విష్వక్సేన్ అయినా అంతే… చిరంజీవి అయినా అంతే… మనకు తెలుగులో సొంత కథల్లేవు, మనకు ప్రయోగాలు అక్కర్లేదు… ఏదో భాష నుంచి మన హీరోయిజానికి అనువుగా మల్చుకుని, ఓ రీమేకును జనంలోకి వదలడమే… ఓరి దేవుడా అనే సినిమా పోస్టర్ చూడగానే గుర్తొచ్చే నిజం ఇదే… పోనీ, అదైనా నిన్నటిదో మొన్నటిదో కూడా కాదు… ఏళ్ల క్రితం నాటి సినిమాలైనా సరే, రీమేకడమే…
తమిళంలో రెండున్నరేళ్ల క్రితం వచ్చింది ఓ మై కడవులే అనే సినిమా… దాన్ని విష్వక్సేనుడు హీరోగా తెలుగులో రీమేకారు… మరి ఆల్‌రెడీ కరోనా కాలంలో సబ్ టైటిళ్లు చూసుకుంటూ ఈ తమిళ ఒరిజినల్ కూడా జనం చూసేసి ఉంటారు కదా, మళ్లీ రీమేకును చూస్తారా..? ఎవరికీ ఆ డౌట్లు ఏమీ అక్కర్లేదు… దేని సంగతి దానిదే… కాకపోతే ఇదీ ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం, థియేటర్ స్కిప్ చేద్దాం… అయినా ఇప్పుడు థియేటర్‌కు జనాన్ని రప్పించాలంటే కాంతారలు కావాలి…
పీవీపీ, దిల్ రాజు వంటి పెద్ద పెద్ద నిర్మాతలకూ సొంతంగా కథల విభాగాలుండవు… అదీ మన దరిద్రం… అప్పటికప్పుడు ఏదో సినిమాను కొనేయడం, వీలయితే ఆ సినిమా దర్శకుడినే పెట్టేసీ రీమేకడం… ఓరి దేవుడా కూడా అంతే… జీవితంలో ఓ నిర్ణయం తీసుకుంటాం, తప్పు అని తరువాత తేలుతుంది… ఇక చేసేదేముంది అని బాధపడుతుంటాం… కానీ రెండో చాన్స్ తీసుకునే అవకాశం వస్తే..? ఎస్, సినిమా కథ ఇదే… నావెల్ పాయింట్…
Ads
అయితే దీన్ని ఓ క్రైం, మాఫియా మన్నూమశానం కథల్లో ఇరికించకుండా… ఓ సగటు మనిషి లేదా కుటుంబం, ప్రేమ, పెళ్లి, విడాకుల చుట్టూ తిప్పడానికి ఈ కొత్త పాయింట్ ఉపయోగించుకున్నారు ఈ సినిమాలో… సరదాగా కథను ఇలాగే నడిపిస్తూ, నిర్బంధ కామెడీ ట్రాకులేవీ నడవకుండా, ఉన్న పాత్రలతోనే హ్యూమర్ క్రియేట్ చేసిన తీరు మెప్పిస్తుంది సినిమాలో… కాకపోతే కథ, కథనాలు ఊహించవచ్చు, ప్రెడిక్టబుల్… అదే సినిమాకు మైనస్…
పైగా పెద్ద పెద్ద హీరోలయితే, వాళ్ల ఇమేజీ బిల్డప్పులతో ఈ సరదా కథ కాస్తా భ్రష్టుపడుతుంది… అందుకని విష్వక్సేన్ ఎంపిక కూడా కరెక్టే… మళ్లీ వేరే ప్రయోగాలు దేనికిలే అనుకుని కెమెరా, సంగీతం వంటి కీలక విభాగాల్లో కూడా ఒరిజినల్ సినిమాకు పనిచేసినవాళ్లనే పెట్టుకున్నారు… బేసిక్ స్టోరీ లైన్ ఎంత వెరయిటీగా అనిపిస్తుందో, ఒక దశలో కథ అక్కడక్కడే తిరుగుతూ చిరాకెత్తుతుంది… సెకండాఫ్‌లో ప్రేక్షకుడిని అస్సలు ఎంగేజ్ చేయదు కథ…
రీమేక్ కాబట్టి సంగీతం మీద కాన్సంట్రేట్ చేస్తే బాగుండు… అవే పాత ట్యూన్లు… బీజీఎం కూడా సోసో… విష్వక్సేన్ బాగానే చేశాడు… ప్రమోషన్లలో ఎలాంటి ఇకారాలకు కూడా పోలేదు ఈసారి… హీరోయిన్లలో ఓ పిల్ల మిథిలా పాల్కర్… పర్లేదు… మరో హీరోయిన్ ఆశా… అంత దృశ్యం లేదు ఆ పిల్లకు… అసలు విషయం చెప్పనేలేదు కదూ…
ఇందులో వెంకటేష్ ఉన్నాడు… దేవుడి పాత్ర… మోడరన్ దేవుడు… ఏ మతం దేవుడో గానీ, ఉన్నంతసేపు సహ-దేవుడు రాహుల్‌తో కలిసి కాసేపు నవ్విస్తాడు… కానీ పెద్ద ప్రాధాన్యం లేని పాత్రలు… పైపైన తేల్చేశారు… ఏదో గెస్టుగా చేసినట్టున్నాడు వెంకటేష్… గాడ్ ఫాదర్‌లో సల్మాన్ ఖాన్ చేసినట్టు…! ఓవరాల్‌గా పర్లేదు అంటారా..? పర్లేదు… చెత్త కాదు, కానీ మరీ పనిగట్టుకుని థియేటర్‌కు పరుగులు తీసేంత సీన్ లేదు… బలంగా ఆకర్షించగల థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ అంశాలేమీ లేవు… ఏం ఓటీటీలు లేవా..? నాలుగు రోజులు ఆగలేరా..?
Share this Article