‘‘నేనొకరి ఇంటికి ఈమధ్య భోజనానికి వెళ్లాను, తను చెబుతున్నాడు, ఆర్ఆర్ఆర్ తప్ప అసలు థియేటర్‌లో సినిమా చూసి చాలాకాలమైంది అని… అన్నీ ఎంచక్కా ఓటీటీలో చూసేస్తున్నారు… ఓటీటీ ప్రభావం అది…’’ తెలుగు సినిమాను శాసించే సిండికేట్‌లో కీలకవ్యక్తి దిల్ రాజు చెప్పిన మాటే ఇది… ఆర్కే ఓపెన్ హార్ట్‌లో మాట్లాడుతూ ఒక లెక్క చెప్పాడు… అది సినిమా భవిష్యత్తును చెప్పబోతోంది…
‘‘గతంలో 20 శాతం వరకూ నాన్- థియేటరికల్ రెవిన్యూ ఉండేది… మ్యూజిక్ రైట్స్ ఎట్సెట్రా… మిగతా 80 శాతానికి థియేటర్ ఆధారం… కానీ ఇప్పుడు ఏకంగా 60 శాతం నాన్-థియేటరికల్ రెవిన్యూ… అంటే ఓటీటీ, ఓవర్‌సీస్, శాటిలైట్ రైట్స్ ఎట్సెట్రా…’’ బాగా చెప్పాడు… నిజం కూడా… రాబోయే రోజుల్లో ఆ 60 శాతం 80 శాతం కాబోతోంది… థియేటర్‌కు జనం రావడం ఇంకా తగ్గిపోనుంది…
ఇప్పుడు పైపైన థియేటర్లు కళకళలాడుతున్నట్టు కనిపిస్తోంది కానీ… కలెక్షన్ల అసలు లెక్కలు చూస్తే ఠారెత్తిపోవడమే… ఒకసారి జిన్నా అనుభవం గుర్తుతెచ్చుకొండి… అంతెందుకు..? భారీ కలెక్షన్లు అని పైకి చెబుతున్న సినిమాల అసలు వసూళ్ల లెక్కలు నిజానికి మైనస్ బడ్జెట్ అని ఇదే దిల్ రాజు ఇదే ఇంటర్వ్యూలో చెప్పాడు… సో, రాబోయే కాలంలో ఓటీటీ ఫిలిమ్ ఇండస్ట్రీని శాసించబోతోంది… పలువురు నిర్మాతలు ఈ థియేటర్లు, దందాలు, మొక్కులు, పైరవీలు ఎందుకని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసుకుంటున్నారు…
Ads
థియేటర్ టికెట్ల రేట్లు తగ్గించాలి అంటాడు దిల్ రాజు… నిర్మాతల్లోనే ఏకాభిప్రాయం ఉండదు… మొదటి వీకెండ్ ఎంత కుమ్మేసుకున్నాం అనేదే ముఖ్యం ఏ నిర్మాతకైనా… అందుకే రేట్లు తగ్గించడు… ఒకవేళ తగ్గించినా సరే, థియేటర్ దాకా వెళ్లి సినిమా చూడటం చాలా ఎక్స్‌పెన్సివ్… పార్కింగ్, ట్రాఫిక్, క్యాంటీన్… ప్రతిదీ కడుపు మండేదే… దీంతో దిల్ రాజు ఏకీభవిస్తాడు, అదే సమయంలో థియేటర్లు మూతపడవు అంటాడు…
రాను రాను థియేటర్ల నిర్వహణే మైనసులో పడితే, ఎవడైనా ఎందుకు నడిపిస్తాడు థియేటర్‌ను… 4 కే, డాల్బీ సౌండ్, మన్నూమశానం ఎంత కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టినా… అవి చూసి ఆనందించే సినిమాలు ఎన్ని..? అవతార్-2 వంటి కొన్ని సినిమాలు… అవెప్పుడో ఏడాదికొకటి వస్తాయి… మరి మిగతా రోజుల్లో థియేటర్లు నడవడం ఎలా..? ఈ ప్రశ్నలకు నిజంగానే దిల్ రాజు దగ్గర సమాధానం లేదు… వాటిని రాబట్టే ప్రయత్నం వదిలి ఆర్కే ఇంకేదో సబ్జెక్టు వైపు దిల్ రాజును తోసుకుపోయాడు…
దిల్ రాజే చెబుతున్నాడు… ఓటీటీ ప్లాట్‌ఫారాల నడుమ పోటీ పెరిగి… కొన్ని సినిమాలకు 60, 70 కోట్లు కూడా ఆఫర్ చేస్తున్నారని…! అంటే స్ట్రెయిట్ అవే ప్రాఫిట్స్, ఎవరితోనూ పొత్తు లేదు, పంచుకోవడం లేదు, లెక్కల జంఝాటం లేదు… కానీ నిజానికి అదొక గాలి బుడగ, ఎన్నాళ్లో చెప్పలేం… వాటికి ఆ పెట్టుబడిలో ఈక రాదు, తోక రాదు… పెడుతూ పోతున్నారు… రేప్పొద్దున పేలిపోతాయా..? ఏ చిన్న ఆర్థిక సంక్షోభం తలెత్తినా ముందుగా దెబ్బతినేవి ఇవే… అప్పుడు సినిమా రంగం ఘోరంగా దెబ్బతినడం సహజం… మరి ఇవన్నింటికీ పరిష్కారం ఏమిటి..? ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చేలా చేయడం… అది తప్ప సినిమా పెద్దలు అన్నీ ఆలోచిస్తున్నారు…!!
Share this Article