.
శతాబ్దాల చరితకు సాక్ష్యాలు గండికోట అందాలు
కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర గండికోట ఒక చూడదగ్గ ప్రదేశం. పెన్నా నది ప్రవాహం ఎర్రమల కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడంవల్ల గండికోటకు ఆ పేరొచ్చింది. కాలగతిలో పెన్న చెక్కిన అయిదు కిలోమీటర్లకు పైబడి విస్తరించిన ఇక్కడి దృశ్యం అమెరికా గ్రాండ్ కెన్యాన్ ను గుర్తుకు తెస్తుంది.
Ads
ఉత్తరాన- పెన్నా ప్రవాహం, ఎర్రమల కొండలు, లోయలు;
దక్షిణాన- గిరి దుర్గం; ఆలయాలు; మసీదు; బందిఖానా; ఖజానా, ధాన్యాగారాలు… ఇలా ఓపిగ్గా తిరగగలిగినవారికి ఇక్కడ లెక్కలేనన్ని ఉన్నాయి.
పదమూడో శతాబ్దంలో పశ్చిమ కల్యాణి చాళుక్య రాజైన ఆహవమల్ల సోమేశ్వరుడు ఇక్కడి మలికినాడు సీమకు సంరక్షకుడిగా నియమించిన కాకరాజు చిన్నరాజ్యంకోసం మొదట మట్టి కోటను కట్టినట్లు శాసన ఆధారం దొరికింది. మరో కథనం ప్రకారం కాయస్థ నాయకుడు అంబదేవ రాజధానిని వల్లూరునుండి గండికోటకు మార్చడంతో దీని ప్రభ మొదలయ్యింది.
స్థానికంగా దొరికే రాతితో నిర్మించిన శత్రుదుర్భేద్యమైన కోట ఏడెనిమిది వందల ఏళ్ళు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కాకతీయుల మొదలు విజయనగర ప్రభువులు, పెమ్మసాని నాయకుల దాకా ఎందరి ఏలుబడిలో ఉందోకానీ విజయనగర పతనం తరువాత అబ్దుల్లా కుతుబ్ షా చేతికి దక్కింది. కుతుబ్ షా సేనాని జుమ్లా పెమ్మసాని కుమార తిమ్మానాయుడికి అతడి మంత్రితోనే విషమిచ్చి చంపి… గండికోటను స్వాధీనం చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది.
పూజల్లేని ఆలయాలు
———-
కోటలోపల విజయనగర నిర్మాణ శైలిలో రెండు పెద్ద ఆలయాలున్నాయి. మాధవరాయస్వామి ఆలయంలో అపురూపమైన శిల్పసంపద ఉంది. మండపాలు, గోపురాలు, గుడి తలుపులతోపాటు అన్నీ భద్రంగా ఉన్నా… ముస్లిం సైన్యాలు స్వాధీనం చేసుకోగానే హంపీలోలా గర్భగుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
ఆనాటినుండి ఈనాటివరకు ఇక్కడా హంపీ కథే. దేవుడులేని గుడిగోపురం దిగులు దిగులుగా శతాబ్దాలుగా ఉంది. అక్కడ శిలలు ద్రవించి ఏడిస్తే… ఆ కన్నీళ్ళు తుంగభద్రలో కలిశాయి. ఇక్కడ శిలలు ద్రవించి ఏడిస్తే… ఆ కన్నీళ్ళు పెన్నలో కలిశాయి. పెన్నను అనుకుని ఉన్న రఘునాథస్వామి ఆలయానిదికూడా ఇదే కన్నీటిగాథ.
గండికోట రహస్యం
——
“గండికోట రహస్యం” తెలుపు- నలుపు పాత సినిమా కథకు ఈ గండికోటకు సంబంధం లేకపోయినా… శతాబ్దాలుగా “గండికోట రహస్యం” అన్న మాట వాడుకలో ఉండడానికి మాత్రం ప్రత్యక్షంగా ఈ గండికోటతోనే సంబంధం ఉంది.
గండికోటను శత్రువులు ప్రత్యక్షంగా యుద్ధంలో జయించిన దాఖలాలు లేవు. కోటలో రాజును విషప్రయోగంతో చంపించి… కోటను స్వాధీనం చేసుకున్న చారిత్రక ఆధారాలే రెండు మూడు కనబడుతున్నాయి. ఉత్తర, దక్షిణ, పడమర వైపుల్లో ఇంగ్లిష్ అక్షరం U ఆకారంలో అయిదారు కిలోమీటర్ల లోతైన పెన్నా నది సహజ సిద్ధమైన కందకంలా కోటకు గొప్ప రక్షణ.
తూర్పు వైపు జమ్మలమడుగు నుండి వచ్చే దారి తప్ప మిగతా ఏ దారిలోనూ కోటను చేరుకోవడానికి వీల్లేని అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో, ఎత్తు మీద కోటను నిర్మించారు. కోటకు కందకంగా ఉన్న పెన్న ఆవలి గట్టు నుండి రాళ్ళు, బాణాలు వేసినా… ఫిరంగులు పేల్చినా అవన్నీ అడ్డుగా ఉన్న పెన్నా నదిలో కనీసం సగం దూరం కూడా దాటలేక తుస్సుమనేవి.
ఈ కథలు… కథలు కథలుగా ప్రచారం పొందాయి. చివరికి ఆనోటా ఈనోటా పడి అవన్నీ ఎంతదాకా వెళ్ళాయంటే… గండికోటలో ఏవో మహిమలున్నాయి. ఆ కోటమీదికి బాణమో, రాయో విసిరితే… అవి మనమీదే పడతాయి. కోటలో రాజుకు విషం పెట్టి చంపడం తప్ప… యుద్ధంలో కోటను గెలవడం అసాధ్యం- అన్న నమ్మకం స్థిరపడింది. అదే “గండికోట రహస్యం” అయ్యింది.
ఇప్పుడిప్పుడే గండికోట ఆధునికతను అద్దుకుంటోంది. పర్యాటకులు పెరుగుతున్నారు. వసతి సౌకర్యాలు పెరుగుతున్నాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్ కేంద్రాలు వెలుస్తున్నాయి. గుర్రపు స్వారులు, ట్రెక్కింగులు, జిప్ లైన్లు వచ్చాయి. నదిలోకి కేబుల్ కార్ నిర్మాణమవుతోంది.
పక్కన మైలవరం దగ్గర పెన్నా నీటి నిల్వకు డ్యాం కట్టడంతో నీటి స్పర్శతో ఈ ప్రాంతం పచ్చటి పట్టుచీర కట్టుకుని మురిసిపోతోంది. ముదురు ఆకుపచ్చ నిమ్మతోటల్లో నిమ్మకాయలు నిగనిగలాడుతున్నాయి. అరటి తోటలు పుడమికి స్వాగత తోరణాలు కడుతున్నాయి. ఒకప్పుడు ఎడారిగా దుమ్మురేగిన నేలల్లోనే ఇప్పుడు పైరుపంటలు పిల్లగాలులకు తలలూపుతుంటే చూడడం కంటే అందమైన దృశ్యం మరొకటి ఏముంటుంది?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article