సునీతా విలియమ్స్… ప్రొఫెషనల్ వ్యోమగామి… అనేకసార్లు స్పేస్‌వాక్ కూడా చేసింది… ఏడుసార్లు స్పేస్ వాక్ చేసిన మహిళ, 50 గంటల సుదీర్ఘ స్పేస్ వాక్ సమయం ఆమె పేరిట ఉన్న రికార్డులు… ఆమె తండ్రివి ఇండియన్ రూట్స్, గుజరాత్… ఆయన పేరు దీపక్ పాండ్యా… ఆయన భార్య పేరు ఉర్సులిన్ బోనీ… ఆమె రూట్స్ స్లొవేనియా దేశానివి… ఆ ఇద్దరి సంతానమే సునీతా… ఈమె పెళ్లి చేసుకున్నది కూడా అమెరికన్‌నే… ఆయన పేరు మైఖేల్ విలియమ్స్… ఆమెకు, ఆమె తండ్రికి ఇండియా మూలాల మీద ప్రేమ… ఆమె తల్లికి స్లొవేనియా అంటే అభిమానం… సహజమే కదా…
Ads
కల్పనా చావ్లా… పుట్టింది హర్యానాలో… పంజాబ్‌లోనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకుంది… ఆ తరువాతే అమెరికా వెళ్లి, టెక్సాస్ యూనివర్శిటీలో ఏరో స్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసి, కొలరాడో యూనివర్శిటీలో సెకండ్ మాస్టర్స్ కూడా చేసి, పీహెచ్‌డీ కూడా పూర్తి చేసింది… అక్కడి నుంచి నాసాలోకి ఎంట్రీ… ఫస్ట్ స్పేస్ మిషన్ గ్రాండ్ సక్సెస్… కానీ సెకండ్ స్పేస్ మిషన్ రిటర్న్ జర్నీలో ఉండగా, భూవాతావరణంలోకి ప్రవేశిస్తున్న కీలకసందర్భంలో… ఆమె ప్రయాణిస్తున్న కొలంబియా స్పేష్ షటిల్ ప్రమాదానికి గురై, ఆమెతోపాటు సహప్రయాణికులు కూడా మరణించారు… ఇండియా కూడా కన్నీళ్లు పెట్టుకుంది… ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు జీన్ పియరె హారిసన్… ఆయన ఓ అమెరికన్… కొలంబియా ప్రమాదం తరువాత ఆమెపై సినిమా తీస్తానంటే కూడా ఆయన అంగీకరించలేదు…
బండ్ల శిరీష… నిన్నామొన్నటి వరకూ మనం చెప్పుకున్నాం కదా… మన గుంటూరు, మన తెనాలి అమ్మాయి… తల్లీదండ్రులతోపాటు నాలుగేళ్ల వయస్సులో వెళ్లి అమెరికాలోనే చదువుకుంది… టీనేజర్‌గా ఉన్నప్పుడే సింగిల్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ నడపడానికి లైసెన్స్ పొందింది… ఆమె నాసాలో ‘జీ గ్రావిటీ’ ఇన్‌టర్న్ కూడా… కానీ ఐసైట్ ప్రాబ్లం వల్ల తను కోరుకున్నట్టుగా ఆస్ట్రోనాట్ కాలేకపోయింది… పుర్డ్ యూనివర్శిటీకి చెందిన ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్ స్కూల్ నుంచి సైన్స్ డిగ్రీ తీసుకుంది, తరువాత వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసింది… మొన్న వర్జిన్ స్పేస్ క్యాప్సుల్‌లో తొలి మహిళా ఆస్ట్రో టూరిస్టుగా స్పేస్‌లోకి వెళ్లివచ్చింది… ఆమె త్వరలో పెళ్లిచేసుకోబోతున్న వ్యక్తి పేరు సియాన్ హు… తన రూట్స్, తన నేషనాలిటీ తెలియవు… పాశ్చాత్యం కాదు, తూర్పు దేశాల జాతీయుడు కావచ్చు బహుశా…
