30 ఏళ్ల కెరీర్లో 56వ సారి బదిలీ అయిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా… ఈ రికార్డు బహుశా మన దేశంలో ఏ సివిల్ సర్వెంట్‌కూ లేదు… రాదు… ఇక మొదలుపెట్టండి, క్షుద్ర రాజకీయులు, స్వార్థ వ్యాపారులు, అక్రమార్కులకు అడ్డుగా ఉన్నందుకే ఇన్ని బదిలీలు… ఈయన నిజాయితీకి జోహార్ అంటూ పొగడ్తలు, బాధాపూర్వక ప్రశంసలు… 56 సార్లు మీడియా మొత్తుకోలు ఇదే కదా… ఈ ఒక్కసారి నిజానికి ‘‘నువ్వు ఆ ఉద్యోగానికి పనికిరావోయ్’’ అనండి, అది కరెక్టు అంచనా అవుతుంది…
పార్టీ బేధం ఏమీ లేకుండా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఖేమ్కాతో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు… ఆఫ్టరాల్ వారానికి ఒకటీరెండు ఫైళ్లు మాత్రమే వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో కూడా పనిచేయలేకపోతే… ఇక తను సర్వీసుకు పనికిరాడని లెక్క… వోకే, తను వ్యక్తిగతంగా గుడ్, సూపర్… కానీ సివిల్ సర్వీసులో అదే సరిపోదు… బుర్ర పనిచేయాలి… వ్యవస్థను పనిచేయించాలి… మూవ్ ఆన్… నడిపించాలి…
ఆ సామర్థ్యం లేనప్పుడు తను ఆ సర్వీసులో ఉండటం శుద్ధదండుగ… దేశంలో ఇన్ని వేల మంది ఐఏఎస్ అధికారులు ఉండగా, ఖేమ్కాకే ఇంత దరిద్రమైన బదిలీల రికార్డు ఎందుకుంది..? చివరకు ఏ పనీ లేని ఆర్కైవ్స్ శాఖ నుంచి కూడా నాలుగుసార్లు బదిలీ… మళ్లీ బంతి ఆ కోర్టులోకే వెళ్లింది… ఒక ఫైల్, అక్రమార్కుల కోసం ఉద్దేశించింది, నాయకుల ఒత్తిడి, కానీ ప్రజావ్యతిరేకం, అలాంటప్పుడు తను వెళ్లిపోయినా సరే మరే ఆఫీసరూ దాన్ని సాల్వ్ చేయలేని రీతిలో కొర్రీ రాసి ఫైల్ పక్కన పడేయాలి… అలా సీనియర్ ఐఏఎస్‌లు ఆపిన ఫైళ్లు వేలకువేలు… లేదా పనికొచ్చేరీతిలో ఫైల్ కదిలించాలి… ఆ మెరిట్ అందరికీ ఉండదు…
Ads
నేను పనిచేయను, ఆ ఫైల్ మీద సంతకం చేయను అని ఎవడైనా అంటాడు… కనీసం దాన్ని పనికిరాని ఫైల్‌గా మార్చాలి, అదీ తెలివైన అధికారి చేయాల్సిన పని… లేదా ఆ ఫైల్‌కే కాలగతి పట్టించాలి… 30 ఏళ్ల కెరీర్‌లో ఖేమ్కాకు ఇది చేతకాలేదు… తన జీతానికి ప్రజాధనం వృథా… నిజానికి ఇలాంటోళ్ల కోసమే మోడీ ప్రభుత్వం సీఆర్ఎస్ పథకం ప్రవేశపెట్టింది… కంపల్సరీ రిటైర్‌మెంట్ పథకం… ఖేమ్కాకు ఎందుకు వర్తించకూడదు..? ఆయనతో పనిచేయించలేరు, అలాంటప్పుడు జనం సొమ్ముతో జీతం ఎందుకు ఇవ్వాలి..?
తాజా బదిలీకి కారణం ఏమిటంటే… అయ్యా, నేను పనిచేస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని ఉన్నత విద్యా శాఖలో విలీనం చేశారు, నాకు కనీసం పనిలేకుండా పోయింది, తన స్థాయి అధికారికి వారానికి కనీసం 40 గంటల పనైనా ఉండాలని ఆయన చీఫ్ సెక్రెటరీకి ఓ లేఖ రాశాడు… ఇప్పుడు ఆ పని కూడా లేని శాఖకు బదిలీ చేశారు… ఈ కోణంలో వార్త చదువుతుంటే… ఛస్, ఇది దరిద్రమైన వాదన అనిపిస్తోందా..?
తప్పు, మన దేశంలో కేంద్ర సర్వీసు అధికారుల ఒళ్లు వంచి పనిచేయించగల ప్రభుత్వం ఇప్పటివరకూ రాలేదు… పనిచేయించుకోలేనప్పుడు కనీసం వదిలించుకోవాలి కదా… అదీ చేతకాదు… ఖేమ్కా బదిలీల కథ చెప్పే చేదు నిజం ఇదే… రియాలిటీ ఇదే… డెడ్ వుడ్ లేదా ఇన్‌ఫెక్టెడ్ సరుకునే తీసేయడం చేతకావడం లేదు… పని ఏం చేయించగలరు ఈ అరబుర్రల నాయకులు..? !
Share this Article