీరియళ్లలో కూడా చూపించడం లేదు… మరి ఒకప్పుడు కాస్త చెప్పబుల్ సినిమాలు తీసిపెట్టిన ఎస్వీ కృష్ణారెడ్డి ఆ పాత చింతకాయను ఎందుకు రుద్దాడు మనమీద..?
ఎందుకంటే..? తను ఇంకా ఆ కాలంలోనే ఉండిపోయాడు కాబట్టి… మోడరన్ కథాంశాలు, ట్రెండ్స్ తనకు పట్టలేదు కాబట్టి… ఐనా దర్శకత్వం మీద మోజు తీరలేదు కాబట్టి… సదరు నిర్మాతకు కృష్ణారెడ్డిని దర్శకుడిగా పెట్టుకున్నా సరే, అసలు ఈయన ఈ కాలపు సినిమాను తీయగలడా అనే డౌట్ ఉన్నట్టుంది బలంగానే… అందుకే క్యాస్టింగ్ దగ్గర నుంచి అన్నీ చౌక రేట్లు మాట్లాడుకుని, ఉన్నంతలో తక్కువ ఖర్చులో సినిమాను చుట్టేశారు…
బహుశా రాజేంద్రప్రసాద్‌కు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారు… కొంతమేరకు మీనాకు కూడా…! హీరో హీరోయిన్లు సహా మిగతా వాళ్లు అందరూ చౌక రేట్లకు దొరికిన ఆర్టిస్టులే… బహుశా సినిమాలో రాజేంద్రప్రసాద్ విగ్గులకే ఎక్కువ ఖర్చయి ఉంటుంది… పాత చింతకాయ కథకు ఏం చేసినా అది వేస్ట్… అందుకే సినిమా ఎటూ గాకుండా పోయింది… కాకపోతే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ డబ్బుతో నిర్మాత బయటపడతాడేమో… థియేటర్‌కు వెళ్లే సాహసం ప్రేక్షకులు పెద్దగా చేయకపోవచ్చు…
Ads
నిజానికి ఇందులో వరుణ్ సందేశ్ గతంలో హీరోగా చేసినవాడే… రష్మి గౌతమ్‌లో మంచి ఈజ్ ఉంది, మంచి డాన్సర్… వాళ్లను కాస్త ఎక్కువ పనిచెబితే బాగుండేదేమో సినిమాలో… అలాగే సునీల్, కృష్ణభగవాన్, సప్తగిరిలను కూడా దర్శకుడు సరిగ్గా వాడుకోలేకపోయాడు… కామెడీలో పంచ్ మిస్సయింది… హీరోయిన్ ఎవరో గానీ చెప్పుకోవడం దండుగే… మీనా పేరుకు ఉంది గానీ ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యమేమీ లేదు… నిజానికి సినిమాలో రాజేంద్రప్రసాద్ తీసుకున్న స్క్రీన్ స్పేసే ఎక్కువ…
పాటలు సోసో, మాటలు సోసో… అక్కడక్కడా ప్రేక్షకులకు క్లాసులు పీకుతాడు కూడా దర్శకుడు… మరిక ఏం చూడబుల్ ఫ్యాక్టర్ ఉందని సినిమా చూడాలి కృష్ణారెడ్డి గారూ… ఎంచక్కా టీవీ సీరియళ్లు తీసుకోవచ్చు కదా… లేదంటే రాఘవేంద్రరావులాగా ఒక యూట్యూబ్ చానెల్ పెట్టుకుంటే చాలదా..? ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలి సార్… లేకపోతే ఇదుగో ఈ సినిమాలాగే అయిపోతుంది మన గతి…!! లేదు, నేను పాతతరహా ఆణిముత్యాలు తీస్తాను అని భీష్మించుకుంటే… గుడ్, మీ సొంత యూట్యూబు చానెల్‌లో పెట్టేయండి ఆ సినిమాలు… ఆనక చూసేవాడి ఖర్మ…!!
Share this Article