.
“మూఙ్గిలిలే (మూంగిలిలే) పాట్టిసైక్కుమ్ కాఱ్ట్రలైయైత్ తూదు విట్టేన్…”
1982లో వచ్చిన ‘రాగమ్ తేడుమ్ పల్లవి’ తమిళ్ష్ సినిమాలోని పాట “మూఙ్గిలిలే (మూంగిలిలే) పాట్టిసైక్కుమ్ కాఱ్ట్రలైయైత్ తూదు విట్టేన్…”
టీ. రాజేందర్… డబ్బింగ్ సినిమా ప్రేమసాగరం (1983) వల్ల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. తమిళ్ష్లో ‘ఉయిరుళ్ళ వరై ఉషా’ సినిమాగా వచ్చి, తెలుగులో ప్రేమసాగరంగా అప్పట్లోనే కోటి రూపాయల వసూళ్లు రాబట్టిన డబ్బింగ్ సినిమా!
టీ. రాజేందర్… భారతదేశ సినిమాలో కిషోర్ కుమార్ తరువాత నిజమైన బహుముఖ ప్రజ్ఞాశాలి. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన ఇలా వివిధ శాఖల్లో ప్రజ్ఞను చాటిన కళాకారుడు.
Ads
ఎవరో రాస్తే, ఎవరో చేస్తే తన పేరు వేసుకున్న వ్యక్తి కాదు టీ. రాజేందర్. తన పేరు మీద ఉన్నవన్నీ తనే చేసిన నిజాయితీపరుడు టీ. రాజేందర్. వ్యక్తిగా కూడా రాజేందర్ నిజాయితీ అయిన వ్యక్తి.
సినిమా రంగంలో విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్నవారు టీ. రాజేందర్. బహిరంగంగా చెప్పకూడని మంచిని, సంస్కరాన్ని ఆచరించినవారు టీ. రాజేందర్.
సంగీతంలో రాగ, స్వర జ్ఞానం లేకపోయినా గొప్ప పాటలు చేశారు టీ. రాజేందర్. చాల గొప్ప సాహిత్యం రాశారు.
సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడిగా, కేమెరామేన్గా షాట్స్ తీస్తున్నప్పుడే వాటికి నేపథ్య సంగీతాన్ని కూడా నిర్మించుకునేవారు రాజేందర్.
టీ. రాజేందర్ మొదటి సినిమా ‘ఒరుతలై రాగం'(1980). అందులో “ఇది బిడ్డ పాడే లాలి; ఇది రాత్రివేళ భూపాలం/ ఇది పడమరలో వచ్చే ఉదయం; ఇది నదిలేని పడవ” అంటూ విరోధాభాసలో గొప్పగా రాసిన పాటను అంత కణ్ణదాసన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. మంచి ‘కవిత్వ స్పృహ’తో మంచి కవిత్వ సృజన చేశారు టీ. రాజేందర్.
మంచి సంగీతాన్ని ఇచ్చారు టీ. రాజేందర్. అది 1986; తమిళ్లో ఇళైయరాజా ఉద్ధృతి; ఆ సమయంలో రాజేందర్ చేసిన మైదిలీ ఎన్నైక్ కాదలి (నటి అమల తొలి సినిమా) సినిమా సంగీతం ఒక సంచలనమైంది!
ఇళైయరాజా సంగీత ప్రభంజనం మధ్యలో మరొకరి సంగీతం సంచలనం అవడం నిజంగా ఆశ్చర్యకరం!
టీ. రాజేందర్ రాసిన, సంగీతం చేసిన పాటలు దాదాపుగా అన్నీ మేలుగానే ఉంటాయి. ఆయన నాసిరకం పాటలు చెయ్యలేదు.
“రాజేందర్ గొప్ప పాట చేశాడు” అని ఈ “మూఙ్గిలిలే (మూంగిలిలే) పాట్టిసైక్కుమ్ కాఱ్ట్రలైయైత్ తూదు విట్టేన్…” పాటను అత్యున్నత సంగీత దర్శకుడు ఎమ్.ఎస్. విశ్వనాద(థ)న్ ప్రశంసించారు.
ఈ రాగమ్ తేడుమ్ పల్లవి సినిమాలోనే “ఆళ్ష్ కడలిల్ తత్తళిత్తు నానెడుత్త ముత్తు ఒన్ఱై విది అవన్ పఱిత్తదు ఏన్, ఏన్?…” (కడలి లోతుల్లో కొట్టుమిట్టాడి నేను తీసిన ముత్యాన్ని విధి లాగేసుకున్నది ఎందుకు, ఎందుకు?) అంటూ మరో గొప్ప పాట రాశారు; సంగీతం పరంగా మరో గొప్ప పాట చేశారు రాజేందర్.
అంతర్జాతీయ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహ్మాన్ తనకు రాజేందర్ అంటే ప్రత్యేకమైన అభిమానం అని బహిరంగంగా చెప్పారు.
కవిత్వం రహస్యం తెలిసిన వారు రాజేందర్. ఆ ఎరుకతో మంచి కవిత్వం రాశారు ఆయన. రాజేందర్ సాహిత్యం అంటే నాకు చిన్నప్పటి నుంచీ అభిమానం.
ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం రాజేందర్ పాటలు కొన్నిటిని విశేషంగా పాడారు. ఇళైయరాజా ప్రభంజనం మధ్యలో సంచలనం సృష్టించిన మైదిలీ ఎన్నైక్ కాదలి సినిమా పాటల విషయంలో రాజేందర్ సంగీతానికి బాలు ప్రాణం.
ఈ “మూఙ్గిలిలే (మూంగిలిలే) పాట్టిసైక్కుమ్ కాఱ్ట్రలైయైత్ తూదు విట్టేన్…” పాటా బాలూయే పాడారు; జీవంతో పాడారు.
వినండి…
https://youtu.be/QAAsZW5lXPg?si=caWnm6sW8VfT8UU-
“ఆళ్ష్ కడలిల్ తత్తళిత్తు నానెడుత్త ముత్తు…”
https://youtu.be/0CcxFWRfAEg?si=e9MSMBdf3Et9ySBJ
….. రోచిష్మాన్ 9444012279
Share this Article