రాజా జాన్ వుర్పుటూర్ చారి… అలియాస్ చారి… తన రూట్స్ మన మహబూబ్‌నగర్‌వే… అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలోనే ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ చేశాడు… తరువాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ చేశాడు… వ్యోమగామిగా శిక్షణ కూడా పూర్తయ్యింది… అమెరికా భావి గ్రహాంతర, అంతరిక్ష ప్రయాణాలకు కమాండర్‌గా రెడీ… ఆయన పెళ్లి చేసుకున్నది ఒక అమెరికన్‌ను… ఆమె పేరు హోలీ షాఫ్టర్… వాళ్లకు ముగ్గురు పిల్లలు… ఆయన తండ్రి కూడా పెగ్గీ ఎగ్‌బర్ట్ అనే అమెరికన్‌ను పెళ్లి చేసుకున్నాడు…
ఈ నలుగురికీ మన ఇండియన్స్ రూట్స్ ఉన్నయ్… అందరికీ స్పేస్‌తో లింకుంది… అందరి గురించీ ఏదో సందర్భంలో గొప్పగా చెప్పుకుంటూనే ఉన్నాం, గర్వపడుతూనే ఉన్నాం… వీళ్లందరి జీవితాల్లో ఓ కామన్ పాయింట్ గమనించారా..? అందరూ విదేశీయులనే పెళ్లిచేసుకున్నారు… మనం ఇంకా కులాలు, గోత్రాలు, మతాలు, జాతకాల గీతల్లోనే గిరగిరా తిరుగుతున్నాం… కానీ వీళ్లు విశ్వమానవులు… దేశాలు, ఖండాలనే తేడాయేమీ లేదు వాళ్లకు… ప్రజల మధ్య గీయబడిన అన్ని గీతలూ చెరిపేసినవాళ్లు… టాప్ రేంజ్ ప్రొఫెషనల్ సైన్స్, ఇంజనీరింగ్ స్టడీస్.., అదే రేంజ్ జాబ్స్… సూటబుల్, అడాప్టబుల్ లైఫ్ పార్టనర్లను వెతుక్కుంటున్నారు… వాళ్ల లక్ష్యాలు, వాళ్ల ప్రయాణాల ముందు పెళ్లిళ్లు నిజానికి చిన్న విషయం…
కొన్నేళ్లుగా బోలెడు విమర్శలు వింటున్నాం కదా మనం… అమెరికా వెళ్లినా, అంటార్కిటికా వెళ్లినా, చివరకు అరుణగ్రహం వెళ్లినా, కొందరికి కులగజ్జి పోదు… పోవడం లేదు… ప్రతిచోటా అర్జెంటుగా కులసంఘాలు పెట్టేసి, తలతిక్క కీచులాటలకు, కులరాజకీయాలకు దిగుతున్నారు… మళ్లీ ఇండియాకు వచ్చి, అన్నిరకాలుగానూ తమకు ‘మ్యాచయ్యే మ్యాచు’లను వెతుక్కుని మరీ, వెంటేసుకుని పోతున్నారు… మనవాళ్ల ఆలోచన పరిధి ఇంకా బోలెడు లోకల్ పరిమితుల్లోనే ఉండిపోతోంది… ఇవే కదా మనం వినే అభిప్రాయాలు… అందరూ అలాంటోళ్లు అని కాదు… కానీ అధికులు అలాగే…!! మరి ఇందాక మనం చెప్పుకున్న ఈ నలుగురు..?! ఐడియన్ ఐకన్స్… అసలు ఇలాంటివాళ్లు కదా… కొత్తతరానికి ప్రతీకలు, సూచికలు..!! వాళ్ల ప్రపంచం సువిశాలం… అది ఖగోళమంత విస్తారం..!! ఇండియన్ వ్యోమగాముల గురించి చదువుతూ ఉంటే, ఈ కామన్ పాయింట్ ఒకటి సంబరంగా, చెప్పుకోదగిందిగా అనిపించింది… అదే ఈ కథనం… (ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే దిగువన ఉన్న కోడ్ స్కాన్ చేసి ముచ్చటకు అండగా నిలవండి…)
Share this Article